అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉద్యమబాట

  • రొజుకొకరు మరణిస్తున్నా చలనం లేని సర్కార్
  • అగ్రిగోల్డ్ సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలం
  • బాధిత కుటుంబాలకు పైసా ఇవ్వని అధికార టీడీపీ
  • ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైయస్సార్సీపీ ఉద్యమ కార్యాచరణ
  • బాధిత  కుటుంబాలకు మే మాసంలో పరామర్శ
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
హైదరాబాద్ః అగ్రిగోల్డ్ సమస్యను పరిష్కరించడంలో, బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించకపోవడం వల్లే సమస్య రోజురోజుకు జఠిలమవుతోందన్నారు.  అగ్రిగోల్డ్ బాధితురాలు నీరాబి ఆత్మహత్య, వెంకటనర్సమ్మల మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ముందుగా 3 లక్షలు ఇస్తామని బాబు ప్రకటించారని, వైయస్సార్సీపీ 10 లక్షలు ఇస్తే గానీ న్యాయం జరగదని డిమాండ్ చేశాక దాన్ని ఐదు లక్షలకు పెంచారని చెప్పారు.  ప్రకటించి నెల జరిగినా బాధిత కుటుంబాలకు ఒక్కొరికి కూడ పరిహారం అందలేదని వాపోయారు.  రోజుకొకరు మరణించే పరిస్థితి వస్తుంటే...ప్రకటించిన ఐదు లక్షలు వారి కుటుంబాలకు చేరకపోవడాన్ని వైయస్సార్సీపీ తీవ్రంగా పరిగణిస్తోందన్నారు.   ఈ సమస్యపై ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు ప్రధాన ప్రతిపక్షంగా వైయస్సార్సీపీ కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. మే మాసంలో ఆత్మహత్య చేసుకున్న అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాలను స్థానికంగా ఉన్న జిల్లా నాయకత్వం వెళ్లి పరామర్శిస్తుందని పేర్కొన్నారు. బాధిత కుటుంబాల్లో మనోధైర్యం నింపుతామని స్పష్టం చేశారు. ఆ కుటుంబాలకు వైయస్సార్సీపీ అన్ని విధాల అండగా ఉంటుందన్నారు.  టీడీపీ సర్కార్ మెడలు వంచైనా సమస్యను సాధ్యమైనంత త్వరలో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని మనవి చేశారు. సంవత్సర కాలంలోనే ఎన్నికలొచ్చే అవకాశం ఉన్నందున మంచి రోజులు వస్తాయని భావిస్తున్నామన్నారు. ప్రయారిటీ బేస్ మీద మొదటిగా ఈ సమస్యను పరిష్కరించాలని వైయస్సార్సీపీ భావిస్తోందన్నారు. మే మాసం తరువాత 5లక్షలు ఇవ్వకపోతే సీరియస్ గా జూన్ లో మరో కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళతామన్నారు. 

ఏపీలో 19లక్షల 50వేల కుటుంబాలు, ఇతర రాష్ట్రాల్లో 12 లక్షల 50వేల కుటుంబాలు...మొత్తంగా 32 లక్షల కుటుంబాలు అగ్రిగోల్డ్ బాధితులుగా ఉన్నారని అంబటి తెలిపారు. అగ్రిగోల్డ్ భూములపై చంద్రబాబు, లోకేష్ , కొందరి మంత్రుల కన్నుపడడం వల్లే సమస్య జఠిలమవుతోందన్నారు. హాయ్ లాండ్ లాంటి మంచి ఏరియాను అప్పనంగా  లోకేష్ బాబు మింగేయాలనుకోవడం వల్లే సమస్యలొస్తున్నాయన్నారు. 13లక్షల 83వేల 574మంది డిపాజిటర్లకు, రూ.1,182 కోట్లు మొత్తాన్ని కడితే.... 32లక్షల మందిలో 14లక్షల మంది సమస్య పరిష్కారమవుతుందని అంబటి అన్నారు.  ముందస్తుగా ఈమొత్తాన్ని చెల్లించి,  ఆతర్వాత అగ్రిగోల్డ్  ఆస్తులను జమ చేసుకోవాలని అడిగితే ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని అంబటి ధ్వజమెత్తారు.  సమస్యను పరిష్కరించే అవకాశమున్నా....హాయ్ లాండ్ ప్రాపర్టీని కాజేయాలన్న లోకేష్ దుర్బుద్ధి వల్లే జఠిలమవుతోందన్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం ఆస్తులను చౌకగా కాజేయాలనే కక్కుర్తి ప్రత్తిపాటి పుల్లారావు లాంటి కొందరికి కలిగిందని విమర్శించారు. దీనిపై సీబీఐ ఎంక్వైరీ జరిపిస్తామన్న మాటలు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. 
 
Back to Top