వైయస్ఆర్ కాంగ్రెస్ తెలంగాణకు వ్యతిరేకం కాదు

గద్వాల 08 ఆగస్టు 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని పార్టీ రాజకీయ వ్యవహారాలకమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్థన్ స్పష్టంచేశారు. రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం  తీసుకుందనీ, ఇది సరికాదనీ ఆయన చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, సింగిల్ విండో డైరెక్టర్లకు ఏర్పాటుచేసిన సన్మాన సభలో బాజిరెడ్డి ప్రసంగించారు. తెలంగాణ అంశంపై తమ పార్టీ ప్లీనరీ ప్రకటనకు కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. ఇరుప్రాంతీయుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాలన్నారు.  సంప్రదింపుల పేరిట అభిప్రాయాలు చెప్పాలని రాష్ట్రంలోని అన్ని పార్టీలను పిలిచిన కేంద్రం, నిర్ణయం వెలువరించే ముందు ఎందుకు పిలవలేదని నిలదీశారు.

వ్యతిరేక మీడియా ప్రచారాన్ని ప్రజలు నమ్మరు
తెలంగాణకు వ్యతిరేకంగా తమ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినట్లు తమ వ్యతిరేక మీడియా చేస్తున్న  ప్రచారాన్ని ప్రజలు నమ్మరని ఆయన చెప్పారు. తమ పార్టీ రెండు ప్రాంతాల ప్రజలకు అండగా నిలుస్తుందని,  పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఇడుపులపాయలో మరోసారి స్పష్టం చేసిన విషయం గుర్తుంచుకుని,  ఇప్పటికైనా తమపై బురదజల్లే పద్ధతి మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్, టీడీపీలు కుట్ర చేసి తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డిని అక్రమంగా జైలుకు పంపించాయని ఆరోపించారు. రెండు రాష్ట్రాలు ఏర్పడినా తమ పార్టీ ప్రభంజనం కొనసాగడం ఖాయమన్నారు. రాజన్న పాలనను ప్రజలు మళ్లీ చూస్తారని ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు. కేవలం తమ పార్టీ నుంచి కొండా సురేఖ బయటకు వెళ్లినంత మాత్రాన పార్టీ నుంచి తెలంగాణ వారంతా వెళ్లినట్లుగా పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

మహానేత తెలంగాణకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని గుర్తించాలి
దివంగత మహానేత డాక్టర్  వైయస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ అభివృద్ధికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని గుర్తుంచుకోవాలని విమర్శకులకు సూచించారు. మహబూబ్‌నగర్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్నం నాగిరెడ్డి, జిల్లా పార్టీ కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి, గద్వాల నియోజకవర్గ సమన్వయకర్త కృష్ణమోహన్‌రెడ్డి కూడా మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, కొండాపురం షఫిఉల్లా, చిన్నయ్య, కృష్ణారెడ్డి, మజీద్, గోవింద్, గంట రమేష్, భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top