ఎపిఎన్జీవోలపై దాడులు అమానుషం: మైసూరా

హైదరాబాద్, 10 సెప్టెంబర్ 2013:

ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు అమానుషమని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌కేంద్ర పాలక మండలి సభ్యుడు డాక్టర్ ఎం.వి.‌ మైసూరారెడ్డి అభిప్రాయపడ్డారు. 'సేవ్ ఆంధ్రప్రదే‌శ్' సభకు హాజరై స్వస్థలానికి బస్సులో తిరిగి ‌వెళుతున్న ఎపి ఎన్‌జివోలపై హయత్నగ‌ర్ వద్ద ‌గుర్తు తెలియని వ్యక్తులు చేసిన రాళ్ల దాడిలో గాయపడి ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్యనారాయణను మంగళవారం మైసూరారెడ్డి, జి. శ్రీకాంత్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, బి. గురునాథరెడ్డి తదితరులు పరామర్శించారు. అనంతరం ఆస్పత్రి బయట మైసూరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... దేశంలో ఎవరు ఎక్కడైనా సమావేశాలు నిర్వమించుకోవచ్చని ఆన్నారు‌. ఎపి ఎన్‌జివో నాయకుడు సత్యనారాయణపై దాడిని మైసూరారెడ్డి ఖండించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

సమైక్యాంధ్రకు కట్టుబడి ఉంటే.. రాష్ట్ర విభజనకు అనుకూలంగా చంద్రబాబు ఇచ్చిన లేఖను ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలని మైసూరారెడ్డి డిమాండ్ చేశారు. లేఖను వెనక్కి తీసుకుంటే చిత్తశుద్ధిని ప్రదర్శించినట్లవుతుందని లేదంటే.. కాంగ్రెస్, టిడిపిలు కలిసి డ్రామాలాడుతున్నాయని స్పష్టం అవుతుందన్నారు. చంద్రబాబు నాయుడు సీమాంధ్రలోకి వెళ్ళి సింహగర్జనుల చేసే బదులు తన విధానాన్ని స్పష్టం చేయాలన్నారు. చంద్రబాబు నాయుడు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం వల్లే ఇలాంటి దుస్థితి ఏర్పడిందని మైసూరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు మంత్రులు ఇప్పటి వరకూ ఒకలా మాట్లాడి ఇప్పుడు ప్రజలను తప్పుదారి పట్టించడానికి సంసిద్ధమయ్యారని ఆయన విమర్శించారు. మంత్రులకు చిత్తశుద్ధి ఉంటే సిడబ్ల్యుసి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని కాంగ్రెస్‌ అధిష్టానంపై ఒత్తిడి తేవాలని మైసూరారెడ్డి డిమాండ్‌ చేశారు. ఇలాంటి చర్యలు తీసుకోరు గానీ తెలంగాణపై తీర్మానం వచ్చే వరకూ సభ్యులుగా  కొనసాగుతారంట అంటూ ఎద్దేవా చేశారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా సెప్టెంబర్ 7న ‌ఎపి ఎన్జీవోలు హైదరాబాద్‌ ‌ఎల్బీ స్టేడియంలో సేవ్ ఆంధ్రప్రదే‌శ్ సభ నిర్వహించారు. ఆ సభకు సీమాంధ్ర ప్రాంతం నుంచి వేలాది మంది‌ ఎన్‌జివోలు హైదరాబాద్‌కు తరలి వచ్చారు. సభ ముగిసిన తరువాత శనివారం రాత్రి ఎపి ఎన్జీవోలు బస్సుల్లో స్వస్థలాలకు బయలుదేరారు. అయితే నగర శివారు ప్రాంతమైన హయత్‌నగర్ వద్ద సీమాంధ్రులు ప్రయాణిస్తున్న బస్సులపై ఆగంతకులు రాళ్ల వర్షం కురింపించారు. ఆ ఘటనలో సత్యనారాయణ తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన ‌సత్యనారాయణను వెంటనే హయత్‌నగర్లోని స‌న్రై‌స్ ఆసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్య చికిత్స కోసం సత్యనారాయణను నగరంలోని ఆపోలో ఆసుపత్రికి తరలిం‌చారు. సత్యనారాయణ కాకినాడలోని వాణిజ్య పన్నుల శాఖలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Back to Top