కేసీఆర్ క్షమాపణకు వైయస్ఆర్ కాంగ్రెస్ డిమాండ్

హైదరాబాద్ 30 సెప్టెంబర్ 2013:

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వైఖరిపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మండిపడ్డారు. సకల జన భేరి సందర్భంగా నిజాం మైదానంలో జరిగిన సభలో ఆయన ప్రసంగాన్ని పరిశీలిస్తే.. ఆత్మ విశ్వాసం లోపించిన అంశం బయటపడిందన్నారు. కేసీఆర్ ఉపయోగించిన భాష దీనిని వెల్లడించిందన్నారు. యూపీఏ తెలంగాణ ఇవ్వకపోతే ఎన్డీఏ ఇస్తుందని చెప్పడాన్ని ఆయనే ఎద్దేవా చేశారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో గట్టు రామచంద్రరావు సోమవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ మాట్లాడిన తీరులో భావదారిద్ర్యం కనిపించిందని చెప్పారు. అలాగే, భాషాపాటవాన్ని ప్రదర్శించడానికి సభను ఆయన ఉపయోగించుకున్నట్టుందన్నారు. ఆయన భాష, ఉపన్యాసం చూస్తే.. ఆత్మవిశ్వాసం లోపించిన  వ్యక్తిలా కేసీఆర్ కనిపించారని ఆరోపించారు. కేసీఆర్ యూపీఏ వెంట నడుస్తారా లేక ఎన్డీఏ వెంట వెడతారా తేల్చుకోవాలని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల వరకూ యూపీఏతో ఉండి, తదనంతరం ఎన్డీఏ పంచన చేరేలా ఆయన వైఖరి కనిపిస్తోందన్నారు. ఎదుటివాణ్ణి తిట్టి తను లబ్ధి పొందాలన్న వైఖరి కేసీఆర్ అవలంబిస్తున్నారని గట్టు మండిపడ్డారు. అభిమానిగా మాట్టాడితే లబ్ధి చేకూరుతుందనీ, ఉన్మాదిలా మాట్లాడితే తెలంగాణకు నష్టం వాటిల్లుతుందనే విషయాన్ని తెలుసుకోవాలని హితవుపలికారు. కేసీఆర్ విభజన కావాలని కోరుకున్నట్లయితే రెండు ప్రాంతాల నడుమ వైషమ్యాలు, ఘర్షణ పూర్వక వాతావరణాన్ని సృష్టించకూడదని సూచించారు. మూడున్నర జిల్లాల్లో ఉన్న టీఆర్ఎస్‌ను పది జిల్లాలకు విస్తరించేందుకు ఆయన ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని గట్టు ఆరోపించారు. కేసీఆర్ మాట తీరు ఒక పంచాయతీ సర్పంచి స్థాయిలో కూడా లేదన్నారు.
దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్‌పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వింటే చాలా ఆశ్చర్యమనిపించిందని చెప్పారు. మనిషన్నవాడెవడూ అలా మాట్లాడడని స్పష్టంచేశారు. మహానేత మరణం తర్వాత రవీంద్ర భారతిలో ఏర్పాటయిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ వైయస్ఆర్ మృతితో రాష్ట్ర ప్రజల హృదయాలు ఘోషిస్తున్నాయని చెప్పారన్నారు. ఆ మాటలు విన్న వారు నిన్న కేసీఆర్ మాటలు వింటే మరోసారి ఘోషిస్తాయని చెప్పారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధిని కాంక్షించన వ్యక్తి రాజశేఖరరెడ్డిగారని గట్టు చెప్పారు. ఆయన పథక ప్రయోజనాలు ప్రతి గడపకూ చేరాయన్నారు. రాజశేఖరరెడ్డిగారి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారిలో సగానికి పైగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారేనన్నారు. 1,17,000 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన జలయజ్ఙం పనులలో 85వేల కోట్ల రూపాయలను తెలంగాణకే కేటాయించిన అంశాన్ని కేసీఆర్ విస్మరించారని మండిపడ్డారు. వెనుకబాటు తనాన్ని రూపుమాపాలనే కాంక్షతో మహానేత చేపట్టిన పథకాలలో అత్యధిక భాగం తెలంగాణకు కేటాయించిన మహానేత మరణం గురించి కేసీఆర్ మాట్లాడిన తీరు శోచనీయమన్నారు. విభజనను వ్యతిరేకించారు కాబట్టే రాజశేఖరరెడ్డిగారు మరణించారని చెప్పడాన్ని తప్పుపట్టారు. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ కూడా విభజనను వ్యతిరేకించారు... వారు కూడా అందుకే మరణించారా అని గట్టు ప్రశ్నించారు. మహానేత మరణం మీద మాకు అనుమానులున్నాయనీ, కేసీఆర్ మాట్లాడిన తీరు చూస్తుంటే ఆ సంఘటన వెనుక ఏ కుట్ర వుందో ఆయనకు తెలుసని అనుకోవాల్సి ఉంటుందనీ చెప్పారు. తెలిస్తే ఆ కుట్రేమిటో వెల్లడించాలని ఆయన కేసీఆర్ను డిమాండ్ చేశారు. రాజన్న మరణం మీద మాట్లాడిన కేసీఆర్ తక్షణం క్షమాపణ చెప్పాలని కోరారు. ఆయన మాట్లాడిన మాటలు ఒక మనిషి మాట్లాడాల్సినవి కావని గట్టు పేర్కొన్నారు.

విభజనను వ్యతిరేకించిన రాజశేఖరరెడ్డిగారు పావురాళ్ళగుట్టలో చనిపోయారనీ, ఇప్పుడు తెలంగాణను వ్యతిరేకిస్తున్న జగన్మోహన్ రెడ్డిగారు కానీ, చంద్రబాబునాయుడు కానీ వెంట్రుక కూడా పీకలేరన్నారనీ, ఇదేం భాషనీ గట్టు కేసీఆర్‌ను నిలదీశారు. ఒక స్థాయి గల రాజీకీయ నేత వాడాల్సిన భాషేనా ఇదని అడిగారు. ఇలా మాట్లాడి కేసీఆర్ సాధించదలచుకున్నదేమిటన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో ఎటువంటి లబ్ధి పొందాలనుకుంటున్నారని అడిగారు. కేసీఆర్ ఉపన్యాసమంతా సొంత డబ్బా.. పర నిందా అన్నట్లుగా సాగిందన్నారు. కేసీఆర్ ఉపన్యాసం విభజన కోరుతున్న వారికి ఉపయోగించేలా లేదని గట్టు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ హైకమాండ్, కిరణ్, కేసీఆర్, టీడీపీ సంయుక్తంగా ప్రజాభిమానం గల శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎలా కుట్ర పన్నారో అర్థమవుతోందని చెప్పారు. కేసీఆర్ తన ప్రసంగంలో కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శించనట్లు కనిపించలేదన్నారు. సమైక్యాంధ్రకు హీరో కిరణ్, విభజనకు హీరో కేసీఆర్ అని చెప్పినట్లుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని టీడీపీ వారు జగన్మోహన్ రెడ్డిగారిని కేసీఆర్ విమర్శించలేదని చెప్పడం శోచనీయమన్నారు. ఏతావాతా తేలిందేమిటింటే కాంగ్రెస్ పార్టీకి టీడీపీ రాష్ట్రంలో బ్రాంచి ఆఫీసుగా మారిందనే విషయం వెల్లడైందన్నారు. విభజన కోరుకుంటున్న కేసీఆర్ ని తెలంగాణ పది జిల్లాల్లో క్రమేపీ వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటీవలి రాజీనామాలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణని గట్టు చెప్పారు.

Back to Top