చంద్రబాబుపై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్

టీడీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తిచేసింది. ఈమేరకు శనివారం ఆ పార్టీ లెజిస్లేచరి కమిటీ గవర్నరును కలిసి వినతి పత్రం సమర్పించింది. గవర్నరుకు రాసిన లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది..

గౌరవనీయులైన
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర
గవర్నరు గారికి,

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన తొమ్మిదేళ్ళూ రాష్ట్రం రోజుకో కుంభకోణంతో అతలాకుతలమైంది. కాగ్ వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. తక్కువ సామర్థ్యం గల విద్యుత్తు ప్రాజెక్టుల మంజూరు, బీపీఎల్ పవర్ ప్రాజెక్టు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థయిన ఏపీజిపిసిఎల్ కంటే 200శాతం ఎక్కువగా స్పెక్ట్రమ్, జీవీకే సంస్థలకు  ధరను నిర్ణయించడం అంశాలపై కాగ్ చంద్రబాబునాయుడు వైఖరిని తూర్పారపట్టింది. ఏపీజీపీసీఎల్ తన 174 మెగావాట్ల కంబైన్డు సైకిల్ గ్యాస్ బేస్‌డ్ పవర్ ప్రాజెక్టుకు మెగావాట్ ధర 2.70కోట్ల రూపాయల ధరను అమలుచేయగా.. జివికె, స్పెక్ట్రమ్ కంపెనీలకు 4.50కోట్లుగా చేసుకునేందుకు అనుమతించారు.
వివిధ ప్రాజెక్టుల మంజూరు, కాకినాడ ఓడరేవు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, హైటెక్ సిటీ ప్రాజెక్టు, ఐఎమ్‌జీ, ఇమార్, కోనసీమ పవర్ ప్రాజెక్టు, తదితరాల కేటాయింపులో చంద్రబాబుపై లెక్కకుమిక్కిలి ఫిర్యాదులు వచ్చాయి. హైటెక్ సిటీ ప్రాజెక్టుకు గ్లోబల్ టెండర్లు పిలవకుండానే కొద్దిమందికే పరిమితం చేసి తన అభిమాన ఎల్ అండ్ టి కంపెనీకి రాష్ట్రానికి కేవలం 11 శాతమే ఈక్విటీ లభించేలా చేశారు. హైటెక్ సిటీకోసం రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థకు వాణిజ్య ప్రాంతంలో అత్యంత ఖరీదైన స్థలాన్ని ఉచితంగా ఇచ్చింది. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో స్థలాన్ని కేటాయించిన యజమానికి 50 శాతం ఈక్విటీ షేర్ ఇచ్చారు. ఈ అంశంలో చట్టాన్ని చంద్రబాబు ఏ రకంగా తోసిరాజన్నారో సుస్పష్టం.
ఐఎమ్‌జీ భారత్ సంస్థకు మార్కెట్ విలువకంటే అయిదు శాతం కంటే తక్కువ ధరకు భూముల కేటాయింపు టీడీపీ హయాంలో చోటుచేసుకున్న అవినీతిలో ప్రముఖమైనది. ఇది భారత దేశంలోనే అతి పెద్ద కుంభకోణాలలో ఒకటి. క్రీడలకు ప్రోత్సాహం ముసుగులో  అత్యంత ఖరీదైన భూముల్ని చేజిక్కించుకోవడానికి రచించిన పక్కా ప్రణాళిక ఇది. 2003లో రాష్ట్ర అసెంబ్లీ రద్దయిన తర్వాత అప్పటి టీడీపీ ప్రభుత్వం 850 ఎకరాలను చంద్రబాబు నాయుడు సన్నిహితుడైన చిత్తూరు జిల్లాకు చెందిన అహోబిల రావు ప్రమోటర్ గా ఉన్న ఐఎమ్‌జీ కంపెనీకి కేటాయించారు. ఈ అంశాన్ని చంద్రబాబు కనీసం క్యాబినెట్ దృష్టికి కూడా తీసుకెళ్ళలేదు. ఎమ్ఓయూ ప్రకారం సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన 400 ఎకరాల భూమిని ఐఎమ్‌జికి ఎకరానికి యాబై వేల రూపాయల చొప్పున ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. వాస్తవానికి మార్కెట్ విలువ ప్రకారం ఎకరా మూడు కోట్ల రూపాయలు. శంషాబాద్ ప్రాంతంలోని 450 ఎకరాలను కూడా ఇచ్చారు. ఆ స్థలం ఇప్పుడు ఎంతో అమూల్యమైనదిగా మారింది. ఈ స్థలాన్ని ఎకరం 25వేల రూపాయలకు చంద్రబాబు ప్రభుత్వం విక్రయించింది. విమానాశ్రయం ప్రారంభించిన అనంతరం మరో 25వేలు చెల్లించేలా నిబంధన పెట్టింది. ఆ ప్రాంతంలో రోడ్లు, మౌలిక వసతుల కల్పనకు వినియోగించేందుకు ఈ మొత్తాన్ని ఉద్దేశించింది. ఈ స్థలం విలువ ఎకరం కోటి రూపాయల వరకూ ఉంది. ఐఎమ్‌జీ యూఎస్ అనుబంధ సంస్థని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం విశ్వసించింది. వాస్తవానికి  ఐఎమ్‌జీ తాను ఫ్లోరిడాలోని ఐఎమ్జీ అకాడమీ అనుబంధమని రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కదోవ పట్టించింది. ఈ అంశంపై చర్చలు గానీ, సంప్రతింపులు గానీ జరిగిన దాఖలాలు లేవు. ఐఎమ్జీ సంస్థ కేవలం లక్ష రూపాయలు మాత్రమే షేర్ క్యాపిటల్ గా చెల్లించింది. అందులో 99శాతాన్ని అహోబిలరావు తన అధీనంలో ఉంచుకున్నారు. మిగిలిన ఒక శాతాన్ని ఆయన సోదరుడు ప్రభాకరరావు తన స్వాధీనంలో ఉంచుకున్నారు. కుప్పంలో ప్రశ్నార్థకంగా మిగిలిన ఇజ్రాయిల్ డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రభాకరరావుకు మంజూరయ్యేలా చంద్రబాబు వ్యవహరించారు. ఇంతే కాకుండా.. ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిన ఎనిమిది స్టేడియాలను శ్యామ్ కంపెనీకి 45 సంవత్సరాల లీజుకు ఇచ్చారు. ఇందులో మొదటి ఐదు సంవత్సరాలు స్టేడియాల నిర్వహణకు ఏడాదికి 2.5 కోట్ల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. 45 సంవత్సరాల తర్వాత తాను నిర్ణయించిన ధరకు వాటిని ఐఎమ్జీ కొనుగోలు చేస్తుంది. మూడేళ్ళపాటు నీరు, విద్యుత్తు సౌకర్యాలను ఉచితంగా కల్పించడంతోపాటు పదేళ్ళ పాటు వీటి ఆదాయంపై వినోదపన్ను మినహాయింపునిచ్చింది. ఈ మొత్తం లావాదేవీ వెనుక టీడీపీ ప్రభుతవ్వ పెద్దల హస్తముంది. ఈ అంశంలో మరో విచిత్రమైన విషయమేమిటంటే దర్యాప్తునకు సిబ్బంది లేరని సీబీఐ తప్పించుకోవడం. ఇదే సీబీఐ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారి ఇళ్ళపై దాడులకు మాత్రం 28 బృందాలను ఏర్పాటుచేసి, రోజుల వ్యవధిలో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

2001లో టీడీపీ ప్రభుత్వం ఇమార్ సంస్థకు ఎకరానికి 28 లక్షల రూపాయల చొప్పున 535 ఎకరాలను కేటాయించింది. 1998లోనే అక్కడికి సమీపంలోని తన భూమిని చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి ఎకరా కోటి రూపాయలకు విక్రయించారు. బీహెచ్ఈఎల్ వంటి సంస్థకు ఈ స్థలాన్ని ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున రాయితీ విక్రయించి ఉంటే ఆదాయం సమకూరుతుందనీ, ఉపాధి దొరుకుతుందనీ అనుకుని ఉండేవారం, కానీ అది లగ్జరీ విల్లాల నిర్మాణానికీ, గోల్ఫు కోర్సు ఏర్పాటకూ ఆ స్థలాన్ని ఇమార్ కొనుగోలు చేసింది. ఎందుకింత సబ్సిడీని ప్రభుత్వం ఇచ్చింది అనే ప్రశ్నకు ఇమర్ ప్రమోటరుతో చంద్రబాబు నాయుడు వ్యక్తిగత సంబంధబాంధవ్యాలున్నాయి. 250 ఎకరాలు చాలన్న ప్రమోటరుకు 500 ఎకరాలు కేటాయించిన చంద్రబాబు ఉదారత చాటడానికి ఇంతకంటే వేరే ఉదాహరణ అవసరం లేదు. ఈ ప్రాజెక్టు కూడా గ్లోబల్ టెండర్ల ద్వారా నిర్ణయించలేదు. ఆహ్వానించిన కొద్దిమంది పెట్టుబడుదారుల మధ్యే ఈ ఒప్పదం జరిగిపోయింది. ఇమార్ అంశంపై లోతుగా విచారించిన సీబీఐ చంద్రబాబు నాయుడు విచారించడానికి తిరస్కరించింది. ఇమార్ ప్రాజెక్టు వల్ల 1200 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.

ఇవే కాక, ఏలేరు కుంభకోణం, టీడీపీ నేతలతో కలిసి రామకృష్ణగౌడ్ పాల్పడిన దొంగ నోట్ల వ్యవహారం, స్టాంప్ పేపర్ల కుంభకోణం కూడా ప్రస్తావనార్హం. కోలా కృష్ణమోహన్ తో చంద్రబాబు ఏ విధంగా అంటకాగిందీ అందరికీ తెలిసిందే.
సీపీఎం పార్టీ తెలుగు దేశం ప్రభుత్వం కుంభకోణాలను వివరిస్తూ ఏకంగా చార్జీషీటునే విడుదల చేసింది. భారతీయ జనతా పార్టీ కూడా చంద్రబాబు నాయుడుపై 1998లో వంద ఆరోపణలు చేసింది. తమకు కనుక అధికారం ఇస్తే చంద్రబాబునాయుడును అరెస్టు చేస్తామని కూడా ఆ సందర్భంగా తెలిపింది. అనంతరం, లోక్ సభలో చంద్రబాబు మద్దతు అవసరమై చార్జి షీటు సంగతినే మరిచింది.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో మద్దతు అవసరం కావడంతో చంద్రబాబుకు మరోసారి అదృష్టం కాలిదగ్గరకొచ్చింది. 90మంది టీడీపీ ఎమ్మెల్యేల  మద్దతుతో కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతోంది. ప్రజల మీద భారాన్ని మోపుతోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుపై చేసిన ఆరోపణలను కాంగ్రెస్ అందుకే పట్టించుకోవడం లేదు.

ప్రస్తుతం చంద్రబాబు రాష్ట్రాన్ని విభజించడంలో కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభావాన్ని కనీసం తెలంగాణ ప్రాంతంలోనైనా తగ్గించాలనే తాపత్రయంతో ఆయన ఈ కుయుక్తికి పూనుకున్నారు. ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడనే నానుడిని అనుసరించి కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశవాద పొత్తును కొనసాగిస్తూ, చంద్రబాబుపై దర్యాప్తులు చేయించకుండా కాలం వెళ్లదీస్తోంది. అవినీతి, అనైతికతల ఛాంపియన్ అయిన చంద్రబాబు తన హయాంలో సాగిని కుంభకోణాలను మరిచి, ప్రస్తుతం తాను అవినీతి పారదోలతానని చెబుతున్నారు. అక్టోబర్ 2న న్యూఢిల్లీలో అవినీతి వ్యతిరేక సదస్సును నిర్వహించాలని ప్రయత్నిస్తున్నారు.
సమానత్వం కోరుకునే వారు ముందు తమ చేతలను నిష్కళంకంగా ఉండాలనే నానుడిని గుర్తుతెచ్చుకోవాలి.  ఈ క్రమంలో టీడీపీ హయాంలో సాగిన అవినీతి, అక్రమాలపైన, ప్రత్యేకంగా ఇమార్, ఐఎమ్జీ వ్యవహారలపైనా సీబీఐ దర్యాప్తు చేయించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలి.

మీ విశ్వసనీయులు

వైయస్ఆర్ కాంగ్రెస్ లెజిస్లేచరి పార్టీ

Back to Top