ఈ మాటే ఆనాడెందుకు చెప్పలేదు?

హైదరాబాద్‌ :

దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి హయాంలో తాము జారీచేసిన జీ‌ఓలన్నీ నిబంధనల ప్రకారమే జారీ చేశామని ఇప్పుడు చెబుతున్న మంత్రులు.. ఆనాడు అదే విషయాన్ని హైకోర్టు అడిగినప్పుడు ఎందుకు అఫిడవిట్‌ దాఖలు చేయలేదని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ శాసనసభా పక్షం ప్రశ్నించింది. ఆ జీఓలన్నీ సక్రమమైతే క్విడ్ ప్రో కో ఎలా సాధ్యమని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రశ్నించారు.

‌శాసనసభ సమావేశాలు సోమవారం వాయిదా పడిన అనంతరం ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు, ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, కె. శ్రీనివాసులు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్‌లో పత్రికా ప్రతినిధులతో మాట్లాడారు.

 ‘కళంకితులంటే మంత్రులు బాధపడుతున్నారు. తామిచ్చిన జీఓలన్నీ బిజినెస్ రూ‌ల్సు ప్రకారం మంత్రివర్గంలో సమష్టిగా తీసుకున్న నిర్ణయాలే అని వారు చెబుతున్నారు. మరి అప్పట్లో రాజశేఖరరెడ్డిపై ఆరోపణలు చేసినప్పుడు ఇదే విషయాన్ని ఎందుకు చెప్పలేదని వారు సూటిగా ప్రశ్నించారు. చట్ట ప్రకారమే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నప్పుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని జైలులో ఎందుకు పెట్టారు? ఇది కుట్ర కాదా?’ అని కాపు రామచంద్రారెడ్డి నిలదీశారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, గీతారెడ్డి సోమవారంనాడు అసెంబ్లీలో చెప్పిన మాటలను బట్టి ఆ జీఓలన్నీ మంత్రివర్గ సమష్టి నిర్ణయాలే అన్న విషయం స్పష్టమైందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని కోరారు. ‌మహానేత డాక్టర్ వైయస్ కుటుంబాన్ని వెలివేయాలని వ్యాఖ్యానించిన ఆనం రామనారాయణరెడ్డిలో మనిషి లక్షణాలు లేవని.. ఏ కోర్టూ నిర్ధారించకుండానే వైయస్ కుటుంబాన్ని దోషిగా చూపే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు.

ముఖ్యమంత్రి‌గా డాక్టర్ వైయస్‌ రాజశేఖరరెడ్డి గానీ, మంత్రిగా తాను గానీ రెండు ఎకరాల భూమి కంటే ఎక్కువ ఇవ్వలేమని, వివిధ సంస్థలకు జరిగిన భూ కేటాయింపులన్నీ కేబినె‌ట్ సమష్టి నిర్ణయాలే‌ అని గతంలో ధర్మాన ప్రసాదరావు చెప్పారని జూపూడి గుర్తుచేశారు. ‘అవన్నీ రాష్ట్ర అభివృద్ధి కోసం మంత్రివర్గం సమష్టిగా తీసుకున్న నిర్ణయాలని అసెంబ్లీలో చెప్పిన మంత్రి గీతారెడ్డి.. ఇదే విషయాన్ని బయట ప్రజలకు కూడా చెప్పాలి’ అని ఆయన సూచించారు. శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డికి రాష్ట్రంలో ప్రజాదరణ పెరుగుతోందని భయపడే కాంగ్రెస్, ‌టిడిపిలు కుమ్మక్కై ఒకరికొకరు సహకరించుకుంటూ వైయస్ కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతున్నాయని శ్రీనివాసులు ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా ఈ విషయం ‌స్పష్టమైందన్నారు. అయితే.. తమకు ఒకరంటే ఒకరికి పడదని ప్రజలను నమ్మించడానికే కాంగ్రెస్, ‌టిడిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఒకరినొకరు తిట్టుకుంటున్నట్టు నాటకాలు ఆడుతున్నారని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ ఎమ్మెల్యేలు విమర్శించారు.

Back to Top