రైతు దినోత్సవంగా వైఎస్ జయంతి

హైదరాబాద్, సెప్టెంబర్ 2: రైతాంగానికి ఎనలేని ప్రయోజనాలు కల్పించి అన్నదాతను రారాజును చేసిన దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి రోజైన జూలై 8ని రైతు దినోత్సవంగా ప్రకటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్షం డిమాండ్ చేసింది. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ లో వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష సమన్వయకర్త గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు నారాయణ స్వామి, చెవిరెడ్డి భాస్కర రెడ్డిలు మాట్లాడారు.

విత్తన కంపెనీల దోపిడీ నుంచి రైతులను వైఎస్ విముక్తులను చేశారన్నారు. పత్తి విత్తనాలను రైతులకు అందుబాటులోకి తేవడానికి మోన్ శాంటో లాంటి బహుళ జాతి కంపెనీ మెడలు వంచి రైతుల పక్షాన నిలిచిన రైతు పక్షపాతి శ్రీ వైఎస్ అని అన్నారు. అలాంటి వైఎస్ పై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న టీడీపీ సభ్యుల మానసిక స్థితి సరిగా లేదేమోనని అనుమానం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రకటించిన రుణ మాఫీ ద్వారా రాష్ట్రంలోని రైతులందరికీ లబ్ది చేకూర్చి, రుణాలు కట్టిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భరించేలా 2 వేల కోట్ల రూపాయలు అందించిన వైఎస్ రాజశేఖర రెడ్డితో చంద్రబాబును ఏ కోణంలోన పోల్చలేమని గడికోట చెప్పారు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రుణమాఫీపై రోజుకో మాట, పూటకో పాట పాడుతూ రైతాంగాన్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Back to Top