ఓర్వలేకే వైయస్‌పై దిగ్విజయ్‌ ఆరోపణలు

హైదరాబాద్ :

వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ‌ రాష్ట్రంలో దూసుకుపోతున్న తీరును చూసి ఓర్వలేకే రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ దివంగత‌ మహానేత డాక్టర్ వైయస్ ‌రాజశేఖరరెడ్డి లక్ష్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారని పార్టీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎల్పీ నాయకుడిగా 1999లో వైయస్ఆర్ ఉన్నప్పుడు రాష్ట్ర విభజనకు చొరవచూపార‌ంటూ దిగ్విజయ్ ‌చెప్పడాన్ని ఆయన ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ‘తెలంగాణ అంశంపై 2001లో సిడబ్ల్యుసి రెండవ ఎస్సార్సీ వేయాలని తీర్మానం చేసిన విషయాన్ని దిగ్విజయ్ మరిచినట్టున్నారు. అదే విషయాన్ని వైయస్ఆర్ స్వయంగా ‌అసెంబ్లీలో స్పష్టంగా చెప్పారు. ఆ విషయం మరిచిపోయారా?’ అని సూటిగా ప్రశ్నించారు.

ఈ లోకంలోనే లేని మహానేత డాక్టర్ వై‌యస్ఆర్ ఇక తిరిగిరారని, సమాధానం చెప్పుకోలేరని గ‌త నాలుగేళ్లుగా ఆయన  ప్రతిష్టను దెబ్బతీయటానికి కాంగ్రెస్ నాయకులు ఇ‌ష్టం వచ్చినట్లు మాట్లాడటమే కాకుండా.. ఎఫ్‌ఐఆర్‌లో పేరు నమోదు చేసిన ఘనకీర్తి కాంగ్రెస్ నాయకులద‌న్నారు. అలాంటి వారు ఎంతకైనా తెగించి మాట్లాడతారని శ్రీనివాసులు దుయ్యబట్టారు. ‘వైయస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర విభజనపై అసెంబ్లీలో తీర్మానం చేశారని నిరూపించగలరా? కనీసం దానికి సంబంధించిన రికార్డులనైనా చూపగలరా?’ అని‌ కొరుముట్ల ప్రశ్నించారు.

‘2004, 2009 ఎన్నికల మేనిఫెస్టోలు, పొత్తుల గురించి మాట్లాడుతున్నారే.. ఆనాడు టిఆర్‌ఎస్‌తో పొత్తు వద్దని వైయస్ఆర్ చె‌బితే.. తప్పనిసరిగా పెట్టుకోవాలని చెప్పింది కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం కాదా?’ అని నిలదీశారు. పెపైచ్చు ఆ మేనిఫెస్టోల్లో ఏం ఉందన్న విషయం కూడా మర్చిపోయి నిందలు మోపటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

మనుగడ ప్రశ్నార్థకం కావటం వల్లే కాంగ్రెస్‌ జిమ్మిక్కులు :

‘రాజశేఖరరెడ్డి వారసత్వం వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీదే అని ప్రజలు తేల్చిన కారణంగానే కదా ‌ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వం వైయస్ఆర్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతోంది? రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ను ప్రజలు ఆదరిస్తుంటే.. కాంగ్రెస్ భవిష్యత్తు, మనుగడ ప్రశ్నార్థకం కావటం‌ వల్లే కదా ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతున్నారు?’ అని కొరుముట్ల దుయ్యబట్టారు. తెలంగాణ వెనుకబాటుతనంపై వైయస్ఆర్ అనేక సందర్భాల్లో మాట్లాడారని, తన హయాంలో తెలంగాణను సస్యశ్యామలం చేయాలని ‌ఆయన కలలు కన్నారని పేర్కొన్నారు. తెలంగాణ అంశం వచ్చినప్పుడు వస్తుంది.. అప్పటివరకు ఆ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్నదే వైయస్ఆర్ సంకల్పమని‌ కొరుముట్ల శ్రీనివాసులు చెప్పారు.

రోశయ్య కమిటీని వైయస్ఆర్ వేసిన విషయం మరిచారా?‌:
‘చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు రాష్ట్రం కరువు కాటకాలతో అల్లాడుతుంటే చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు 'ప్రజాప్రస్థానం' పాదయాత్ర చేయాలని సంకల్పించినప్పుడు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నాయకులు కొందరు వై‌యస్ఆర్‌ను సైమన్‌తో పోల్చి గో‌ బ్యాక్ అంటూ నినాదాలు చేస్తామని చెప్పిన విషయం మరిచిపోయారా?’ అని కొరుముట్ల ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా వైయస్ఆర్ బాధ్యతలు చేప‌ట్టిన తరువాత 2009లో ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాల మేరకే నిర్ణయం జరగాలని, ఆ విషయాలను చర్చించటానికి అసెంబ్లీ వేదికగా రోశయ్య నేతృత్వంలో కమిటీ వేసిన విషయం దిగ్విజయ్‌ సింగ్ మరిచిపోయి తమ రాజకీయ ప్రయోజనాల కోసం ‌ఇప్పుడు అందుకు భిన్నంగా ఒక పథకం ప్రకారం వైయస్ఆర్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

‌‘కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఇష్టానుసారంగా తీసుకున్న నిర్ణయాల వల్లే ప్రస్తుతం రాష్ట్రం అతలాకుతలమైంది. సీమాంధ్రలో ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమం చేస్తుంటే ఏమీ పట్టించుకోకుండా నిద్రపోయిన ముఖ్యమంత్రి తొమ్మిది రోజుల తర్వాత నిద్రలేచి వైయస్ఆర్ గురించే మాట్లాడారు తప్ప.. అసలు సమస్యకు కారణమైన కాంగ్రె‌స్‌ను, ఆ పార్టీ నాయకత్వం గురించి మాట్లాడలేదంటేనే ఢిల్లీ నుంచి గల్లీ వరకు అధిష్టానం పథకం ప్రకారమే జరుగుతోందని కాకుండా మరేమనుకోవాలి’ అని కొరుముట్ల మండిపడ్డారు.

తాజా ఫోటోలు

Back to Top