26 నుంచి కాకినాడలో వైయస్‌ జగన్‌ ప్రచారం

కాకినాడ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ నెల 26 నుంచి కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. గోదావరి జిల్లాలో టీడీపీ పరువు కాపాడుకునేందుకు కుట్రలు, కుతంత్రాలకు తెర లేపిందని ఆయన మండిపడ్డారు. మంగళవారం చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, తదితరులు మీడియాతో మాట్లాడారు. కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తధ్యమని ఇంటలిజెన్సీ రిపోర్టు అందడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పనులు మానుకొని 25, 26వ తేదీల్లో ప్రచారం చేస్తున్నారన్నారు. కాకినాడలోని ఒక్కో డివిజన్‌కు ఒక్కో టీడీపీ ఎమ్మెల్యేను, 16 మంది మంత్రులను, మూడు డివిజన్లకు ఒక్క ఎంపీకి ఎన్నికల బాధ్యతలు అప్పగించారన్నారు. ఎన్నికల కోసం టీడీపీ రూ.48 కోట్ల నిధులను మంత్రులు యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లారావు సమకూర్చారని ఆరోపించారు. వార్డుకు కోటి రూపాయలు ఖర్చు చేయనున్నారని విమర్శించారు. టీడీపీది నీతివంతమైన పాలన అయితే ఆ డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు. మీ పరిపాలనను ప్రజలు నమ్ముతుంటే అంత డబ్బు ఎందుకు అని నిలదీశారు. టీడీపీ నేతల భయంతోనే మా గెలుపు ప్రారంభమైందని చెప్పారు.

వైయస్‌ జగన్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు
రాష్ట్ర ప్రజలు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. టీడీపీ పతనం కాకినాడ నుంచే ప్రారంభమవుతుందన్నారు.ఒక మనిషిని ఒక రోజు మోసం చేయవచ్చు... ఒక్క సారి మోసం చేయవచ్చు అన్నారు. అయితే ఎల్లకాలం ఇది సాగదన్నారు. కాకినాడలోని విజ్ఞులైన ప్రజలను పదే పదే మోసం చేయడం చంద్రబాబు తరం కాదన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయని కారణంగా టీడీపీకి బుద్ధి చెప్పేందుకు కాకినాడ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి  వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధన కోసం, రాజన్న రాజ్యాన్ని వైయస్‌ జగన్‌ మళ్లీ తీసుకువస్తారనే విశ్వాసం ప్రజల్లో ఉందన్నారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాజన్న పాలన అందిస్తారని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top