నిర్వాసితుల జీవితాల్లో కొత్త వెలుగు

భిక్షాటన చేస్తున్న గిరిజనుల బతుకుల్లో చిగురించిన ఆశ
వైయస్‌ జగన్‌ ప్రకటనతో పోలవరం ముంపు ప్రాంత వాసుల్లో సంతోషం
అధికారంలోకి రాగానే ఎకరాలకు రూ. 5 లక్షలు ఇస్తానని హామీ
వైయస్‌ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన గిరిజనులు
తూర్పుగోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ ప్రకటనతో తమ బతుకుల్లో ఆశ చిగురించిందని పోలవరం నిర్వాసితులు సంతోషం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో పోలవరం ముంపు ప్రాంతాల గిరిజనులు వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ మేరకు జననేతకు కృతజ్ఞతలు తెలిపి.. మేమంతా నీ వెంటే ఉన్నామనే సంకేతాన్ని ఇచ్చారు. పోలవరం నిర్వాసితుల పట్ల ప్రభుత్వం తమపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యతో ఇతర ప్రాంతాలకు తరలివెళ్లి భిక్షాటన చేసుకుంటున్నామని, జననేత ప్రకటనతో బతుకులకు నూతన ఉత్సాహం వచ్చిందన్నారు. పోలవరం నిర్వాసితులను ఆదుకుంటామని వైయస్‌ జగన్‌ ప్రకటించారు. భూమి కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ. 5 లక్షలు అదనంగా ఇస్తానని చెప్పారు. దీంతో ఆ ప్రాంత గిరిజనులంతా హర్షం వ్యక్తం చూస్తూ వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 

న్యాయమైన పరిహారం అందించాలని డిమాండ్‌ చేస్తే తమపై చంద్రబాబు అక్రమంగా కేసులు బనాయించారని పోలవరం నిర్వాసితులు వైయస్‌ జగన్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన తరువాత 2013 భూసేకరణ చట్టం ప్రకారం.. రూ. 10.8 లక్షల పరిహారం ఇవ్వాలని, ముఖ్యమంత్రి అయిన తరువాత పోలవరం ముంపు మండలాలకు వచ్చిన చంద్రబాబును న్యాయమైన పరిహారం ఇవ్వాలని అడిగితే.. గతంలో ఇచ్చిన ప్యాకేజీ జోలికి రానని, రూ. 1.15 లక్షతోనే సరిపెట్టుకోవాలని నిర్లక్ష్యంగా మాట్లాడారన్నారు. చంద్రబాబు చర్యతో ముంపు ప్రాంతాల రైతులమంతా ఇతర ప్రాంతాలకు వెళ్లి కూలిపనులు చేసుకుంటున్నామని, మరికొందరు భిక్షాటన చేస్తూ జీవనం గడుపుతున్నారని వాపోయారు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారన్నారు. 
Back to Top