హైదరాబాద్) విభజన కారణంగా కుదేలై పోయిన ఆంధ్రప్రదేశ్ కు ఉపశమనం కలగాలంటే ప్రత్యేక హోదా కావాల్సిందేనంటూ వైఎస్సార్‌సీపీ గట్టిగా గళం ఎత్తుతోంది. ఏడాది కాలంగా చేస్తున్న పోరాటంలో భాగంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఢిల్లీలో మహా ధర్నా చేయబోతున్నారు.
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15నెలలు కావస్తోంది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా కొనసాగుతోంది. విభజన సమయంలో కేంద్రం నుంచి వచ్చిన హామీకు వాస్తవరూపం రాబట్టడంలో ఘోరంగా విఫలం అయింది. ఎన్నికల ముందు మాత్రం బహిరంగ సభల్లో ప్రత్యేక హోదా రాబట్టే పూచీ తమదని పదే పదే నొక్కి చెప్పారు. ప్రజల్ని ఆ రకంగా నమ్మించారు. ఎన్నికల తర్వాత ఆ విషయాన్ని సాధ్యమైనంత ఎక్కువగా అదిమి పెట్టి ఉంచేందుకు ప్రయత్నించారు.
తెలుగుదేశం సాగిస్తున్న దొంగాటను గమనిస్తున్న ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ బాధ్యతగా దీన్నిభుజానికి ఎత్తుకొంది. ప్రజల తరపున ప్రత్యేక హోదా కోసం పోరాటానికి ఉపక్రమించింది. న్యూఢిల్లీ వెళ్లి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అనేకసార్లు కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసి వచ్చారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ మేరకు వినతి పత్రాలు సమర్పించారు. ఢిల్లీ వేదికగా ప్రజల ప్రాధాన్యతాంశాన్ని గుర్తించాలని డిమాండ్ చేశారు.
తాజాగా ప్రత్యేక హోదా మీద కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, క్రియా శీల నాయకులు పాల్గొననున్నారు. నాయకులు ఢిల్లీకి తరలి వెళ్లేందుకు వీలుగా రెండు రైళ్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక రైళ్లు రేణిగుంట, అనకాపల్లి నుంచి బయలు దేరాయి. వీటిలో వేల సంఖ్యలో నాయకులు డిల్లీకి తరలివెళ్లారు.