ఏకపక్షంగా కాంగ్రెస్‌ ఎలా నిర్ణయిస్తుంది?

ఇడుపులపాయ (వైయస్ఆర్‌ జిల్లా),

6 ఆగస్టు 2013: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌ పార్టీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నదని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు‌ శ్రీమతి వైయస్ విజయమ్మ ‌వ్యాఖ్యానించారు. సమన్యాయం చేయలేని కాంగ్రెస్ పార్టీ విభజన ‌అధికారం గాని, బాధ్యత గాని ఏ విధంగా తీసుకున్నదని శ్రీమతి విజయమ్మ నిలదీశారు. ఇరు ప్రాంతాల వారికి సమన్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ను తెలంగాణలో కలపటం ఏ విధంగా సబబో కేంద్రం చెప్పాలని ఆమె‌ నిలదీశారు. మంగళవారం ఉదయం ఇడుపులపాయ వచ్చిన శ్రీమతి విజయమ్మ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నుంచి సీమాంధ్రులు వెళ్లిపోవాలని కేసీఆ‌ర్ ఎలా అంటారని‌ శ్రీమతి విజయమ్మ సూటిగా ప్రశ్నించారు.

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ ‌నాయకులు ఒక్కొక్కరు ఒక్కోమాట మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. విభజనపై కాంగ్రెస్, ‌టిడిపి ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని శ్రీమతి విజయమ్మ ఆరోపించారు. తెలంగాణ ఇస్తామని చంద్రబాబు నాయుడు 2008లోనే రాసిచ్చారని శ్రీమతి విజయమ్మ అన్నారు. అప్పుడు అలా చేసిన చంద్రబాబు ఇప్పుడు సీమాంధ్ర రాజధాని కోసం 4, 5 లక్షల కోట్లు ఇవ్వాలని అడుగుతున్నారని అన్నారు. మరో పక్కన టిడిపి ఎంపిలు రాజీనామాలు చేస్తున్నారని అన్నారు. ఇలా వ్యవహరిస్తూ టిడిపి నాయకులు ఎవరిని మోసం చేస్తున్నారని నిలదీశారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని లేదా విభజన చేయాల్సిన ఆవశ్యకత వస్తే.. ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా, ఎవ్వరి మనోభావాలూ దెబ్బతినకుండా కేంద్రం ఒక తండ్రిలాగా వ్యవహరించాలని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ మొదటి నుంచీ కోరుతోందని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు. మొదటిసారి అఖిలపక్ష సమావేశం జరిగినప్పుడు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు కాలేదన్నారు. శ్రీకృష్ణ కమిటీ చర్చలు జరిగినప్పుడూ తమ పార్టీ స్థాపించలేదన్నారు. కేంద్ర హోంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మాత్రమే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పాల్గొన్నదన్నారు. ఆ సమావేశంలో తమ పార్టీ చెప్పిన విధానాన్నే ఇప్పుడు కూడా చెబుతోందన్నారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని తెలంగాణతో హైదరాబాద్‌ను కలపటం ఏ విధంగా సముచితమని శ్రీమతి విజయమ్మ ప్రశ్నించారు.

సీమాంధ్రలో పరిశ్రమల ఏర్పాటు గురించి కేంద్రం ఎలాంటి హామీ, స్పష్టత ఇవ్వలేదని శ్రీమతి విజయమ్మ విచారం వ్యక్తంచేశారు. పైపెచ్చు ఇప్పుడు సీమాంధ్ర రాజధాని విషయంలో కాంగ్రెస్‌ నాయకులు ఒక రోజు గుంటూరు అని, మరో రోజు ఒంగోలు అని, ఇంకొక రోజు కర్నూలు అంటున్నారని, మరోసారి రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తున్నట్లు చెబుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలా రోజుకో విధంగా కాంగ్రెస్‌ పార్టీ చిచ్చుపెడుతోందని దుయ్యబట్టారు.

జగన్‌బాబును దెబ్బకొట్టాలనే ఒక పక్కన తెలంగాణా ఇస్తున్నామని, రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలని చూస్తున్నారని శ్రీమతి విజయమ్మ ఆరోపించారు. పార్టీలన్నింటినీ రాష్ట్రాన్ని ఏ విధంగా విభజించాలనుకుంటున్నారో కేంద్రం చెప్పి ఉండి ఉంటే‌ హైదరాబాద్‌ నుంచి సీమాంధ్రులు వెళ్ళిపోవాలనే ఆస్కారం కేసీఆర్ ఉండేది కాదన్నారు. విభజనపై పూర్తి నిర్ణయం జరగక ముందే ఉద్యోగులు వెళ్ళిపోవాల్సిందే.. ఆప్షన్‌ లేదు అని కేసీఆర్‌ అనడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక హైదరాబాద్‌లో ఉండనిస్తారన్న భరోసా ఏది అని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. ఉపాధి కోసం రాష్ట్రం నలు మూలల నుంచీ హైదరాబాద్‌ వచ్చిన వారు ప్రతి ఇంటి ఊరి నుంచీ ఉన్నారన్నారు. కూలీలు మొదలు ఉద్యోగులు, వ్యాపారులు ఇలా అనేక మంది హైదరాబాద్‌లో బ్రతుకుతున్నారన్నారు. ఇలాంటి భయాలు ఉన్న కారణంగానే సీమాంధ్రలో ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమాలు ఊపందుకున్నాయన్నారు.

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కారణంగా ఆయనను అభిమానించే వారు తెలంగాణలోనూ, సీమాంధ్ర ప్రాంతాలలోనూ ఉన్నారని శ్రీమతి విజయమ్మ స్పష్టంచేశారు. ఆయన హయాంలో తెలంగాణ ప్రాంతంలో చాలా అభివృద్ధి జరిగిందని చెప్పారు. వైయస్ఆర్‌ సిఎం కాక ముందు, అయిన తరువాత తెలంగాణ నినాదం ఉన్నప్పుడు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చే అధికారం కేంద్రప్రభుత్వం చేతిలో ఉందని, అది రాష్ట్రం చేతిలో లేదని ఒక్కటే మాట చెప్పేవారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్నది ఆయన నినాదంగా ఉండేదన్నారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని వైయస్ రాజశేఖరరెడ్డి భావించారని‌ శ్రీమతి విజయమ్మ అన్నారు. రాష్ట్రం అంతటా సాగునీరు, తాగునీరు సమృద్ధిగా ఉండాలనే మహదాశయంతో జలయజ్ఞంలో 86 ప్రాజెక్టులు పూర్తిచేసి కోటి ఎకరాలకు నీటిని అందించాలని కృషి చేశారన్నారు. రాష్ట్రంలో‌ పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా చేయాలని ఆ రోజు జెన్‌కోను పటిష్టంగా చేశారన్నారు. ఆయన హయాంలోనే రెండు మూడు వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసేలా ప్రాజెక్టులు తయారయ్యాయని చెప్పారు. అలా ముద్దనూరు, భూపాలపల్లి, విజయవాడలో విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోందన్నారు. ఇప్పుడు కృష్ణపట్నంలో త్వరలోనే 16 వందల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి రానున్నదని చెప్పారు.

విద్య, వైద్య రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలని జిల్లాకో విశ్వవిద్యాలయం, వైద్య కళాశాల, జెఎన్‌టియులు, వృత్తి విద్యా కళాశాలలు, ఒక ఐఐటి, మూడు ట్రిపుల్‌ ఐటి కళాశాలలు, బిట్సు పిలానీ ఇలా ఎన్నింటినో వైయస్ఆర్ ఏర్పా‌టు చేశారన్నారు. ఒకవేళ విడిపోవాల్సి వస్తే సంతోషంగా విడిపోవాలనుకున్నారని శ్రీమతి విజయమ్మ తెలిపారు. ఐటి రంగంలో ప్రముఖ సంస్థలను తీసుకువచ్చారన్నారు. వైయస్ఆర్‌ హయాంలో హైదరాబాద్‌ జరిగినంత పెద్ద ఎత్తున అభివృద్ధి మరే ముఖ్యమంత్రీ చేయలేదని శ్రీమతి షర్మిల చెప్పారు. పి.వి. ఎక్సుప్రెస్‌ వే, కృష్ణాజలాలు, ఔటర్‌ రింగ్‌ రోడ్‌, మెట్రోరైలు ప్రాజెక్టు, ఫ్లై ఓవర్లు ఇలా ఎన్నింటినో రాజశేఖరరెడ్డిగారు హైదరాబాద్‌కు తెచ్చారన్నారు. ఆ మహానేత బ్రతికి ఉండి ఉండే రాష్ట్ర విభజన అనే ప్రశ్నే తలెత్తేది కాదని శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు.

రాష్ట్రం విడిపోతే రెండు చోట్లా టిడిపి ఉంటుందని చంద్రబాబు చూస్తున్నారని, తెలంగాణ ఇచ్చాం కాబట్టి తమకే ఎక్కువ సీట్లు వస్తాయని కాంగ్రెస్‌ వాళ్ళు ఆశిస్తున్నారని శ్రీమతి విజయమ్మ వ్యాఖ్యానించారు. కానీ వాళ్ళెవరికీ తమకు అధికారం ఇమ్మని ప్రజలను అడిగే హక్కు లేదన్నారు. రాజశేఖరరెడ్డిగారు చేసిన అభివృద్ధి కారణంగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు వేయమని గర్వంగా అడుగుతామన్నారు. విభజన చేసినా.. చేయకపోయినా అన్ని ప్రాంతాల్లో వైయస్ఆర్ అభిమానులు ఉన్నారన్నారు. అన్నిచోట్లా వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఉంటుందని‌ శ్రీమతి విజయమ్మ తెలిపారు.

తాజా ఫోటోలు

Back to Top