వైఎస్ షర్మిల మలివిడత పరామర్శయాత్ర ..!

రాజన్నబిడ్డకు ఘనస్వాగతం..!
మూడ్రోజుల పాటు 18 కుటుంబాలకు పరామర్శ..!
కరీంనగర్ః దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి షర్మిల చేపట్టిన  రెండో విడత పరామర్శయాత్ర కరీంనగర్ జిల్లాలో ప్రారంభమైంది.  హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచి బయలుదేరి కరీంనగర్ కు చేరుకున్న షర్మిలకు తోటపల్లి వద్ద వైఎస్సార్సీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. మూడ్రోజుల పాటు జిల్లాలో మొత్తం 18 కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శిసారు. తొలిరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించి 8 కుటుంబాలను ఓదార్చుతారు.  ఆతర్వాతి రోజు హుజూరాబాద్, మానకొండూరు నియోజకవర్గాల్లో ఏడు కుటుంబాలను, మూడోరోజు బోయినపల్లి, సిరిసిల్ల మండలాల్లో మూడు కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు.

ఇచ్చిన మాట ప్రకారం..!
వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మృతిని తట్టుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకుంటామని వైఎస్ జగన్ కర్నూలులో నల్లకాల్వ వద్ద మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆకుటుంబ ప్రతినిధిగా వైఎస్ షర్మిల పరామర్శయాత్ర కొనసాగిస్తూ బాధిత కుటుంబాల్లో భరోసా కల్పిస్తున్నారు. అండగా ఉంటామని ధైర్యం చెప్పుతూ అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. అడుగడుగునా ప్రజలు షర్మిలకు బ్రహ్మరథం పడుతున్నారు. రాజన్న బిడ్డను చూసి పులకించిపోతున్నారు. 

బాధితులకు అండగా రాజన్న బిడ్డ..!
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేక జిల్లాలో మొత్తం 30 మంది చనిపోయారు. సెప్టెంబర్ 22,23,24 తేదీల్లో వైఎస్ షర్మిల జిల్లాలో పర్యటించి మొత్తం 12 కుటుంబాలను ఓదార్చారు. మిగిలిన 18 కుటుంబాలను పరామర్శించేందుకు మలివిడత యాత్ర చేపట్టారు. మూడ్రోజుల పాటు మొత్తం 481 కి.మీ. మేర వైఎస్ షర్మిల యాత్ర కొనసాగిస్తారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పార్టీ శ్రేణులు షర్మిల యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. 
Back to Top