ఈ పాదయాత్ర నా జీవితంలో గొప్పమార్పును తెచ్చింది

2003 జూన్‌ 15.
చేవెళ్లలో ప్రారంభమైన వైయస్సార్‌ ప్రజాప్రస్థానం జైత్రయాత్రలా సాగి ఇచ్చాపురం చేరుకున్నరోజు. రాష్ట్రరాజకీయాల గతిని, స్థితిని మార్చే మహత్తర లక్ష్యానికి శ్రీకారం చుట్టిన రోజు. ఆరోజు పాదయాత్ర గురించి...మహానేత తన డెయిరీలో రాసుకున్న అక్షరాలు మీకోసం....కరువుపీడిత ప్రాంత ప్రజలను పలకరించి వారిని ఓదార్చడానికి 68 రోజుల కిందట నేను చేవెళ్లలో చేపట్టిన పాదయాత్ర నేటితో ఇచ్ఛాపురం వద్ద జరిగిన బహిరంగసభతో ముగిసింది. ఇచ్ఛాపురంలో నా పాదయాత్రకు చిహ్నంగా నిర్మించిన విజయస్థూపాన్ని పిసిసి అధ్యక్షుడు గౌరవనీయులు సత్యనారాయణరావు ప్రారంభించారు. ఇది నాకు ఎంతో సంతోషం కలిగించే విషయం. పాదయాత్ర మొదలుకొని ముగింపు వర కు చిన్నారులు, పెద్దలు, సోదర సోదరీమణులు అందరూ ఇచ్చిన మనో బలంతోనే ఇన్ని వందలకిలోమీటర్లు నడక కొనసాగించగలిగాను.  సమాజంలో పేదలు, ధనికుల మధ్య వ్యత్యాసం బాగా పెరిగిపోతోంది. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. పేదరిక మహమ్మారిని తరిమికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా వుంది. నా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈ 68 రోజుల పాదయాత్ర కొత్త పాఠాలు నేర్పింది. తెలియని అనేక విషయాలు తెలియచెప్పింది. విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి గ్రంథాలయాలు ఏ వి«దంగా తోడ్పడతాయో నాకు ఈ పాదయాత్ర అంతకంటే ఎక్కువగా తోడ్పడింది.  ఈ పాదయాత్ర ద్వారా నేను అవగతం చేసుకొన్న విషయాలు ముందు ముందు నా రాజకీయజీవితంలో పెద్దమార్పులు తీసుకురానున్నవి. ప్రజల సమస్యలను లోతుగా పరిశీలించి వాటి పరిష్కార మార్గాలు కనుగొనడానికి కృషి చేస్తాను. నన్ను నా నుంచి, నా ప్రజల నుంచి విడదీసి చూడలేని చూపునాది.  అందుకే ఎంతో కఠినమైనా ఇటువంటి పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.  ప్రజాప్రస్థానం నేర్పిన పాఠాలను ఆసరగా చేసుకొని భవిష్యత్తులో రాష్ట్ర ప్రయోజనాలకోసం ప్రణాళికలు రూపొందించుకొని రాష్ట్రాన్ని ’ఆంధ్రప్రదేశ్‌’గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తాను. పాదయాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. నేటి పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి పొరుగు రాష్ట్రమైన ఒరిస్సా నుంచి పిసిసి నేతలు వచ్చారు. వారు నన్ను ఆశీర్వదించారు. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. వారు కూడా వాళ్ల రాష్ట్రంలో ప్రజాప్రస్థానం వంటి పాదయాత్రను చేపడతామని చెప్పారు.  నా పాదయాత్రల వల్ల ఒక్కరికైనా మేలు జరిగినప్పుడే నా జన్మకు సార్థకత చేకూరుతుంది. వానలు వచ్చి...కరువు కాటకాలు రాకుండా ప్రజలను రక్షించాలని నేను నిత్యం భగవంతుణ్ణి వేడుకొంటాను. నా పాదయాత్రకు సహకరించిన మీడియాకు ధన్యవాదాలు అందరికీ పేరు పేరునా నా హార్థిక కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. 

అదే రోజు ఇచ్చాపురంలో జరిగిన ముగింపు సభలో ప్రసంగిస్తూ...వైఎస్‌ అన్నమాటలివి....
 ఓటు కోసం కాదు. ఓదార్పు కోసమే నా ఈ పాదయాత్ర. ఓట్లు అడగడం కోసం నేను మీ దగ్గరకకు రాలేదు. ఎన్నికల దృష్టితోనో, రాజకీయ లబ్ది కోసమే ఈ పాదయాత్ర చేయలేదు. ప్రజల కష్టాల్లో పాలు పంచుకోవడం నా ఉద్దేశం. పేదల సమస్యలపై పోరాటం సాగించడంలో ఆత్మ బలిదానానికైనా నేను సిద్దం’’
Back to Top