పెద్దాయ‌న రుణం తీర్చుకుంటా


వైయ‌స్‌ జగన్ వెంట 65 ఏళ్ల‌ వృద్ధురాలి పాదయాత్ర 

క‌ర్నూలు:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి నా కొడుకు ప్రాణాలు కాపాడారు. ఆయన కొడుకు కోసం ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి పెద్దాయన రుణం తీర్చుకుంటాను.’ అంటోంది ప్రొద్దుటూరుకు చెందిన 65 ఏళ్ల వృద్ధురాలు నాగలక్ష్మమ్మ.  వైయ‌స్  జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర గురువారం 10వ రోజు ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో సాగుతోంది. జ‌న‌నేత వెంట న‌డుస్తున్న‌ ప్రొద్దుటూరుకు చెందిన వృద్దురాలు నాగ‌ల‌క్ష్మీని స్థానికులు అభినందిస్తున్నారు. ఎందుకు పాద‌యాత్ర చేస్తున్నావ‌ని కొంద‌రు అడిగితే ఆమె చెప్పిన స‌మాధానం అంద‌ర్ని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.  ఆమె మాటల్లో వైయ‌స్‌ కుటుంబంపై అపారమైన ప్రేమ కనిపించింది.

రాజ‌న్న నా బిడ్డ‌కు ప్రాణం పోశాడు..
దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌న బిడ్డ‌కు ప్రాణం పోశాడ‌ని నాగ‌ల‌క్ష్మ‌మ్మ పేర్కొంటోంది. ప్రొద్దుటూరు గాంధీరోడ్డులో నివాసం ఉంటున్న నాగలక్ష్మమ్మ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. భర్త మరణించారు. చిన్న కుమారుడు వెన్నుపూస సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతుండేవాడు. డాక్టర్‌ను కలిస్తే సర్జరీ చేయాలని, రూ.3 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. ఏం చేయాలో దిక్కుతోచక రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి(ప్రస్తుత ప్రొద్దుటూరు ఎమ్మెల్యే)ని కలిసి తన గోడు చెప్పుకుంది. ఆయన అప్పటి సీఎం వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి వద్దకు తీసుకెళ్లి పరిచయం చేశారు. నాగలక్ష్మమ్మ తన చిన్న కుమారునికి చేసిన జబ్బు గురించి వివరించింది. వెంటనే స్పందించిన వైయ‌స్ఆర్‌ సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద రూ.3 లక్షలు మంజూరు చేయించి ఆపరేషన్‌ చేయించారు. ఫలితంగా చిన్న కుమారుడి జబ్బు నయమైంది. ప్రస్తుతం భార్యాపిల్లలతో సంతోషంగా ఉన్నాడు.

కాశి నుంచి వ‌చ్చింది..
జీవ‌నోపాధి నిమిత్తం నాగ‌ల‌క్ష్మ‌మ్మ కాశీలో ఉంటుంది. వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర గురించి చిన్న కుమారుడు తెలియజేశాడు. దీంతో అక్కడి నుంచి వచ్చేసి పాదయాత్ర ప్రారంభం రోజుకు ఇడుపులపాయకు చేరుకుంది. ఎంతోమంది ప్రాణాలు పోసిన మ‌హానేత  కుమారుడు వైయ‌స్ జగన్‌కు అండగా ఉండాలని భావించింది. ఇడుపుల‌పాయ‌ నుంచి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు నడుచుకుంటూ వస్తోంది.  

Back to Top