విభజన బిల్లును పార్లమెంటులో అడ్డుకుంటాం

న్యూఢిల్లీ:

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటు ఉభయసభల్లో అడ్డుకుంటామని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కార‌త్‌ హామీ ఇచ్చారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో తనను గురువారం కలిసిన పార్టీ బృందానికి కారత్‌ ఈ హామీ ఇచ్చారు. సమైక్యం విషయంలో తాము మొదటి నుంచీ ఉన్న వైఖరినే కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందకుండా చూసేందుకు ఇంటాబయటా పోరాడుతున్న వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీతో కలసి సాగేందుకు తా‌ము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. తమ మిత్రపక్షాలు ఏఐడీఎంకే, జేడీఎస్, జేడీయూలను కూడా సంప్రదించి బిల్లును అడ్డుకోవాలని కోరతామని హామీ ఇచ్చారు.

గురువారం మధ్యాహ్నం లోక్‌సభ వాయిదా పడిన అనంతరం శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డితో పాటు ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డి, మాజీ ఎంపీలు ఎంవీ మైసూరారెడ్డి, బాలశౌరి సీపీఎం ప్రధాన కార్యాలయంలో కారత్‌తో భేటీ అయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు వారు సమైక్యాంధ్యప్రదేశ్‌ అంశంపై  చర్చించారు.

రాజ్యంగ నిబంధనలు, సంప్రదాయాలను తుంగలో తొక్కి, పూర్తి అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కారత్ దృష్టికి‌ శ్రీ జగన్ తీసుకెళ్లారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, బిల్లును వెనక్కి పంపాలని పార్టీ ఎమ్మెల్యేలు తీర్మానించారని వివరించారు. రాష్ట్ర అసెంబ్లీకి పంపిన బిల్లులోనూ విభజన అనంతర పరిణామాలు, ఆర్థిక పంపిణీ, నీటి వనరుల నిర్వహణపై సరైన వివరణలు లేవని, దీన్ని తమ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభ, మండలిలో పూర్తిగా వ్యతిరేకించారని తెలిపారు. సభలోని మెజార్టీ ఎమ్మెల్యేలు సైతం విభజన బిల్లును తిరస్కరించారని గుర్తుచేశారు.

‌ఇదే సమయంలో బిల్లును తిరస్కరిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి ఇచ్చిన తీర్మానం మూజువాణి ఓటుతో సభ  ఆమోదం పొందిందని, తిరస్కరించిన ఆ బిల్లును పార్లమెంటుకు సిఫార్సు చేయరాదని శ్రీ జగన్ కోరారు. ఈ విషయంలో సీపీఎం మద్దతు కావాలన్నారు. ఉభయ సభల్లో ప్రవేశపెట్టే సమయంలో బిల్లును పూర్తిగా వ్యతిరేకించాలని విన్నవించారు. దీనికి ప్రకా‌శ్ కార‌త్ పూర్తి సానుకూల‌తను వ్యక్తం చేశారు.

విభజన బిల్లును వ్యతిరేకిస్తాం- కారత్ :

సమావేశం అనంతరం విలేకరులతో కారత్ మాట్లాడుతూ, ‘సీపీఎం, వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ మొదటి నుంచీ రాష్ట్రం ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నా‌యన్నారు. పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందకుండా చూసేందుకు ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలన్న దానిపై చర్చించుకున్నాం’ అని చెప్పారు. రానున్న ఎన్నికల్లో పొత్తుల విషయమై చర్చలేమీ జరగలేదని విలేకరుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తర్వాత శ్రీ జగన్మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు  సంపూర్ణ మద్దతు ఉంటుందని కారత్‌ తమకు హామీ ఇచ్చినట్లు చెప్పారు.

అద్వానీతోనూ శ్రీ జగన్ ‌సమావేశం :
లోక్‌సభ వాయిదా పడిన తరువాత శ్రీ వైయస్ జగన్, మేకపాటి, ఎస్పీవైలు బీజేపీ అగ్రనేత ఎ‌ల్‌కే అద్వానీతో పార్లమెంటులో లాబీల్లో సమావేశం అయ్యారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు విషయంలో బీజేపీ తన వైఖరిని మార్చుకోవాలని శ్రీ జగన్ కోరారు. బిల్లును పార్లమెంటులో వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. సీమాంధ్రుల ప్రయోజనాలను పట్టించుకోకుండా, వారి అభిప్రాయాలకు ఏమాత్రం విలువనివ్వకుండా అడ్డగోలుగా విభజన చేస్తున్నారని వివరించారు. శాసనసభలో విభజన బిల్లును తిరస్కరిస్తూ చేసినతీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించిందని అద్వానీ దృష్టికి తెచ్చారు. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని, దీన్ని ప్రధాన ప్రతిపక్షంగా వ్యతిరేకించాలని కోరారు. శ్రీ జగన్ విజ్ఞప్తికి అద్వానీ పూర్తి సానుకూలంగా స్పందించారని వై‌యస్ఆర్‌పీ నాయకుడు మైసూరారెడ్డి తెలిపారు.

Back to Top