గుంటూరు దీక్షలో గర్జించిన వైఎస్ జగన్..

చంద్రబాబు పాలనంతా మోసం, వెన్నుపోటులే..!
జైలుకు పోవాల్సివస్తుందనే హోదా తాకట్టు..
ప్రత్యేకహోదా సాధించేవరకు విశ్రమించబోం..!

గుంటూరు(నల్లపాడు రోడ్డు):  ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గుంటూరు దీక్షలో గర్జించారు. నల్లపాడు రోడ్డులో ప్రత్యేకహోదా సాధన కోసం వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈసందర్భంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని కడిగి పారేశారు. తన దీక్షకు మద్దతు తెలిపేందుకు వచ్చిన అశేషజనవాహినినుద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించారు. ప్రత్యేకహోదాను సాధించేవరకు విశ్రమించబోమని ప్రభుత్వాలను హెచ్చరించారు. 

మోసపూరిత పాలన..!
చంద్రబాబు ఎన్నికలప్పుడు ఓమాట, ఎన్నికలయి పోయాక మరో మాట చెబుతూ ప్లేయి ఫిరాయించారని వైఎస్ జగన్ విమర్శించారు. ప్రత్యేకహోదా ఐదేళ్లు కాదు, పదిసంవత్సరాలు కావాలని ఎన్నికల సమయంలో ప్రతివీధిలో, మీటింగ్ లలో, టీవీల్లో చెప్పిన చంద్రబాబు...ఇప్పుడు తన కేసుల నుంచి బయటపడేందుకు మోడీ వద్ద సాగిలపడి హోదాను తాకట్టు పెట్టారని విరుచుకుపడ్డారు.
ఐదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్..తాము అధికారంలోకి వస్తే పదేళ్లు ఇస్తామని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు, బీజేపీలు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాయన్నారు. 

అంతా అవినీతి,అబద్ధాలు, మోసాలే..!
చంద్రబాబు పాలనంతా అవినీతి, అబద్ధాలు, మోసాలు,వెన్నుపోటులేనని వైఎస్ జగన్ అన్నారు. పట్టిసీమ నుంచి ఇసుక వరకు, బొగ్గు నుంచి మట్టివరకు కమీషన్ల రూపంలో లంచాలు పిండుకొని ...విచ్చలవిడిగా వచ్చిన సొమ్మును ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెదజల్లి అడ్డంగా దొరికిపోయారని దుయ్యబట్టారు. ఒక్కో ఎమ్మెల్యేలకు రూ. 5 కోట్లు పంచేందుకు సూటుకేసుల్లో డబ్బులు తీస్తూ అడ్డంగా ఆడియోలు, వీడియోలతో పట్టుబడ్డారని అన్నారు.  మన వాళ్లు బ్రీఫుడ్ మీ అంటూ చంద్రబాబు ఎంతగొప్పగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారని  అంతా అనుకున్నారని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. కేసులు తనమీదికి రాకుండా ఉండేందుకు కేంద్రంతో లాలూచీ పడి దిగజారిపోయి హోదాను పక్కనబెట్టారని చంద్రబాబుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోనియాతో కుమ్మక్కై కేసులు ..!
చంద్రబాబు సోనియాతో కుమ్మక్కై కిరణ్ ప్రభుత్వాన్ని రక్షించి....ఇద్దరూ ఒక్కటై తన మీద కేసులు పెట్టారని వైఎస్ జగన్ అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నంత కాలం మంచోళ్లన్నారు. కాంగ్రెస్ వీడాక రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ ను చెడ్డోళ్లను చేశారని జననేత ఉద్విగ్నంగా మాట్లాడారు. రాజకీయంగా ఎదుర్కోలేక చీకటిలో చిదంబరంతో కలిసి చంద్రబాబు తనపై కేసులు పెట్టించాడని జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టవద్దని గట్టిగా  నిలబడిన పార్టీ వైఎస్సార్సీపీ అని చెప్పేందుకు తాను గర్వపడతానని అన్నారు. మన తలరాతలు రాసేవాడు దేవుడన్న సంగతి చంద్రబాబు మర్చిపోవద్దన్నారు. 

మోడీపై పోరాడే దమ్మూ ధైర్యం ఉందా..!
చంద్రబాబు కేంద్రంలో తన మంత్రులను ఉపసంహరించుకుంటే ప్రత్యేకహోదా వస్తుంది. మోడీకి ఆమాట చెప్పే దమ్మూ ధైర్యం ఉందా చంద్రబాబు అని జగన్ ప్రశ్నించారు. ఆమాట చెప్పిన మరుక్షణం జైలుకు పంపిస్తారన్న భయంతో చంద్రబాబు బతుకుతున్నాడని  జగన్ తెలిపారు. చంద్రబాబు వస్తే రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ అవుతాయని చెప్పారా లేదా, జాబులు వస్తాయని అన్నారా లేదా అని  వైఎస్ జగన్ ప్రజలను అడగగా..అంతా లేదు అని సమాధానం చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం బంగాళాఖాతంలో కలవడం ఖాయమని హోదా వచ్చేవరకు పోరాడుదామని ప్రజానీకానికి పిలుపునిచ్చారు జగన్. సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికీ వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు. 
Back to Top