ఆందోళనకరంగా వైఎస్ జగన్ ఆరోగ్యం..!

గంటగంటకు క్షీణిస్తున్న ఆరోగ్యం..!
దీక్ష విరమించి ఆహారం తీసుకోవాలంటున్న వైద్యులు..!

గుంటూరుః ప్రతిపక్ష నాయకుడు,వైఎస్సార్సీపీ అధ్యక్షుడు  వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది.   ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. దీక్ష కొనసాగిస్తే ఆరోగ్యం విషమించే  ప్రమాదముందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ ఆరోగ్యానికి సంబంధించి  గుంటూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఉదయ్ శంకర్ ఆధ్వర్యంలో ఉదయం నుంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు.  వైఎస్ జగన్ శరీరంలో డీహైడ్రేషన్ మొదలైందని, ఆయన దీక్ష విరమిస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. కీటోన్స్ కారణంగా కిడ్నీలపై ప్రభావం ఉంటుందని తెలిపారు.

ఉదయం నుంచి ఇప్పటివరకు వైద్యులు వైఎస్ జగన్ కు మూడుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు,11 గంటలకు, సాయంత్రం 4.20 గం.లకు వైద్యులు  వైఎస్ జగన్ కు పరీక్షలు చేశారు. బిపి 90/70, చక్కెర నిల్వలు 79 ఎంజి, పల్స్ 86కు పడిపోయిందని  వైద్యులు తెలిపారు.  వెయిట్ రెండు కేజీలు తగ్గి 72.5 కు వచ్చారని చెప్పారు. ఆరోగ్యం క్షీణించడం ప్రారంభంకావడంతో గంటగంటకు జగన్  శరీరంలోని బీపీ, షుగర్, పల్స్ స్థాయిల్లో మార్పులు వస్తున్నాయని వైద్యులు వెల్లడించారు. 

వైఎస్ జగన్ తక్షణం దీక్ష విరమించి, ఆహారం తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.  వైఎస్ జగన్ ఆరోగ్య పరీక్షలకు సంబంధించిన నివేదికను తమ సూపరింటెండెంట్ కు సమర్పిస్తామని డాక్టర్లు తెలిపారు. ఐదు రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులతో పాటు, పార్టీనేతలు, కార్యకర్తలు, అభిమానులు సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా ఆందోళన చెందుతున్నారు.
Back to Top