కిడ్నీ రోగికి రూ.10 వేల పింఛను


 - ఆరోగ్యశ్రీని మెరుగుపరుస్తా... 
- ఏ ఆపరేషనైనా ఉచితమే
 -  విశ్రాంతి సమయంలోనూ రోగులకు డబ్బులిస్తాం.. 
 
ఒంగోలు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అధికారంలోకి వచ్చిన త‌రువాత కిడ్నీ రోగుల‌కు నెల‌కు రూ.10 వేల పింఛ‌న్ ఇస్తామ‌ని, ఎలాంటి వ్యాధికైనా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా ఆపరేషన్‌ చేయించి, రోగిని చిరునవ్వుతో ఇంటికి పంపిస్తామని  వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా 94వ రోజు బుధ‌వారం ప్ర‌కాశం జిల్లా కె. అగ్ర‌హారం గ్రామస్తుల‌తో వైయ‌స్ జ‌గ‌న్ మ‌మేక‌మై న‌వ‌ర‌త్నాల గురించి వివ‌రించారు.  ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ..ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నీరుగార్చిందని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య శ్రీ వ్యవస్థను మెరుగుపరుస్తామన్నారు. ‘104’, ‘108’ సేవలను బలోపేతం చేస్తామని చెప్పారు. క్యాన్సర్, న్యూరో, గుండె, కిడ్నీ మార్పిడి, మోకాళ్ల  శస్త్రచికిత్సలు, బధిరులైన పిల్లలకు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామని అన్నారు. అన్ని వర్గాలనూ మోసగిస్తున్న బాబు పాలనకు చరమగీతం పాడే రోజులు వచ్చాయని ఉద్ఘాటించారు.  దివంగత నేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి పాలనలో ఎవరికైనా ప్రమాదం జరిగి ‘108’ నంబర్‌కు ఫోన్‌ కొడితే కుయ్‌.. కుయ్‌ అంటూ 20 నిమిషాల్లోనే అంబులెన్స్‌ వచ్చేది. అవసరమైతే హైదరాబాద్‌కు కూడా తీసుకొని వెళ్లేవారు. ఆపరేషన్‌ చేయించి బాధితుడిని చిరునవ్వుతో ఇంటికి పంపించేవారు. ఇవాళ ప్రజలు కావ్‌.. కావ్‌ అంటున్నా అంబులెన్స్‌ వచ్చే పరిస్థితి లేదు. ఏపీ ప్రజలు హైదరాబాద్‌కు వెళ్లి వైద్యం చేయించుకుంటే చంద్రబాబు ఆరోగ్యశ్రీ కింద డబ్బులు ఇవ్వడట! రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో మంచి ఆసుపత్రి ఎక్కడుంది? మంచి ఆసుపత్రులన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఎవరికైనా బాగోలేక హైదరాబాద్‌లో చికిత్స చేయించుకుంటే డబ్బులు ఇవ్వకపోవడం దారుణం. గుండెపోటు, క్యాన్సర్‌కు వైద్యం చేయించుకోవాలంటే ఆరేడు లక్షలు ఖర్చవుతాయి. పెద్ద ఆపరేషన్‌ చేయించాలంటే ఇంకా ఎక్కువ ఖర్చవుతుంది. మన ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా మెరుగుపరుస్తాం. ‘108’ నంబర్‌కు ఫోన్‌ చేస్తే 20 నిమిషాల్లో అంబులెన్స్‌ మీ ముందుకు వచ్చేలా చేస్తాం. వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి సమయంలో కూడా రోగులకు డబ్బులు ఇస్తాం. కిడ్నీ పేషెంట్లు డయాలసిస్‌ చేయించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి మారుస్తాం. కిడ్నీ రీప్లేస్‌మెంట్‌కు డబ్బులు ఇస్తామ‌న్నారు. హైదరాబాద్‌లో మళ్లీ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలందిస్తామ‌ని మాట ఇచ్చారు. వైయ‌స్ జ‌గ‌న్ హామీతో స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. 
  
Back to Top