బీడీ కార్మికులకు అండగా నిలుస్తాం


 - చ‌ల్లావారిపాలెం వద్ద మహిళా బీడీ కార్మికులతో ముఖాముఖి
 - కార్మికుల వాటా మేరకు ప్రభుత్వం కూడా పీఎఫ్‌ సొమ్ము జమ

    చిత్తూరు : బీడీ కార్మికులకు అన్ని విధాల అండగా నిలబడతామని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా 54వ రోజు శనివారం మధ్యాహ్నం ఆయన చిత్తూరు జిల్లా కల్లూరు శివారులోని చల్లావారిపాలెం వద్ద మహిళా బీడీ కార్మికులతో ముఖాముఖి నిర్వహిం చారు. ఈ ప్రాంతంలో 30 వేల కుటుంబాలకు బీడీలు చుట్టే పనే జీవనాధారమని, మదనపల్లి ప్రాంతానికి చెందిన బీడీ కంపెనీల వారు ఆకు తెచ్చి ఇస్తే బీడీలు చుట్టి ఇస్తామని మహిళలు జగన్‌కు వివరించారు. ‘కిలో ఆకుకు 2 వేల బీడీలు వస్తాయి. ఇంట్లో నలుగురు పని చేస్తే రోజుకు వెయ్యి బీడీలు చుట్టొచ్చు. వెయ్యి బీడీలకు కంపెనీ వారు రూ.150 ఇస్తారు. ఈ విధంగా నెలకు రూ.4500 నుంచి రూ.5 వేల వరకు వస్తుంది. వారానికోసారి తమ జీతంలోంచి రూ.200 చొప్పున.. నెలకు రూ.800 పీఎఫ్‌ కట్‌ చేసి, దానికి కంపెనీ వారు మరో రూ.800 కలుపుతున్నారు. అయితే ఇంట్లో నలుగురు బీడీలు చుట్టినా పీఎఫ్‌ మాత్రం ఒకరికే కట్‌ చేస్తున్నారు. మన ప్రభుత్వం వచ్చాక.. మా పీఎఫ్‌ వాటాకు సమానంగా కంపెనీ కలుపుతున్న నగదుతో పాటు, ప్రభుత్వం కూడా రూ.800 కలిపేలా చర్యలు తీసుకోవాల’ని వారు విజ్ఞప్తి చేశారు.

అనంతరం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. దేవుడి దయ, మీ అందరి ఆశీస్సుల తో మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అలాగే చేద్దామన్నారు. గిట్టుబాటు కూలి లభించేలా చర్యలు తీసుకుంటామని, వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తామని, అందరికీ అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. మనందరి ప్రభుత్వం రావాలని మీరంతా ‘దువా’చేయాలని జగన్‌ కోరగా.. ‘మీరు మా పెద్దన్నయ్య.. మేమంతా మీ వెంటే ఉంటాం..’అని కార్మికులు అన్నారు.


తాజా ఫోటోలు

Back to Top