16న గుంటూరులో యువ‌భేరి

  • న‌ల్ల‌పాడు రోడ్డులోని మిర్చి యార్డు సమీపంలో  చురుగ్గా ఏర్పాట్లు
  • ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు యువ‌త‌ను చైత‌న్య‌వంతం చేయ‌నున్న వైయ‌స్ జ‌గ‌న్‌
గుంటూరు: ఆంధ్ర ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా సాధించేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత అలుపెరగకుండా ఉద్య‌మిస్తునే ఉన్నారు. రెండేళ్ల‌కు పైగా ద‌శ‌ల‌వారీగా పోరాడుతున్న వైయ‌స్ జ‌గ‌న్ యువ‌త‌, విద్యార్థుల‌ను చైత‌న్య‌వంతం చేసేందుకు ఈ నెల 16న గుంటూరు వేదికగా జరిగే మరో యువ‌భేరి కార్య‌క్ర‌మానికి హాజరవుతున్నారు. గుంటూరు- నల్లపాడు రోడ్డులోని మిర్చి యార్డు సమీపంలో గల ఖాళీ ప్రదేశంలో యువభేరిని నిర్వహించేలా వైయస్సార్సీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌,  తలశిల రఘురామ్,  పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్‌, నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, జిల్లాలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు యువభేరి ఏర్పాట్లను ప‌రిశీలిస్తున్నారు. 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రెండున్నరేళ్లుగా వైయస్ జగన్ ఎన్నో పోరాటాలు చేశారు.  ధ‌ర్నాలు, రాష్ట్ర బంద్‌లు, నిరాహార‌దీక్ష‌లు చేప‌ట్టారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు నినాదంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై గర్జిస్తున్నారు.  జై ఆంధ్ర‌ప్ర‌దేశ్ పేరుతో భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేశారు. గ‌త నెల 26న రాష్ట్ర‌వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వ‌హించారు. విద్యార్థులను చైతన్యపరచి, వారి మనోభావాలను తెలుసుకొని, హోదా వల్ల ఒనగూరే లబ్ధిని తెలియజేస్తూ హోదాను సాధించేందుకు అందరినీ ఐక్యం చేస్తున్నారు. దీనిలో భాగంగానే యువభేరి కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. ఇప్ప‌టికే తిరుప‌తి, విశాఖ‌, శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం, కాకినాడ‌, ఏలూరు, నెల్లూరు, క‌ర్నూలు న‌గ‌రాల్లో యువ‌భేరి నిర్వ‌హించారు. ఈ నెల 16న గుంటూరులో యువ‌భేరి నిర్వ‌హిస్తున్నారు. ప్రతి ఒక్కరూ  ఈ సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ నాయ‌కులు పిలుపునిచ్చారు.  
Back to Top