నాన్నగారి పాలన మళ్లీ తీసుకొస్తా
– నాలుగేళ్లలో చంద్రబాబు ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు
– మీ పిల్లలను ఏం చదివిస్తారో మీ ఇష్టం..ఎన్ని లక్షలు ఖర్చైనా ఫర్వాలేదు
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 45 ఏళ్లకే పింఛన్లు
– 25 లక్షల ఇల్లు కట్టిస్తాం
– ప్రతి పేదవాడికి ఉచితంగా ఆపరేషన్లు
– చేనేతలకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తాం
– చేనేతలకు రూ.2 వేల సబ్సిడీ  
గుంటూరు: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను మళ్లీ తీసుకువస్తానని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. నాన్నగారు పేదల కోసం ఒక్క అడుగు ముందుకు వేస్తే..ఆయన కొడుకుగా తాను రెండు అడుగులు వేస్తానని పేర్కొన్నారు. చేనేతలకు అన్ని విధాల అండగా ఉంటానని, ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తానని, పింఛన్‌ ఇస్తామని, పిల్లల చదువులకు అయ్యే ఖర్చులు భరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన చేనేతల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో వైయస్‌ జగన్‌ పాల్గొని చేనేతలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆయన ఏమన్నారంటే..వైయస్‌ జగన్‌ మాటల్లోనే..

నాలుగేళ్లలో మనకేమైనా మంచి జరిగిందా? 
 చేనేతల ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాలుగేళ్ల చంద్రబాబు పాలనను మనమంతా చూశాం. ఒక్కసారి ఈ నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో మనమంతా కూడా సంతోషంగా ఉన్నామా? అన్నది గుండెలపై చేతులు వేసుకొని ఆలోచన చేయమని కోరుతున్నాను. ఈ నాలుగేళ్లలో మనకేమైనా మంచి జరిగిందా? నిన్నటి కన్నా ఈ రోజు బాగున్నామా ఆలోచించండి. చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా కూడా చేనేతల ఆకలి బాధలు, ఆత్మ హత్యలు కనిపిస్తాయి. ఒక్కరి కాదు ఇద్దరు కాదు చంద్రబాబు పాలనలో 34 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు.  ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించాను. ఈ కుటుంబాలను చంద్రబాబు ఆదుకోలేదు. పైగా అవహేళన చేశారు. పరిహారం ఇవ్వకుండా తప్పించుకుని తిరిగారు. 
– చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోను పరిశీలిస్తే అందులో ఎవర్ని వదిలిపెట్టలేదు. ఎవరైనా దారిలో గౌడ సోదరుడు కనిపిస్తే..ఆయన మెడలోని తాడు చంద్రబాబు మెడలో వేసుకొని ఫోటోకు ఫోజులిస్తారు. మరోపక్క చేనేత కార్మికుల మగ్గం వద్దకు వెళ్లి నేస్తున్నట్లు ఫోజులు ఇస్తారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో చెప్పిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. 
– చేనేత కార్మికుల బ్యాంకు రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామన్నారు. ఎక్కడా మాఫీ కాలేదు. ప్రతి చేనేత కుటుంబానికి లక్ష రూపాయల సంస్థాగత రుణాలు ఇస్తామన్నారు. ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇదే పెద్ద మనిషి ఒక్క అడుగు ముందుకు వేసి బడ్జెట్‌లో చేనేతలకు వెయ్యి కోట్లు కేటాయిస్తామన్నారు. 2014–2015లో రూ.98 కోట్లు కేటాయించారు. ఇందులో ఖర్చు చేసింది రూ.50.46 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. 2015–16లో రూ.45 కోట్లు మాత్రమే, అందులో ఖర్చు చేసింది రూ.40.96 కోట్లు, 2016–2017లో రూ. 57 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. 2017–2018లో కూడా ఇవే కేటాయింపులు వీటిలో ఖర్చు చేసింది రూ.4025 కోట్లు మాత్రమే. వెయ్యి కోట్లు కేటాయిస్తామని చెప్పి నాలుగేళ్లలో రూ.120 కోట్లు కూడా కేటాయించలేదు. 
– జిల్లాకు ఒక చేనేత పార్క్‌ ఏర్పాటు చేస్తామన్నారు. లక్షన్నరతో ఉచితంగా ఇల్లు, మగ్గం షెడ్డు కట్టిస్తానని చెప్పారు. ఒక్కరికైనా కట్టించారా? 
– చంద్రబాబు పుణ్యమా అని నాలుగేళ్ల పాలనలో చేనేత రంగానికి ఇంతకుముందు జరుగుతున్న మేలు ఇప్పుడు జరగడం లేదు. గతంలో చేనేతలకు రూ.600 సబ్సిడీ ఇచ్చేవారు. ఇటీవల ధర్మవరంలో చేనేత అక్కచెల్లెమ్మలు నిరాహార దీక్ష చేస్తుంటే వెళ్లాను. అన్నా..ఇంతకు ముందు రూ.600 సబ్సిడీ ఇచ్చేవారు. చంద్రబాబు రూ.1000 ఇస్తామని మాట ఇచ్చారు. వెయ్యి రూపాయలు దేవుడెరుగు ఉన్న రూ.600 కూడా ఇవ్వడం లేదన్నా అన్నారు. గతంలో ఐడెంటీడి కార్డులు ఉండేవి. ఏ చిన్న రోగం వచ్చినా ఉచితంగా వైద్యం అందించేవారు. ఆ కార్డు కథ దేవుడెరుగు ఉన్న ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేశారని చెబుతున్నారు.
– ఈ రోజు మన పిల్లలను ఇంజినీర్లు, డాక్టర్లుగా చదివించే పరిస్థితి ఉందా? ఇంజినీరింగ్‌ ఫీజులు లక్షల్లో ఉన్నాయి. ప్రభుత్వం ముష్టి వేసినట్లు రూ.30 వేలు ఇస్తుంది. అందులో కూడా ఏడాది కాలంగా బకాయిలు ఉన్నాయని విద్యార్థులు వాపోతున్నారు. తమ పిల్లలకు లక్షల్లో ఫీజులు చెల్లించేందుకు పేదవారు ఉన్న ఇల్లు, పొలం అమ్ముకుంటున్నారు.
– చంద్రబాబు హయాంలో ఆరోగ్యశ్రీని గమనించండి. ఆ దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పేదలకు ఉచితంగా వైద్యసేవలందించారు. ఇవాళ ఆరోగ్యశ్రీ సేవలు అందడం లేదు. ఇదే మంగళగిరికి చెందిన ఓ అక్క నా వద్దకు వచ్చి అన్నా..నా బిడ్డ మూగ, చెవుడుతో బాధపడుతుందని, ఆరోగ్యశ్రీతో ఆపరేషన్‌ చేయించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. 
– ఈ నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఇంతటి దారుణమైన పాలన చూసిన తరువాత, ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఎలాంటి పాలన కావాలో? ఎలాంటి నాయకుడు మీకు కావాలో ఆలోచన చేయండి. అబద్ధాలు చెప్పేవారు నాయకుడు కావాలా? మోసం చేసేవారు నాయకులుగా కావాలా?. నాలుగేళ్ల కాలంలో అక్షరాల చూసింది ఇదే పాలన.
– రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మనం ఏం చేస్తామన్నది చెప్పేందుకు నవరత్నాలు ప్రకటించాం. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వులు చూసేందుకు నవరత్నాలు ప్రకటించాను. ఇందులో ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే సలహా ఇవ్వండి.
– రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చదువుల విప్లవం తీసుకువస్తాం. మన పిల్లలను ఇవాళ ఉన్నత చదువులు చదివించలేకపోతున్నాం. మన ప్రభుత్వం వచ్చాక మళ్లీ నాన్నగారి పాలన వెనక్కి తీసుకువస్తాను. నాన్నగారు పేదవారి కోసం ఒక్క అడుగు ముందుకు వేస్తే..జగన్‌ రెండు అడుగులు ముందుకు వేస్తాను. మీ పిల్లలను ఏం చదివిస్తారో చదివించండి..ఎన్ని లక్షలు ఖర్చు అయినా ఫర్వాలేదు..దగ్గరుండి నేను చదివిస్తాను. పిల్లల హాస్టల్‌ ఖర్చులు కూడా తల్లిదండ్రులు భరించడం కష్టంగా మారింది. అలాంటి పిల్లలకు హాస్టల్‌ ఖర్చుల కోసం ప్రతి ఏటా రూ.20 వేలు చెల్లిస్తాం. దీనివల్ల ఆ తల్లిదండ్రులు అప్పులపాలు కాకుండా చూస్తాం.
– మన తలరాతలు మారాలంటే చిట్టిపిల్లలకు మంచి పునాది వేయాలి. ఆ పిల్లలు ఉన్నత చదువులు చదవాలంటే వారిని బడికి పంపించాలి. పిల్లలను బడికి పంపిస్తే ఆ తల్లి ఖాతాలో రూ.15 వేలు జమా చేస్తాం. ఏ బడికి పంపించినా అభ్యంతరం లేదు. ఆ పిల్లలను బడికి పంపిస్తే చాలు రూ.15 వేలు ఇస్తాం. ఆ పిల్లాడు బడిబాట పడితే మన బతుకులు మారుతాయి.
– అవ్వతాతల పింఛన్‌ పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మనసు రావడం లేదు. కారణం ఏంటంటే చంద్రబాబుకు పింఛన్లలో కమీషన్లు రావు. కానీ కాంట్రాక్టర్లకు మాత్రం చంద్రబాబు రేట్లు పెంచుతారు. ఈ మూడేళ్లలో సిమెంట్, స్టీల్, క్రూడాయిల్‌రేట్లు తగ్గినా కూడా చంద్రబాబు కాంట్రాక్టర్లకు రేట్లు పెంచుతారు. ఆ అవ్వాతాతలకు చెబుతున్నాను. మనందరి ప్రభుత్వం వచ్చాక ఆ పింఛన్‌ వెయ్యి నుంచి రూ.2 వేలకు పెంచుతాం.
– ధర్మవరంలో చేనేత అక్కా చెల్లెమ్మలు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు వారితో మాట్లాడినప్పుడు చాలా విషయాలు తెలిశాయి. వారం రోజులు పనులు చేయకపోతే పస్తులుంటున్నారని చెప్పారు. ఇలాంటి అక్కల కోసం పింఛన్‌ వయస్సు 45 ఏళ్లకే తగ్గిస్తామని చెబుతున్నాను. 
– చంద్రబాబు హయాంలో చేనేతలకు ఇల్లు కట్టిస్తామన్నారు. ఎక్కడా ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. ఆ ఇళ్లలో చంద్రబాబు స్కాం చేశారు. ప్లాట్లు అంటూ దోచుకుంటున్నారు. లిప్టు, గ్రనైట్‌ ఫ్లోర్‌ లేని ప్లాట్‌ఎంత అవుతుందో అడగండి. చంద్రబాబు మాత్రం అడుగుకు రెండు వేల చొప్పున పేదలకు అమ్ముతున్నారు. ఇందులో రూ. లక్షలు అప్పుగా ఇస్తారట. ఆ అప్పు నెల నెల రూ.3 వేల చొప్పున 20 ఏళ్ల పాటు కంతులు కట్టాలట. దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం వచ్చాక ప్రతి అక్కకు చెబుతున్నాను. అందరికీ పక్కా ఇల్లు కట్టించి ఇస్తానని మాట ఇస్తున్నాను. నాన్నగారు దేశంతో పోటీ పడి ఏ రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా 48 లక్షల ఇల్లు కట్టారు. నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుంటున్నాను. మన 13 జిల్లాల్లో 24 లక్షల ఇల్లు కట్టించారు. నాన్న కన్న కనీసం ఒక లక్ష  ఇల్లు ఎక్కువగా కట్టిస్తానని హామీ ఇస్తున్నాను. ఇల్లు కట్టించడమే కాదు. ఆ ఇల్లు అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌చేయిస్తాను. ఆ ఇల్లు అక్కచెల్లమ్మలకు ఆస్తి అవుతుంది. ఎప్పుడైనా డబ్బు అవసరమెస్తే నేరుగా బ్యాంకుకు వెళ్లి పావలా వడ్డీకే రుణం పొందేలా చేస్తాం. దీని వల్ల ప్రతి ఒక్కరికి భరోసా ఉంటుంది. 
– ఆరోగ్యశ్రీని పూర్తిగా మార్పు చేయిస్తాం. ఏ పేదవాడికైనా వైద్యం ఖర్చు వెయ్యి దాటితే దాన్ని ఆరోగ్యశ్రీ కిందకు తెస్తాం.  మళ్లీ నాన్నగారి పాలనను తీసుకొస్తాను. పేదవారి కోసం నాన్నగారు ఒక్క అడుగు ముందుకు వేస్తే..జగన్‌ రెండు అడుగులు ముందుకు వేస్తానని మాట ఇస్తున్నాను.
– ప్రతి చేనేత కార్మికుడికి మేలు జరిగేలా చేనేత కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తాం. దగ్గరుండి రుణాలు ఇప్పిస్తాను. ప్రతి చేనేత కార్మికుడికి కూడా సబ్సిడీ రూ.2 వేలు ఇస్తాం. ఇవికాక మీరేమైనా సూచనలు సలహాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ఏ మేరకు సాధ్యమైతే అంతవరకు మేలు చేస్తామని మాట ఇస్తున్నాను.
 

తాజా ఫోటోలు

Back to Top