బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయం..!

ప్రభుత్వానికి పోయే రోజులొచ్చాయి...!
ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులకు అండగా వైఎస్ జగన్..! 
ప్రకాశంః వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చంద్రబాబుకు చీమకుట్టినట్టైనా లేదని మండిపడ్డారు. పొగాకు  రైతులకు మద్దతుగా టంగుటూరు పొగాకు కొనుగోలు కేంద్రం వద్ద జరిగిన ధర్నాలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈసందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది కంటే పొగాకు విస్తీర్ణం విపరీతంగా తగ్గిందని..అలాంటప్పుడు రేటు పెంచాల్సింది పోయి ఎలా తగ్గిస్తారని ప్రశ్నించారు. పొగాకు లో గ్రేడ్ కు కూడా కేజీకి రూ.67 ఇస్తామని ప్రకటించారని, కానీ కొనుగోలు కేంద్రం వద్ద రూ. 34 పలుకుతుందని  అన్నారు. 

చంద్రబాబు బుద్ధి జ్ఞానం ఉందా..!
పొగాకు పండించడానికి మూడు నెలలు పడితే అమ్ముకోవడానికి 10 నెలల సమయం పడుతుందని  వైఎస్ జగన్ అన్నారు. వేలం జనవరిలో ప్రారంభమై జూన్ లో ముగుస్తుందని అక్టోబర్ వచ్చినా ఇంకా వేలం కొనసాగిస్తున్నారని..అసలు చంద్రబాబుకు బుద్ధి జ్ఞానం ఉందా అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. జూన్ వరకు రూ. 400 కోట్లు ఖర్చు చేసి 30 మిలియన్ కేజీల పొగాకు కొనుగోలు చేసి ఉంటే రేటు తగ్గేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పొగాకు రైతులకు కనీస మద్దతు ధర కూడా చెల్లించడం లేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. రూ.67లకు తక్కువగా కొనుగోలు చేసిన పొగాకుకు నష్టపోయిన మొత్తాన్ని ప్రభుత్వమే రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు.

రైతులకు అండగా ఉంటా..!
పొగాకుతో పాటు పత్తి, పసుపు, చెరకు, పామాయిల్ , సుబాబులు రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని వైఎస్ జగన్ అన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు లేక రైతులు అల్లాడుతున్నారని జగన్ వాపోయారు. .దివంగత ముఖ్యమంత్రి వైఎస్ . రాజశేఖర్ రెడ్డి హయాంలో పొగాకు రైతులకు ఎంతో మేలు జరిగిందని వైఎస్ జగన్ ఈసందర్భంగా గుర్తు చేశారు. రైతుల పట్ల ప్రభుత్వ వైఖరి దారుణంగా ఉందని, పోయే రోజులు దగ్గర పడ్డాయని విమర్శించారు. ప్రజలంతా  గమనిస్తున్నారని, టీడీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయమన్నారు.  

పోరాటం ఉధృతం చేస్తాం..!
రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు హామీలన్నీ విస్మరించారని వైఎస్ జగన్ దుయ్యబట్టారు. బాబు ఇచ్చిన డబ్బులు వడ్డీలకు కూడా సరిపోక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. రైతుల పక్షాన పోరాటాన్ని ఉధృతం చేస్తామని, నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి అనుకున్నది సాధిద్దామన్నారు.  అంతకుముందు పొందూరు గ్రామపంచాయతీ పొదవారిపాలెంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బొల్లినేని కృష్ణారావు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు.

తాజా వీడియోలు

Back to Top