సింహాచలం అప్పన్నను దర్శించుకున్న వైఎస్ జగన్

విశాఖపట్నం: బీచ్ పర్యటన తరువాత వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి సింహాచలం దేవస్థానాన్ని సందర్శించి వరాహలక్ష్మి నర్సింహ స్వామిని దర్శించుకున్నారు. దేవస్థానం వద్ద ఆలయ అధికారులు, వేదపండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జగన్ దేవస్థానంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా మండపం చుట్టూ ప్రదక్షిణం చేశారు.  అనంతరం విలేకరులు పంచగ్రామాల భూ సమస్యను ప్రస్తావించగా ఆ భూములన్నింటినీ క్రమబద్ధీకరించాలని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ పనిచేసేవారమని స్పష్టంచేశారు. 

శారదాపీఠం సందర్శన
జగన్‌మోహన్‌రెడ్డి పెందుర్తి నియోజక వర్గం చినముషిరివాడలోని విశాఖ పీఠాన్ని సందర్శించి పీఠం ఆవిర్భావోత్సవ పూజల్లో పాల్గొన్నారు. పీఠ ప్రధాన ద్వారం వద్ద వేదపండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తరువాత  జగన్ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిని కలుసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. కొద్దిసేపు ఆయనతో సమావేశమయ్యారు. అనంతరం స్వామితో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
Back to Top