పరిశీలన అంటే అధికారులను తిట్టడం కాదు

తక్షణమే బాధితులను ఆదుకోవాలి
వరద ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటన

రైల్వేకోడూరు
: ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వరద ప్రభావిత
ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. భారీవర్షాల తాకిడికి అతలాకుతలమైన వైఎస్సార్
జిల్లా  రైల్వేకోడూరు ప్రాంతంలో  వైఎస్ జగన్ పర్యటించారు. గుంజనా నది
వరదలతో ప్రభావితమైన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న
పంటలను పరిశీలించి, ఆస్తులు నష్టపోయిన వారిని వైఎస్ జగన్‌ పరామర్శించారు.
కుక్కల దొడ్డి గ్రామంలో రైతులతో మాట్లాడారు.  దెబ్బతిన్న పంటలను పరిశీలించి
బాధితులను ఓదార్చారు. 

గత కొద్ది రోజులుగా
కుండపోత  వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం ఎలాంటి సహాయం
అందించడం లేదని వైఎస్ జగన్  మండిపడ్డారు. తక్షణమే ఇంటికి 25 కిలోల చొప్పున
బియ్యం, నగదు అందించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. వర్ష ప్రభావిత
ప్రాంతాల పరిశీలన అంటే అధికారులను తిట్టడం కాదని.. నిధులిచ్చి అధికారులను
పనిచేయమని చెబితే వారు చేస్తారని  వైఎస్ జగన్ ప్రభుత్వానికి సూచించారు.
ఎంతమందికి మేలు జరిగిందో ప్రజలనే అడిగి తెలుసుకోవాలన్నారు. 

పనులకు
వెళ్లలేని పరిస్థితిలో బాధితులు ఉన్నారని.. 3, 4 వేల రూపాయల డబ్బులు, 25
కిలోల బియ్యం, కిలో కందిపప్పు, చక్కెర ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్
చేశారు. అవేవీ ఇవ్వకుండా అధికారులను తిట్టడం మానవత్వం ఉన్న పని కాదన్నారు.
 ప్రతి గ్రామంలో ప్రజలు తండోపతండాలుగా వచ్చి, తమకేమీ జరగట్లేదని.. బతకడం
కష్టంగా ఉందని చెబుతున్నారని  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.  వైఎస్
జగన్ వెంట ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఉన్నారు.

అంతకు
ముందు వైఎస్ జగన్ శెట్టిగుంట రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ కాలనీలో ఇటీవల
గోడకూలి మృతి చెందిన ....బాలుడు హర్షవర్దన్(4) తల్లిదండ్రులు తిరుమల,
కృష్ణవేణి దంపతులను  వైఎస్ జగన్ పరామర్శించారు. ఎస్.కొత్తపల్లి గ్రామంలో
పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు, బాధిత రైతుల నుంచి వివరాలు
తెలుసుకున్నారు. వైఎస్సార్ జిల్లా పర్యటన పూర్తయిన అనంతరం  రోడ్డు మార్గాన
వైఎస్ జగన్ నెల్లూరుకు బయలుదేరి వెళ్లారు.  అక్కడ వర్షాలకు తీవ్రంగా
నష్టపోయిన పంటలను పరిశీలించి, రైతులను, బాధితులను వైఎస్ జగన్
పరామర్శిస్తారు. 
Back to Top