వైఎస్ జగన్ ట్వీట్

న్యూఢిల్లీ: టీడీపీ అవినీతిని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ దృష్టికి తీసుకెళ్లామని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. అనైతికంగా తమ పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుంటున్న విషయాన్ని ప్రధానంగా జాతీయ నాయకులకు వివరించామని వైఎస్ జగన్ ట్విటర్ లో పేర్కొన్నారు.


వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నాయకులతో కలిసి వైఎస్ జగన్ ఢిల్లీలో రాజ్ నాథ్ సింగ్, శరద్ పవార్ లను కలిశారు. తమ భేటీకి సంబంధించిన ఫొటోలను వైఎస్ జగన్ తన ట్విటర్ పేజీలో పోస్ట్ చేశారు. వైఎస్ జగన్ వెంట మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యానారాయణ, ధర్మాన ప్రసాదరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితర నాయకులు, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ సాగిస్తున్న అప్రజాస్వామిక రాజకీయాలను జాతీయ స్థాయిలో ఎండగట్టడానికి 'సేవ్ డెమొక్రసీ' పేరిట వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధుల బృందం జాతీయ నేతలను కలుస్తోంది. ఈ సాయంత్రం 7.15 గంటలకు జేడీయూ నేత శరద్‌యాదవ్‌తో పాటు మరికొంత నేతలను కలిసే అవకాశం ఉంది.
Back to Top