చింతపల్లిః విశాఖ జిల్లా చింతపల్లి జనసందోహమైంది. ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు ప్రజలు ఘనస్వాగతం పలికారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా చింతపల్లిలో వైఎస్సార్సీపీ నిర్వహించిన బహిరంగసభలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. మధ్యాహ్నం 3.40 గంటల సమయంలో ఆయన సభాస్థలి వద్దకు చేరుకున్నారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. <br/>వేదిక వద్దకు వైఎస్ జగన్ ప్రజాభిమానులకు తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. వేలాదిమంది ఎంతో దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి.. ఏ ఒక్కరి మొహంలో కూడా ఆకష్టాన్ని చూపించకుండా...కష్టం అనిపించినా, దూరం నుంచి వచ్చామన్న తలంపును సైతం పక్కనపెట్టారని వైఎస్ జగన్ అన్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా, భోజనానికి వెళ్లాలన్న ఆలోచనను కూడా పక్కన పెట్టి, చక్కటి చిరునవ్వుతో ఇంతటి ఆప్యాయతను పంచిపెడుతున్న ....ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలకు చేతులు జోడించి, శిరస్సు వంచి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానంటూ వైఎస్ జగన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.