వీఆర్ఏల ఆందోళనకు వైయస్ జగన్ మద్దతు

  • బాబు చర్మం మందమెక్కింది
  • ఎన్నికలనాటి హామీలు గుర్తుకురావడం లేదు
  • ఎవరూ అధైర్యపడొద్దు
  • మన ప్రభుత్వం వచ్చాక అందరికీ రూ.15వేలు ఇస్తాం
  • వీఆర్ఏల దీక్షకు జననేత సంఘీభావం
విజయవాడః వీఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ప్రభుత్వం మాట ఇచ్చి మూడేళ్లవుతున్నా ఇంతవరకు వారిని ఆదుకున్న పాపాన పోవడం లేదని వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మండిపడ్డారు. విజయవాడలో వీఆర్ఏల ఆందోళనకు వైయస్ జగన్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...చాలీచాలనీ జీతంతో బతుకు వెళ్లదీస్తున్న వీఆర్ఏల ఆర్తనాదాలు  ప్రభుత్వానికి పట్టకపోవడం బాధాకరమన్నారు. పక్కన తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏలకు 10,700 ఇస్తున్నారన్న సంగతి తెలిసి కూడా బాబు వాళ్లకు న్యాయం చేయకపోవడం సమంజసమా అని ప్రశ్నించారు.  

రాష్ట్రవ్యాప్తంగా 27వేల మంది రెవెన్యూ అసిస్టెంట్ లు గ్రామసేవల కోసం పనిచేస్తున్నారని, వాళ్ల డిమాండ్ లు సహేతుకమని తెలిపారు. చాలీ చాలని జీతంతో ఎలా బతకాలని వీఆర్ఏలు ఆందోళన చెందుతుంటే...6,400 జీతం వస్తుందని చెప్పి ఉన్న వైట్ కార్డును తీసేసే కార్యక్రమం చేయడం దారుణమన్నారు. అటెండర్, డ్రైవర్ ఏ ఉద్యోగాలొచ్చినా మనకు ఇవ్వాల్సిన కోటా ఇవ్వాలని ఉన్నా...మూడేళ్లుగా ఒక్క ఉద్యోగం కూడ రిలీజ్ చేయని పాపాన ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని బాబు సర్కార్ పై ధ్వజమెత్తారు.

మూడేళ్లుగా కలిసికట్టుగా పోరాడినా బాబు మన మాటలు వినడం లేదని,  ఆయన చర్మం మందమెక్కిందని వైయస్ జగన్ ఎద్దేవా చేశారు. ఎవరూ అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు.  మరో సంవత్సరం పోతే ఎన్నికలొస్తాయి. మూడేళ్లు ఎలాగో కష్టపడ్డాం. ఈ ఏడాది కాలంలో బాబుపై ఒత్తిడి తెద్దాం. బాబు మెడలు వంచైనా పనిచేయించుకునే ప్రయత్నం చేద్దామని వైయస్ జగన్ అన్నారు. ఒకవేళ బాబుతో పనిచేయించుకోలేక పోతే మాత్రం మన ప్రభుత్వం వచ్చాక వారం రోజుల్లోనే అందరికీ రూ. 15వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతీ ఒక్కరి మొహంలో చిరునవ్వులు నింపుతానని పేర్కొన్నారు. 
Back to Top