అడుగడుగునా జననేత జగన్‌కు ఘన స్వాగతం

అనంతపురం: ఆత్మహత్యలు చేసుకున్న అన్నదాతల కుటుంబాల్లో భరోసా కల్పించేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లాలో  ‘రైతు భరోసా యాత్ర’ను ప్రారంభించారు. జిల్లాలో ఆయన ఐదు రోజుల పాటు పర్యటించనున్నారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్ట్ వద్దకు చేరుకున్న వైఎస్ జగన్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.   ఇదిలా ఉండగా అంతకు ముందు చిలమత్తూరులో జగన్‌కు జనం ఘన స్వాగతం పలికారు. ఆయనపై అభిమానులు పూలవర్షం కురిపించారు. ఇసుకేస్తే రాలనంత జనం చుట్టుముట్టారు. చేతిలో చేయి వేసేందుకు ఎగబడ్డారు. జగన్ కరస్పర్శ చాలు అనుకుంటూ తహతహలాడారు. తమ అభిమాన నేతను చూసేందుకు చిలమత్తూరుతో పాటు చుట్టు పక్కల జనం తండోపతండాలుగా తరలివచ్చారు. చిలమత్తూరులో వైఎస్సార్ విగ్రహానికి జగన్‌మోహనరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.

రైతన్నకు అండగా....
వరుణుడి కరుణలేక ఎండిన పంటలు..అరకొరగా పండిన పంటకు గిట్టుబాటు  ధరలేని వైనం..తలకు మించిన భారంగా పరిణమించిన అప్పులు..రుణమాఫీ పేరుతో సర్కారు అవలంభించిన మోసపూరిత వైఖరి..వెరసి అప్పులబాధ తాళలేక అనేకమంది ‘అనంత’ అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టాక జూన్ 2 నుంచి దాదాపు 86 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారంటే అనంతపురం జిల్లాలో రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఇట్టే తెలుస్తుంది. ఈక్రమంలో నేనున్నానంటూ అన్నదాతల్లో భరోసా కల్పించేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉపక్రమించారు.      

జగన్ అంటే ఓ విశ్వాసం.... ఓ భరోసా...

అన్నదాతకు అండగా నేనుంటానంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జరుపుతున్న రైతు భరోసా యాత్ర  అనంతపురం జిల్లా  రైతుల్లో  ఆత్మస్థైర్యం  నింపుతోంది.  అటు ప్రభుత్వ సాయం అందక, ఇటు ప్రకృతి కరుణించక అష్టకష్టాలు పడుతున్న రైతన్నలకు జగన్  కొండంత అండగా కనిపిస్తున్నారు.  పంటలు పండక,  పాత అప్పులు మాఫీ కాక, కొత్త అప్పులు పుట్టక జిల్లా రైతులు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్నారు. అలాంటి  రైతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రతిపక్షాలు, రైతు సంఘాల నేతలు ఎన్ని విజ్ఞప్తులు చేస్తున్నా రాష్ర్టప్రభుత్వం ఇసుమంతైనా చలించలేదు. అసలు రాష్ర్టంలో ఆత్మహత్యలే లేవని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ర్టంలో రైతాంగం ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను, అనంతపురం అన్నదాతలు కరువు రక్కసి కోరల్లో విలవిల్లాడుతున్న విషయాన్ని జగన్‌మోహన్‌రెడ్డి  అసెంబ్లీ సాక్షిగా పూర్తి వివరాలతో సహా వెల్లడించారు.  ఆదుకోవలసిందిగా ప్రభుత్వాన్ని అర్ధించారు. అయితే ఆత్మహత్యలు లేవని, ఉన్నా వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ చెబుతున్నంత మంది ఆత్మహత్య చేసుకోలేదని వితండవాదాలతోనే ప్రభుత్వం సరిపుచ్చింది. చివరకు అధికారయంత్రాంగం ఆత్మహత్యలను ధృవీకరించడంతో చంద్రబాబు పరిహారాన్ని ప్రకటించాల్సి వచ్చింది. అయినా రైతు కుటుంబాలకు ఆ పరిహారం అందించడంలో అంతులేని జాప్యం జరుగుతూ వచ్చింది. ప్రతిపక్షనేత రైతు భరోసా యాత్రకు పూనుకోవడంతో చంద్రబాబు సర్కారు ఆత్మహత్యలు చేసుకున్న రైతాంగానికి పరిహారం పెంచుతున్నామంటూ అధికారికప్రకటలను హడావిడిగా చేసింది. అయినా ఆ పరిహారం ఎప్పుడు అందుతుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో అన్నదాతను ఆదుకునే దిశగా రాష్ర్ట ప్రభుత్వ మెడలు వంచడం కోసం, బాధిత రైతు కుటుంబాలలో మనోస్థైర్యాన్ని నింపడం కోసం అనంతపురం జిల్లాలో ఆదివారం నాడు జగన్‌మోహనరెడ్డి రైతు భరోసా యాత్ర ఆరంభమయ్యింది.
Back to Top