మచిలీపట్నం: ఈ నెల 25న కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రం మచిలీపట్నంలో ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధర్నా చేయనున్నారు. జిల్లా కలెక్టరేట్ దగ్గర ఈ ధర్నా నిర్వహిస్తున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి పేర్ని నాని వెల్లడించారు. ఇటీవల కృష్నా జిల్లా కొత్త మాజేరు లో విష జ్వరాల బారిన పడి 18 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ సంగతి తెలుసుకొని బాధ్యత గల ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ఆ గ్రామంలో పర్యటించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోక పోవటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో మిగిలిన వారికి పూర్తిస్థాయిలో వైద్య సాయం అందించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అయినప్పటికీ ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోవటంతో జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయాలని నిర్ణయించినట్లు నాని వివరించారు.