కాళ్లు పట్టుకోవడం.. కాకా పట్టడమంటే ఇది కాదా బాబూ?


– గాంధీని చంపిన గాడ్సే నిరాహార దీక్ష చేసినట్లుగా ఉంది చంద్రబాబు దీక్ష
– మళ్లీ ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నాలు
– హోదాను ఖూనీ చేసిన వ్యక్తే తిరుపతిలో మీటింగ్‌ పెట్టారు
– గవర్నర్‌ను సుజనా చౌదరి కలిస్తే ఎల్లో మీడియా ఎందుకు వార్తలు రాయలేదు
– ఐబీ చీఫ్‌ను చంద్రబాబు కలిస్తే ఎందుకు గోప్యంగా పెట్టారు
– అగ్రిగోల్డు బాధితులను మోసం చేయడానికి చంద్రబాబు ప్రయత్నం
– రాష్ట్రాన్ని బాబు దోచుకుతింటున్నారని కృష్ణా జిల్లా వాసులు చెబుతున్నారు
– ఎన్ని లక్షలు ఖర్చైనా మీ పిల్లలను నేను చదివిస్తాను
– మెస్, బోర్డింగ్‌ ఛార్జీలకు ఏడాదికి రూ. 20 వేలు ఇస్తాను
– వైయస్‌ఆర్‌ అమ్మ ఒడి పథకం కింద ఏడాదికి రూ.15 వేలు

 
కృష్ణా జిల్లా:  అయ్యా చంద్రబాబు కాళ్లు పట్టుకోవడం.. కాకా పట్టడం అంటే  ఇది కాదా చంద్రబాబు?  అని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు.  ఒక వైపు కేంద్రంతో పోరాటం అంటునే మరో వైపు రహస్య భేటీలు నిర్వహించడం  ఏంటని నిలదీశారు. చంద్రబాబు మరోమారు ప్రజలను మభ్యపెట్టేందుకు  ఈ నెల 30న తిరుపతిలో మీటింగ్ పెట్టారని, ఆ మీటింగ్ లో అందరూ ఫెయిడ్ అర్టీస్టులే అన్నారు. ప్రజా సంకల్ప యాత్ర 147వ రోజు ఉయ్యూరు పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు.

– ఉయ్యూరులో అడుగుపెడుతూనే..నా వద్దకు వచ్చి రైతులన్నలు నాతో మాట్లాడుతున్న అన్న మాటలేంటో తెలుసా? అన్నా..ఈ నాలుగేళ్లలో పురాణాలలో చాలా కథలు విన్నామన్నా..మీరు మొన్న మాట్లాడిన స్పీచ్‌ కూడా విన్నామన్నా..మీరు చెప్పిన కథ చాలా బాగుందన్నా..పురాణాలలో బకాసురుడు, నరకాసురుడు గురించి విన్నా..మా నియోజకవర్గంలో ఇసుకాసురులు ఉన్నారన్నా..చంద్రబాబు నివాసం ఉంటున్న ప్రాంతంలో యథేచ్చగా వేలాది లారీల్లో ఇసుకను తరలించుకుపోతున్నారన్నా..మా నియోజకవర్గం నుంచి లక్షల టన్నుల ఇసుకను తీసుకెళ్తున్నారన్నా అని చెబుతున్నారు. ముఖ్యమంత్రికి కళ్లు ఉండి కనిపించడం లేదు. చెవులుండి వినిపించడం లేదన్నా..అంటున్నారు. చంద్రబాబు కళ్లు పెద్దవన్నా..అదే సమస్య అన్నా అంటున్నారు. అవినీతిని చంద్రబాబు దగ్గరుండి జరిపిస్తున్నారు. ఎమ్మెల్యే దగ్గర నుంచి కలెక్టర్ల వరకు వాటాలు. చిన్నబాబు నుంచి పెద్దబాబు వరకు లంచాలే. ఇవాళ ఈ రాష్ట్రంలో అవినీతి ఏస్థాయిలో ఉన్నది అన్నది పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. 
– అన్నా..ఈ ఒక్క ఉయ్యూరులోనే నాన్నగారి హాయంలో పేదవారి ఇళ్ల స్థలాల కోసం 18 ఎకరాల్లో పట్టాలు ఇచ్చారన్నా..చంద్రబాబు ప్రభుత్వం రావడం మా ఖర్మ అన్నా..ఆ ఇళ్ల స్థలాలను లాక్కుంటున్నారా అంటున్నారు. ఈ స్థలంలో జీ ఫ్లస్‌త్రీ ప్లాట్లు కట్టిస్తామని పేదవారికి మోసం చేస్తున్నారు. ఈ ప్లాట్లు మాములుగా అడుగుకు రూ.1000 మించదు. చంద్రబాబు మాత్రం పేదవారికి అడుగు రూ.2 వేల చొప్పున అమ్ముతున్నారు. రూ. 3 లక్షలు ప్రభుత్వం ఇస్తుందట. మిగిలిన రూ. 3 లక్షలు ఆ పేదవాడు కంతులు కట్టాలట. లంచాలు తీసుకునేది చంద్రబాబు..అప్పులు కట్టేది పేదవాడా? చంద్రబాబు అవినీతి ఎంత దారుణంగా ఉందో చూడండి.
– కాల్వ గట్ల మీద వేలాది మంది నివసిస్తున్నారు. కాల్వ గట్ల నుంచి పేదవాళ్లను తొలగించాలంటే వారికి వేరోక చోట స్థలం చూపించాలి. కానీ ఇవాళ ఇక్కడ రాత్రికి రాత్రి ఆ పేదవాళ్లను కాల్వగట్ల నుంచి తొలగిస్తున్నారు. 
– నాలుగేళ్ల చంద్రబాబు హయాంలో ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర రావడం లేదు. ఇవాళ చెరుకు రైతులు నావద్దకు వచ్చారు. నీరు బాగుంటే 40 టన్నులు, లేదంటే 30 టన్నులకు మించడం లేదు. కౌలుతో పాటు రూ.80 వేలు అవుతుందన్నా..మాకు ఇచ్చేది ఏ మాత్రం సరిపోవడం లేదని చెబుతున్నారు. ఏపీకి , ఉత్తర ప్రదేశ్‌కు ఏమైనా తేడా ఉందా అన్నా అంటున్నారు. అక్కడ టన్నుకు రూ. 3 వేలు ఇస్తున్నారు. ఇక్కడ మాత్రం రూ.2 వేలు కూడా ఇవ్వడం లేదు. ఇంతకు ముందు కొనుగోలు ట్యాక్స్‌ ప్రభుత్వం వెనక్కి ఇచ్చేది. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఇలాంటి ట్యాక్స్‌లు ఇవ్వడం లేదు. రైతులను ఆదుకోవాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. వరికి మద్దతు ధర లేదు. వరి పంట రూ.1200 కొనుగోలు  చేసే నాథుడు లేడు. 
– నాన్నగారి హయాంలో రూ.550 నుంచి 1030 వరికి మద్దతు ధర ఇచ్చారన్నా అని చెబుతున్నారు. చంద్రబాబు పరిపాలనలో  మా ఖర్మ కొద్ది మద్దతు  ధర లేదన్నా అని చెబుతున్నారు. డీఏపీ ఇవాళ రూ.1038 పెరిగింది. ఏలా బతకాలన్నా అంటున్నారు. మినుము పంటకు గిట్టుబాటు ధర లేదు. ఇళ్లలో పెట్టుకొని మద్దతు ధర కోసం వేచి చూస్తున్నామని రైతులు వాపోతున్నారు. వీరి పరిస్థితి చూస్తే బాధనిపిస్తోంది. పసుపు రైతుకు పెట్టుబడి కూడా రావడం లేదు. కౌలు రైతులు దారుణంగా బతుకుతున్నారు. నాలుగేళ్లుగా బ్యాంకు రుణాలు ఇవ్వడం లేదు. పండించిన పంటలను మార్కెట్‌యార్డులో అమ్ముకుందామనుకుంటే సాధ్యం కావడం లేదని వాపోతున్నారు. 
– మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని చంద్రబాబు ఊదరగొడుతున్నారు. నాలుగేళ్లుగా చంద్రబాబుకు ప్రజల సమస్యలు కనిపించడం లేదట. అయ్యో పించన్లు రావడం లేదా? నాకు తెలియదే అంటున్నారు. అబద్దాన్ని కూడా గట్టిగా వంద సార్లు చెబితే ప్రజలు నిజమనుకుంటారని ఎల్లో మీడియాతో వార్తలు రాయిస్తున్నారు. తాటికాయ అంత అక్షరాలతో రైతు రుణాలు మాఫీ, రైతులు కేరింతలు కొడుతున్నారని తప్పుడు కథనాలు రాయిస్తున్నారు.
– నాలుగేళ్ల పాలనలో కన్నీళ్లు పెట్టని ఆడవాళ్లు లేరు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు అందడం లేదు. ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి చంద్రబాబు ఏమంటారో తెలుసా..డ్వాక్రా రుణాలన్నీ మాఫీ అయ్యాయని అబద్దాలు చెబుతున్నారు. ప్రత్యేక హోదా వల్లే ఉద్యోగాలు వస్తాయని తెలిసీ కూడా చంద్రబాబు దాన్ని అమ్మేశారు. ఎన్నికలొస్తున్నాయని తెలిసి ఇప్పుడు ఏమంటారున్నారో తెలుసా..ఈయన సుందర ముఖాన్ని చూసి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయట. 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయట. నోరు తెరిస్తే చాలు అబద్దాలు. ఈయన విదేశాలకు వెళ్తే ప్రయివేట్‌జెట్‌లో వెళ్తారు. ఆయన విదేశాల్లో ఉంటే ఇక్కడ మైక్రోసాప్ట్‌ అంటారు. ఆయన మరో దేశానికి వెళ్తే ఏయిర్‌ బస్సు అంటారు. నాలుగేళ్లుగా ఇదే డ్రామాలు. ఆయన చేసేది ఏమిటో తెలుసా..ఆయనకు ఉన్న ఎల్లో మీడియాను గట్టిగా మేనేజ్‌ చేస్తారు కాబట్టి..లేదని ఉన్నట్లు..ఉన్నది లేనట్లు రాస్తున్నారు. అయ్యా చంద్రబాబు నీవు చేసిన అత్యంత దారుణమైన మోసం ఏంటో తెలుసా? వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు పార్లమెంట్‌ చివరి రోజున తమ పదవులకు రాజీనామా చేసి ఢిల్లీలో ఆమరణ దీక్షకు కూర్చున్నారు. నీవు చేసిన అన్యాయం గురించి ఓ కథ గుర్తుకు వస్తుంది. ఓ సిపాయి తుపాకి తీసుకొని యుద్ధానికి వెళ్తారు. యుద్ధంలో శత్రువు ఎదురువచ్చినప్పుడు ఈ సిపాయి ట్రిగర్‌ నొక్కెతి ఆ బుల్లెట్‌ బయటకు రాలేదు. కారణం ఏంటో తెలుసా..ఆ బుల్లెట్‌ నకిలీ తుపాకి కాబట్టి. ఆ రోజు టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి ఉంటే దేశం మొత్తం మనగురించి మాట్లాడి ఉండేది. కేంద్రం దిగి వచ్చి ప్రత్యేక హోదా మన కాళ్ల వద్ద పెట్టేది. ఆ మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు.
– చంద్రబాబు ఆయన పుట్టిన రోజు ఏప్రిల్‌ 20న అంటే నాలుగో నెల , 20వ తారీఖ్‌. ఆయన 420 కాబట్టి..ప్రజలను మభ్యపెట్టేందుకు 12 గంటల పాటు దీక్ష చేశారట. ఆయన దీక్షలో ఇలా కూర్చుంటే ప్రజలంతా ఆయన కాళ్లకు నమస్కారం పెడతారట. ఎన్‌టీ రామారావు డూప్‌ను తీసుకొచ్చి చంద్రబాబును ఆశీర్వదించినట్లు డ్రామాలు చేశారు. ఎన్‌టీ రామారావు చావుకు కారణమైన చంద్రబాబును ఆయన డూపుతో ఆశీర్వదించినట్లు చూపించారు. ఆయన ఒక పూట దీక్ష కోసం రూ.30 కోట్లు నాశనం చేశారు. ఈ నెల 30న తిరుపతిలో మీటింగ్‌ అట. ఆ మీటింగ్‌లో బీజేపీ మోసం చేసిందని తిరుపతిలో సభ పెడతారట. ఆ తిరుపతిలో బీజేపీతో కలిసి వాగ్ధానం చేసింది మీరు కాదా? గాంధీని చంపేసి గాడ్సే నిరాహార దీక్ష చేసినట్లుగా ఉంది చంద్రబాబు తిరుపతిలో మీటింగ్‌ పెట్టినట్లు ఉంది. ప్రజలను మభ్యపెట్టేందుకు ఏప్రిల్‌ 30న మీటింగ్‌ అంటారు. మరోపక్క చీకట్లో రహస్య భేటీలు పెడుతున్నారు. మన ఉత్సవ విగ్రహం ఉన్నారు కదా గవర్నర్‌ కాళ్లు పట్టుకుంటున్నారు. గవర్నర్‌ను సుజనా చౌదరి కలిస్తే ఎల్లో మీడియా ఏం చేస్తోంది. విజయవాడలో ఐబీ చీఫ్‌ వచ్చి కలిస్తే ఎల్లో మీడియా ఎందుకు గోప్యంగా పెట్టింది. గవర్నర్‌తో గంటన్నర సేపు మాట్లాడితే..అ మీటింగ్‌లో కేంద్రంతో ఎందుకు పోరాటం చేస్తారని ఎల్లోమీడియాతో వార్తలు రాయించారు.
– చంద్రబాబు నాలుగు రోజుల క్రితం ఏం చేశారో తెలుసా? మహారాష్ట్ర ఆర్థిక మంత్రి భార్యను టీటీడీ బోర్డు మెంబర్‌గా చేశారు. ఒక వైపు ఆయన బీజేపీని తిడుతున్నట్లు డ్రామాలు ఆడుతారు. అదే బీజేపీకి చెందిన వ్యక్తి భార్యకు ఉన్నతమైన పదవి ఇస్తారు. ఒకవైపు పోరాటం చేస్తున్నట్లు ఫోజులిస్తారు. మరోవైపు చీకట్లో కాళ్లు పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలంతా పిచ్చొళ్లు నేను ఎప్పుడు చెవిలో పువ్వు పెడితే పెట్టించుకుంటారని చంద్రబాబు అనుకుంటున్నారు. అయ్యా చంద్రబాబు కాళ్లు పట్టుకోవడం అంటే  ఇది కాదా? కాకా పట్టడం అంటే  ఇది కాదా చంద్రబాబు?  
–చంద్రబాబు ఏపీలో దోచేసిన సొమ్మును ఎలా మార్చుకోవాలో అని విదేశాల్లో ఆరాటపడుతున్నారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్తే ఎల్లో మీడియా విఫరీతంగా వార్తలు రాశారు. చంద్రబాబు చక్రం తిప్పుతున్నారని రాశారు. ఆయన గారు ఏపీ భవన్‌లో అర్ధరాత్రి మీటింగ్‌ పెట్టి అమర్‌సింగ్‌ను, ఎస్‌ఎల్‌బీసీని కలిసి ఆగ్రిగోల్డు ఆస్తులు కాజేచేసేందుకు చక్రం తిప్పారు. ఆగ్రిగోల్డు ఆస్తుల విలువలు తగ్గించే కార్యక్రమం మొదలుపెట్టారు. బహిరంగ మార్కెట్‌ విలువ రూ.30 వేలు కోట్ల అంటే, దాన్ని రూ.10 వేల కోట్లకు తగ్గించింది. సీఐడీ రూ.10 వేల కోట్లు అంటే ప్రభుత్వం మాత్రం రూ. 4 వేల కోట్లు  అంటున్నారు. నిజంగా జరుగుతున్నది ఒక్కసారి గమనించండి. నాలుగేళ్లుగా చంద్రబాబు హయాంలో మనం చూసింది అన్యాయాలు, మోసాలు, అబద్ధాలు, అరాచకాలు, అధర్మాలు. 
– ఇక్కడి ప్రజలు చంద్రబాబు గురించి నాతో అన్నారు. అన్నా..మా అల్లుడు గారు ఈ జిల్లాకు ఇల్లరికం వచ్చి ఎన్‌టీరామారావునే కాదు..చివరకు జిల్లానే దోచుకుతింటున్నారని చెబుతున్నారు.
– ఇలాంటి వ్యక్తిని పొరపాటున క్షమిస్తే రేపు పొద్దున ఏం చేస్తారో తెలుసా? ఎల్లో మీడియాలో అన్ని ఇచ్చేశాడు. ప్రజలు కేరింతలు కొడుతున్నారని వార్తలు రాయిస్తారు. చంద్రబాబును క్షమిస్తే రేపు పొద్దున ఏం చేస్తారో తెలుసా? రేపు మీ వద్దకు వచ్చి మైక్‌ పట్టుకొని చిన్న చిన్న అబద్దాలు నమ్మరని ఆయనకు తెలుసు కాబట్టి ..ఏం చేస్తారో తెలుసా? ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానని చెబుతారు. నమ్ముతారా? దానికి బోనస్‌ బెంజి కారు అంటారు. ప్రతి ఇంటికి మనిషిని పంపిస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు డబ్బు పెడతారు. నమ్ముతారా? కానీ రూ.3 వేలు డబ్బు ఇస్తే వద్దు అనకండి. రూ. 5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మనదే. మన జేబులో నుంచి లాక్కున్నదే. ఈవాళ ఏటీఎంలోకి వెళ్లి నొక్కితే డబ్బు రావడం లేదు. ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్లింది. చంద్రబాబు దోసేసి కాస్తా దుబాయి..సింగపూర్‌లో పెట్టుకున్నారు. మిగిలింది మనకు ఇస్తున్నారు. ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనసాక్షి ప్రకారం ఓటు వేయండి. మోసం చేసేవారిని, అబద్దాలు చెప్పేవారిని బంగాళఖాతంలో కలిసేలా ఓటు వేయండి. అప్పుడే ఈ చెడిపోయిన వ్యవస్థలోకి నిజాయితీ, విశ్వసనీయత వస్తుంది. జగన్‌కు మీ అందరి తోడు, దీవెనలు కావాలి. అప్పుడు నిజాయితీ, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం వస్తుంది. 
– రేపు పొద్దున దేవుడు దయదలచి, మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం వచ్చాక మనం ఏం చేస్తామన్నది చెప్పేందుకు నవరత్నాలు ప్రకటించాం. ఈ సభలో పేదవాడి పిల్లల చదువుల కోసం మనం ఏం చేస్తామన్నది చెబుతున్నాను.
– ఒక్కసారి మీ గుండెలపై చేతులు వేసుకొని ఆలోచన చేయమని అడుగుతున్నాను. కారణం ఏంటంటే ఇవాళ ఇంజినీరింగ్‌ ఫీజులు లక్షల్లో ఉంది. ప్రభుత్వం ఇచ్చేది రూ.35 వేలు మాత్రమే. అది కూడా సకాలంలో అందడంలేదని చెబుతున్నారు. మిగిలిన డబ్బుల కోసం తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు. ప్రతి ఏటా రూ.70 వేలు ఆ పిల్లడికి ఖర్చు చేయాలంటే రూ. 3 లక్షలు అప్పులు చేయాల్సి వస్తోంది. ఉన్న ఇల్లు, ఆస్తులు అమ్ముకొని పిల్లలను చదివించుకోవాల్సి వస్తోంది. ఆ దివంగత నేత, వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను గుర్తు చేసుకోండి. మన పిల్లలు ఉన్నత చదువులు చదివితేనే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటకు వస్తుందని మహానేత అనే వారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి చదువుల కోసం గొప్ప స్వప్నాన్ని చూశారు. ఎంత గొప్ప చదువులైనా నీవు చదువు..నేను చదివిస్తానని నాన్నగారు భరోసా ఇచ్చారు. ఇవాళ మహానేత మన మధ్య లేకపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. నాన్నగారు పేదవారి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే..నాన్నగారి కొడుకుగా జగన్‌ రెండు అడుగులు ముందుకు వేస్తానని చెబుతున్నాను. మీ పిల్లలను ఏం చదివిస్తారో చదివించండి..ఎన్ని లక్షలు ఖర్చైనా ఫర్వలేదు నేను చదివిస్తాను.
– మీ పిల్లలను ఇంజనీర్లు, డాక్టర్లుగా చదివించడమే కాదు..హాస్టల్‌ ఖర్చుల కోసం ప్రతి ఏటా రూ.15 వేలు ఇంటి నుంచి పంపించాల్సి ఉంటుంది. ఆ హాస్టల్‌ ఖర్చుల కోసం ఏటా రూ.20 వేలు ఇస్తామని ప్రతి తల్లిదండ్రికి చెబుతున్నాను.
– మన పిల్లలు  ఇంజినీర్లు, డాక్టర్లుగా పెద్ద పెద్ద చదువులు చదివితేనే మన బతుకులు మారుతాయి. మన తల రాతలు మారుతాయి. దానికి పునాదులు ఈ చిట్టి పిల్లల నుంచి పడుతాయి. ఈ చిన్న పిల్లలు బడికి వెళ్లి ఇంజినీర్లు, డాక్లర్లు అయితేనే మన తల రాతలు మారుతాయి. పేదవాడి కోసం రెండు అడుగులు ముందుకు వేస్తాను. ఆ పునాదులు గట్టిగా ఉండేందుకు ప్రతి తల్లికి చెబుతున్నాను. ఆ తల్లి తన బిడ్డను బడికి పంపిస్తే ప్రతి ఏటా రూ.15 వేలు ఇస్తామని మాట  ఇస్తున్నాను. ఇవాళ ఏపీలో 32 శాతం మందికి చదువు రావడం లేదు. ఈ పరిస్థితిని పూర్తిగా మారుస్తు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కలలు కన్న గొప్ప రాజ్యాన్ని తీసుకువస్తాను. నవరత్నాల్లో ఏదైనా సూచనలు, సలహాలు ఇవ్వాలనుకున్నా..నేను ఎక్కడ ఉంటానో మీ అందరికి తెలుసు..ఎవరైనా అర్జీలు తీసుకొని రావచ్చు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చేందుకు బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని పేరు పేరున కోరుకుంటూ సెలవుతీసుకుంటున్నాను...

 
Back to Top