బాబుకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకు వస్తారు


– నర్సీపట్నంలో సెజ్‌ పెట్టి ఉద్యోగాలు ఇస్తామన్నారు? ఇచ్చారా?
– నర్సీపట్నాన్ని మోడల్‌ టౌన్‌ చేస్తామన్నారు..చేశారా?
– నర్సీపట్నంలో అవినీతి అంతా ఇంతా కాదు
– రూ.200 వచ్చే నీటి పన్ను వెయ్యి వసూలు చేస్తున్నారు
– డాక్టర్లు, నర్సులు లేని ఆసుపత్రులు దర్శనమిస్తున్నాయి
– పేదల ప్లాట్లలో కూడా బాబు అవినీతికి పాల్పడుతున్నారు
– ప్లాట్లు ఇస్తే తీసుకోండి..ఆ రుణం మేం మాఫీ చేస్తాం
– జోరు వర్షంలోనూ కట్టుకదలని జనం
విశాఖ: చంద్రబాబుకు ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తుకు వస్తారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదని, మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నంలో అభివృద్ధి జాడే లేదన్నారు. ఇక్కడ జరుగుతున్న  అవినీతి అంతా ఇంతా కాదని ధ్వజమెత్తారు. ప్రజా సంకల్ప యాత్ర 239వ రోజు నర్సీపట్నం టౌన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. జోరుగా వర్షం కురుస్తున్నా వేలాది మంది జనం కట్టుకదలకుండా జననేత ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. వర్షంలో అంతమంది తడవడం ఇష్టం లేక వైయస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేసి అందరికి ధన్యవాదాలు తెలిపారు. బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..ఆయన మాటల్లోనే..

– ఈ రోజు నర్సీపట్నంలో పాదయాత్ర జరుగుతుంటే ఇక్కడి ప్రజలు నాతో అన్న మాటలు ఏంటో తెలుసా..అన్నా..ఇదే పెద్ద మనిషి చంద్రబాబుకు, టీడీపీ నాయకులకు ఎన్నికలప్పుడు మాత్రమే గుర్తుకు వస్తున్నాయని, ఆ తరువాత గుర్తుకు రావడం లేదని అంటున్నారు. ఇదే టీడీపీ నాయకులను మీ సమక్షంలో చంద్రబాబుకు బుద్ది వచ్చేలా ప్రశ్నలు అడుగుతాను. చంద్రబాబు ఇక్కడికి వచ్చి మంత్రితో కలిసి ఇచ్చిన మాటలు ఏమేరకు నిలబెట్టుకున్నారో సమాధానం చెప్పండి. వారు చేసి ఉంటే చేశారని,  చేయకపోతే రెండు చేతులు ఇలా ఇలా ఊపండి.
– చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత జన్మభూమి కార్యక్రమం కోసం ధర్మసాగరం వచ్చినప్పుడు సెజ్‌ పెడతానన్నారు. పరిశ్రమలు తెస్తానన్నారు. అడిగినన్ని ఉద్యోగాలు ఇస్తామన్నారు. పరిశ్రమలు, ఉద్యోగాలు వచ్చాయా?
– ఇదే పెద్ద మనిషి నర్సీపట్నం పట్టణాన్ని మోడల్‌ టౌన్‌ చేస్తానన్నారు. చేశారా?
– ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు మాట్లాడిన మాటలు..నర్సీపట్నం పక్కనే ఉన్న రెసిడెన్షియల్‌ స్కూల్‌ను కాలేజీ చేస్తాన్నారు. రింగ్‌రోడ్డు వేస్తానన్నారు.
– ఇక్కడి మంత్రి నాతవరంలో 30 పడకల ఆసుపత్రి చేస్తామని మాట ఇచ్చారు. చేశారా? ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారు. మరోవైపు టీడీపీ నాయకులు చేస్తున్న అవినీతి అంతా ఇంతా కాదు. రాష్ట్రవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు.
– నాతవరం మండలం సరుగుడులో భారీ ఎత్తున తవ్వకాలు చేపడుతున్నారు. బినామీల పేరుతో లైసెన్స్‌ తీసుకొని టీడీపీ నాయకులు కమీషన్లు పొందుతున్నారని ఇక్కడి ప్రజలు నాతో అంటున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే గిరిజనులమైన మేమే తవ్వకాలను అడ్డుకున్నామని చెప్పారు. దీనికి ప్రతికారంగా పింఛన్లు కత్తిరించారు. కరెంటు కట్‌ చేశారని చెబుతున్నారు. నిజంగా ఈ నాయకులు సిగ్గుతో తలదించుకోవాలి.
– నీరు చెట్టు కింద వంద చెరువుల్లో మట్టిని తవ్వి అమ్ముకుంటున్నారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. తాటి చెట్టు అంత లోతుగా గుంతలు తవ్వుతున్నారని చెబుతున్నారు. మట్టిని తవ్వి ట్రాక్టర్‌ రూ.500 చొప్పున అమ్ముకుంటున్నారని చెబుతున్నారు. ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అంటున్నారు.
– నర్సీపట్నంలో తాగునీటి సమస్య ఉందని చెబుతున్నారు. వరహానదిపై ఆధారపడి నీటిని సరఫరా చేస్తున్నారు. ఆ స్కీమ్‌ నిర్వాహణ అన్యాయంగా ఉందని, పట్టించుకునేనాథుడు లేడని చెబుతున్నారు. పైప్‌లైన్‌ తుప్పుపట్టి మురికి నీళ్లు వస్తున్నాయని ఇక్కడి ప్రజలు వాపోతున్నారు. కనీసం తన నియోజకవర్గంలోని మున్సిపాలిటీకి తాగునీటిని ఇప్పించలేని మంత్రి ఉన్నారంటే ఇంతకంటే అన్యాయం లేదు.
– మున్సిపాలిటీకి ఆనుకుని ఉన్న గ్రామాల్లోని కాలనీల్లో మౌలిక సదుపాయాలు లేవంటున్నారు. డ్రైనేజీ అస్తవ్యస్తంగా మారిందని వాపోతున్నారని తెలిపారు.
– చంద్రబాబు హయాంలో పన్నులు బాదుడే బాదుడు అంటున్నారు. గతంలో ఇంటి పన్ను రూ.200 కట్టెవారిమని, ఇప్పుడు రూ.800 చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు. నీటి పన్ను రూ.1000 వసూలు చేస్తున్నారని చెబుతున్నారు.
– ఏరియా ఆసుపత్రిలో 150 పడకలు. అక్కడ డాక్టర్లు 14 మందికి మించి లేరు. 25 మంది నర్సులు కూడా లేరని చెబుతున్నారు. అంబులెన్స్‌కు రోగులే డీజిల్‌ పోయిస్తున్నారు.
–మంత్రిగారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే..మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటని అంటున్నారు.
– ఇదే నియోజకవర్గంలో ఊరికి ఐదు ఇల్లు కూడా కట్టలేదని వాపోతున్నారు. నాన్నగారి పాలనలో 22 ఎకరాల భూమిని పేదల ఇళ్ల కోసం సేకరిస్తే..వాటిని చంద్రబాబు లాక్కుని పేదవారికి ప్లాట్లు కట్టిస్తానని మోసం చేస్తున్నారు. 300 అడుగుల ప్లాట్‌ కట్టి అడుగు రూ.2 వేల చొప్పున పేదలకు అమ్ముతారట. ప్లాట్‌ కట్టడానికి వెయ్యి కూడా మించదని, అలాంటిది చంద్రబాబు రూ.2 వేలకు అమ్ముతున్నారు. పేదలకు రూ.6 లక్షలకు అమ్ముతారట. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు ఇస్తే..మిగతా రూ.3 లక్షలు ఆ పేదవారు 25 ఏళ్ల పాటు కంతులు కట్టాలట. లంచాలు తీసుకునేది చంద్రబాబు..కంతులు కట్టాల్సింది పేదవాళ్లా? ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆ ప్లాట్ల పంపిణీ కార్యక్రమం చేస్తుందేమో? ఆ ప్లాట్లు ఇస్తే ఎవరూ కూడా వద్దు అనకండి. ఆ తరువాత మనందరి ప్రభుత్వం వచ్చాక మీరు కట్టాల్సిన రూ.3 లక్షల అప్పు మొత్తం మాఫీ చేస్తానని హామీ ఇస్తున్నాను.
– చంద్రబాబు పాలన గురించి చెప్పుకొస్తు..మధ్యాహ్న భోజన పథకం ఆయాలను తొలగిస్తున్నారు. ఎన్నికలకు ముందు జాబు రావాలంటే బాబు రావాలన్నారు. ఇవాళ భోజనాలు పెట్టే ఆయాలను తొలగించే కార్యక్రమం చేసి ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించాలని ఆరాటపడుతున్నారు. ఆరు నెలలుగా ఆ పథకం ఆయాలకు బిల్లులు ఇవ్వడం లేదు. బకాయిలు పెండింగ్‌లో పెడుతూ అక్కచెల్లెమ్మల జీవితాలతో చెలగాటమాడటమో కాదు..పిల్లల జీవితాలతో కూడా చెలగాటమాడుతున్నారు. 
– ఇదే నియోజకవర్గంలో కరెంటు ఉద్యోగస్తులు నా వద్దకు వచ్చారు. ప్రతి ఇంటికి వెళ్లి కరెంటు బిల్లులు తీసుకోవాలంటే మాకు రూ.1.50  ఇస్తున్నారని, అదే కాంట్రాక్టర్‌ నుంచి చంద్రబాబు రూ.4.50 తీసుకుంటున్నారని, చంద్రబాబు, ఆయన కుమారుడు దోచుకుంటున్నారని కరెంటు ఉద్యోగులు చెబుతున్నారు.
– ఇటువంటి అన్యాయమైన పాలన చూస్తున్నాం. చంద్రబాబు పాలనలో మోసం, అబద్ధాలు, అన్యాయాలు కనిపిస్తున్నాయి. నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూశారు కాబట్టి..మరో ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి..మీకు ఎలాంటి నాయకుడు కావాలో ఆలోచన చేయండి. అబద్ధాలు చెప్పేవారు. మోసాలు చేసేవారు మీకు నాయకుడు కావాలా? ఈ చెడిపోయిన వ్యవస్థలోకి నిజాయితీ, విశ్వసనీయత రావాలి. ఎవరైనా నాయకుడు ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలి. ఈ వ్యవస్థలో మార్పు రావాలంటే వైయస్‌ జగన్‌కు మీ అందరి తోడు కావాలి. మీ అందరి ఆశీస్సులు కావాలి, మీ బిడ్డకు అందరి దీవెనలు కావాలి. అప్పుడే ఈ వ్యవస్థలో విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలకు అర్థం వస్తుంది. వర్షం పడుతున్న నేపథ్యంలో..వర్షాన్ని లెక్క చేయకుండా చాలాసేపటి నుంచి వేచి ఉన్నందుకు మీ అందరికీ మనస్పూర్తిగా మరోసారి చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను..

 
Back to Top