బాబుకు ధర్మానికి అధర్మానికి తేడా తెలియదు

నాలుగేళ్లలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదు.
– కలియుగం చంద్రబాబు నుంచే ప్రారంభమైందట
– రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి
– బాబు కొంగ జపం..దొంగ దీక్ష చేస్తున్నారు
– నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాను చంద్రబాబు ఖూనీ చేశారు
– ఉద్యోగాలు రావాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాల్సిందే
– రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు దీక్ష చేస్తే కేంద్రం దిగిరాదా?
– మనందరి ప్రభుత్వం రాగానే నవరత్నాలు తీసుకొస్తాం
– నాలుగు విడతల్లో డ్వాక్రా రుణాలు నేరుగా చెల్లిస్తాం
– అక్కచెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం
– అవ్వాతాతలకు నెలకు రూ. 2 వేల పింఛన్‌
– ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పింఛన్‌
 
కృష్ణా జిల్లా: చంద్రబాబు అధికారం కోసం ఎవరినైనా వెన్నుపోటు పొడుస్తారని, ఆయనకు ధర్మానికి, అధర్మానికి తేడా తెలియదని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. నాలుగేళ్లలో చంద్రబాబు చేయని అవినీతి లేదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని ధ్వజమెత్తారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గన్నవరం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..వైయస్‌ జగన్‌ మాటల్లోనే..

–ఈ రోజు ఈ నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నప్పుడు నా వద్దకు రైతులు వచ్చారు. నిన్న ఈ నియోజకవర్గంలో అడుగుపెట్టినప్పుడు రైతులు అన్నా..నాతో పాటు రండి అంటూ చెరువు వద్దకు తీసుకెళ్లారు. అన్నా..పురాణాల్లో బకాసురుడి పేరు విన్నాం..నరకాసుడి పేరు విన్నామన్నా..చంద్రబాబు పాలనలో మాత్రం ఇసుకాసురులు, మట్టికాసురుల పేర్లు వింటున్నామని రైతులు చెబుతుంటే నిజంగా చంద్రబాబు పాలనలో జరుగుతున్న అన్యాయాలు గుర్తుకు వస్తున్నాయి. చంద్రబాబు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నారు. ఆయన కళ్ల ముందే కృష్ణా నది అవతలి వైపు ఉన్న గ్రామాల్లో ఇసుక తవ్వకాలు, కృష్ణా నదికి ఇవతలి వైపు కూడా వేలాది లారీల్లో ఇసుక తీసుకెళ్తున్నారు. ఆయన కళ్ల ఎదుటే వేలాది ఇసుక రీచ్‌లు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి పాలన ఎప్పుడు చూడలేదన్నా..మట్టితో డబ్బులు సంపాదించవచ్చు అని ఎక్కడ చూడలేదన్నా అని రైతులు అంటున్నారు. పూడిక తొలగింపు పేరుతో చెరువులను సర్వనాశనం చేస్తున్నారన్నా..అడ్డగోలుగా చెరువులు తవ్వితే పొలాలకు నీరు ఎలా వస్తుందో ఆలోచన లేదన్నా అని చెబుతున్నారు. చెరువులో పూడిక తీస్తే బాగుంటుంది కానీ, నీరు–చెట్టు పేరుతో 30 అడుగుల లోతు తవ్వితే పొలాలకు ఎలా నీరందుతుంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చేయదగ్గ స్కాం ఇ దేనా? 
– నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూశాం. పైన చంద్రబాబు కూర్చొని ఇసుక, మట్టి, మద్యం, బొగ్గు కొనుగోలు, కరెంటు కొనుగోలు, కాంట్రాక్టర్లు, రాజధాని భూములు, గుడి భూములు కూడా వదిలిపెట్టకుండా విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. కిందిస్థాయిలో జన్మభూమి కమిటీల పేరుతో పందికొక్కులను తయారు చేశారు. పింఛన్లు కావాలన్నా లంచాలే. చివరకు మరుగుదొడ్డి మంజూరు కావాలన్నా లంచాలే. 
– 2008లో కృష్ణవేణి పాల ఉత్పత్తిదారుల సొసైటిని దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. విజయ డయిరీకి పాలు పోస్తే వెంటనే ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చే వారు అని రైతులు చెబుతున్నారు. మహానేత హయాంలో లీటర్‌ రూ.23 నుంచి రూ.50 వరకు పెరిగాయని చెప్పారు. మా ఖర్మ కొద్ది చంద్రబాబు అధికారంలోకి రావడంతో రూ.4 కోట్ల బకాయిలు పెట్టి కృష్ణవేణి సొసైటీని మూత వేయించారు. హెరిటేజ్‌కు లాభాలు వచ్చేందుకు ఈ డయిరీలు మూత వేయించారు.
–గన్నవరం ప్రాంతంలో వరి తరువాత మినుములు అధికంగా పండిస్తున్నారు. ఇవాళ ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రావడం లేదు. మినుము దిగుబడులు తగ్గాయి. పులిచింతల ప్రాజెక్టు పూర్తి అయినా కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కింద ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేశారు. చంద్రబాబు పుణ్యానా మినుములకు తెగులు సోకింది. నీరు అందకపోవడంతో దిగుబడి తగ్గింది. వరికి మద్దతు ధర లేదు. రూ.1200లకు కొనే నాథుడు లేడు. రైతులంతా కూడా నాన్నగారి పాలనను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. నాడు డీఏపీ రూ.400 ఉండేది. ఈ రోజు రూ.1030 ధర ఉంది అని రైతులు చెబుతున్నారు. ఎంత దారుణంగా పాలన సాగుతోంది.
– మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని చంద్రబాబు ఊదరగొడుతున్నారు. మనకు ఎలాంటి నాయకుడు కావాలని ఆలోచన చేయాలి. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం రైతుల రుణాలన్నీ బేషరత్తుగా మాఫీ కావాలంటే బాబు సీఎం కావాలన్నారు.బ్యాంకులో పెట్టిన బంగారం ఇంటì కి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. నాలుగేళ్లలో మీ బంగారం ఇంటికి వచ్చిందా? బ్యాంకుల నుంచి వేలం నోటీసులు మాత్రం ఇంటికి వస్తున్నాయి. రైతు రుణాలన్నీ మాఫీ చేశానని చంద్రబాబు సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తిని 420 అనాలా?
– అక్కా చెల్లెమ్మలు కంట తడి పెడితే ఇంటికి అరిష్టం అంటారు. నాలుగేళ్లలో కంట తడి పెట్టని ఆడబిడ్డలు ఎవరైనా ఉన్నారు. ఆ రోజు బాబు ముఖ్యమంత్రి అయితే రుణాలు మాఫీ అవుతాయని అడ్వర్‌టైజ్‌మెంట్‌ ఇచ్చారు. నాడు టీవీలో ఊదరగొట్టారు. నాలుగేళ్లలో ఒక్క రూపాయి అయినా డ్వాక్రా రుణాలు మాఫీ అయ్యాయా? 
– పిల్లలను మోసం చేయాలంటే ఎవరైనా వెనుకడుగు వేస్తారు. చంద్రబాబుకు ధర్మానికి, అధర్మానికి తేడా తెలియదు. గెలవడానికి ఎవరికైనా వెన్నుపోటు పొడుస్తారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. మీ పిల్లలు ఏమీ చదవకపోయిన ఫర్వాలేదు ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తారు. లేదంటే నిరుద్యోగ భృతి రూ.2 వేలు ఇస్తారని చెప్పారు. ఇప్పటికి ప్రతి ఇంటికి రూ.96 వేలు చంద్రబాబు బాకీ పడ్డారు. 
– ఎన్నికల సమయంలో చంద్రబాబు ఏమన్నారు..ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అన్నారు. నాలుగేళ్లలో ఒక్క ఇల్లు కట్టించలేదు. ఎన్నికలు దగ్గరికి వచ్చే సరికి ఏమంటారో తెలుసా? ఏడాదిలో పది లక్షల  ఇల్లు కట్టిస్తా అని చెవిలో పువ్వు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో అన్యాయం, మోసం, అబద్ధాలు, అవినీతి. 
– టీడీపీ మేనిఫెస్టోలో ప్రతి కులానికి, ప్రతి మతానికి ఒక పేజీ కేటాయించారు. ఆ ఎన్నికల ప్రణాళికలో ఇచిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా మోసం చేశారు. ఈయన చేసిన మోసాలకు ఎక్కడ ప్రజలు తిడతారో అని టీడీపీ ఎన్నికల ప్రణాళికను వెబ్‌సైట్‌ నుంచి తొలగించారు.
–  ఇలాంటి వ్యక్తిని పొర పాటున క్షమిస్తే రేపు పొద్దున పెద్ద పెద్ద అబద్ధాలు చెబుతారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారు. నమ్ముతారా? నమ్మరు కాబట్టి..బోనస్‌గా బెంజి కారు ఇస్తామంటారు. నమ్ముతారా? నమ్మరు కాబట్టి ప్రతి ఇంటికి తన మనిషిని పంపిస్తారు. ప్రతి చేతిలోనూ రూ.3 వేలు డబ్బు పెడతారు. డబ్బులు ఇస్తే మాత్రం వద్దనకండి. రూ.5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మనదే..మన జేబుల్లో నుంచి లాక్కున్నదే. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనసాక్షి ప్రకారం ఓటు వేయమని మీ అందరిని కోరుతున్నాను. అబద్ధాలు చెప్పేవారిని, మోసాలు చేసే వారిని బంగాⶠఖాతంలో కలిపే పరిస్థితి తీసుకురావాలి. 
–ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలకు అర్థం రావాలి. ఈ వ్యవస్థ బాగుపడాలంటే నా ఒక్కడితో సాధ్యం కాదు. జగన్‌కు మీ అందరి తోడు కావాలి. 
– చంద్రబాబు ఇటీవల కొంగ జపం..దొంగ దీక్ష చేశారు. నాలుగేళ్ల పాటు దగ్గరుండి ఏపీ ప్రజలను మోసం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో ఇన్నాళ్లు చంద్రబాబు వ్యతిరేకించి, ఇవాళ యూటర్న్‌ తీసుకున్నారు. ప్రత్యేక హోదా ఉంటే పరిశ్రమలు పెడతారు. హాస్పిటల్, హోటల్స్‌ పెట్టడానికి పారిశ్రామిక వెత్తలు ముందుకు వస్తారు. అది తెలిసి కూడా చంద్రబాబు దగ్గరుండి ప్రత్యేక హోదాను ఖూనీ చేశారు. మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయని చంద్రబాబు డ్రామాలాడుతున్నారు. విశాఖలో సమ్మిట్‌ అంటారు..ఆ సమ్మిట్‌లో రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. ఇవాళ కుంటి దీక్షలు, నిరాహార దీక్షలు అంటారు. ఆ దీక్ష కూడా ఒక పూట చేస్తాడు. ఈ పెద్ద మనిషికి తెలియనిది ఏంటో తెలుసా? పేదవాళ్లు ఒక్క పూట మాత్రమే తింటారన్న సంగతి చంద్రబాబుకు తెలియడం లేదు. ఆయన చేసే ఒక్కపూట దీక్షకు రూ.30 కోట్లు ఖర్చు చేశారు. పార్లమెంట్‌ చివరి రోజు ప్రత్యేక హోదా రాదని తెలిసి వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు లోక్‌సభ స్థానాలకు రాజీనామా చేసి ఢిల్లీలో ఆమరణ దీక్ష చేపట్టారు. అదే రోజు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి ఉంటే దేశం మొత్తం మన గురించి మాట్లాడేది కాదా? కేంద్రం దిగి వచ్చేది కాదా? ఆరోజు చంద్రబాబు చేయాల్సింది చేయక ఇవాళ డ్రామాలడుతున్నారు. నకిలీ బుల్లెట్‌ అయిన చంద్రబాబు ఇవాళ మైక్‌ పుచ్చుకొని నాకు 25 మంది ఎంపీలను నాకే  ఇవ్వండి..ఈ సారి ప్రత్యేక హోదా తెస్తానని చెబుతున్నారు. 20 మంది ఎంపీలు ఉండి ఏమీ అఘోరించావని చంద్రబాబును నిలదీయండి. ఆ రోజు ఎన్‌టీ రామారావును ఎలా వెన్నుపోటు పొడిచారో..ఇవాళ ఐదు కోట్ల మంది ప్రజలను వెన్నుపోటు పొడిచారు.
– మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం ఏం చేస్తామన్నది చెప్పేందుకు, పేదవారి ముఖాల్లో చిరునవ్వులు చూసేందుకు నవరత్నాలను ప్రకటించాం. ఈ రోజు నవరత్నాల్లో నుంచి మనం చేసే కార్యక్రమంలో భాగంగా అక్క చెల్లెమ్మలకు ఏం చేస్తామన్నది చెబుతాను.
– చంద్రబాబు చేసిన మోసం ఏంటంటే అక్కా చెల్లెమ్మలకు సంబంధించిన పొదుపు రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఆ రుణాలు మాఫీ చేయకపోగా, డ్వాక్రా సంఘాలకు వస్తున్న సున్నా వడ్డీ, పావలా వడ్డీలు ప్రభుత్వం నుంచి బ్యాంకులకు కట్టలేదు. దీనివల్ల పొదుపు సంఘాలకు, రైతులకు వడ్డీలేని రుణాలు అందడం లేదు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నాన్నగారు పేదవారి కోసం ఒక అడుగు ముందుకు వేశారు. జగన్‌ నాన్నగారి కొడుకుగా రెండు అడుగులు ముందుకు వేస్తున్నాను. ఎన్నికల నాటికి ఎంతైతే అప్పు ఉంటుందో నాలుగు ధపాలుగా నేరుగా మీ చేతికే ఇస్తాను.
– అక్కా చెల్లెమ్మలను లక్షాధికారులను చేయాలని దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి గొప్ప స్వప్నాన్ని చూశారు. వడ్డీ లేకుండా రుణాలు ఇప్పించారు. మనందరి ప్రభుత్వం వచ్చాక బ్యాంకులకు కట్టాల్సిన వడ్డీ డబ్బులు ప్రభుత్వమే కట్టి వడ్డీ లేకుండా రుణాలు ఇప్పిస్తాం.
– మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవ్వతాత పింఛన్‌ రూ.1000 నుంచి రూ. 2 వేలకు పెంచుతాం. అవ్వతాతల అవసరాలకు పింఛన్‌ డబ్బులు ఆసరాగా ఉంటాయి. చంద్రబాబుకు అవ్వతాతల పింఛన్లు పెంచాలన్న మనసు రాదు. కాంట్రాక్టర్లకు మాత్రం రేట్లు పెంచుతారు. కారణం ఏంటో తెలుసా? పింఛన్లలో చంద్రబాబుకు కమీషన్‌ రాదని, కాంట్రాక్టర్లకు మాత్రం పెంచుతారు. 
– ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, బీసీ అక్క చెల్లెమ్మలు ఇవాళ వారం రోజులు పని లేకపోతే పస్తులుంటున్నారు. ప్రతి అక్క కోసం చెబుతున్నాను..పింఛన్‌ రూ.2 వేలు  ఇవ్వడమే కాదు..పించన్‌ వయస్సు 45 ఏళ్లకే తగ్గిస్తాం. మిగిలిన వారికి 65 నుంచి 60 ఏళ్లకే తగ్గిస్తాం. నవరత్నాల్లో ఏవైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే అర్జీలు ఇవ్వవచ్చు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చేందుకు బయలుదేరిన మీ బిడ్డను దీవించమని ప్రార్ధిస్తూ..ప్రతి ఒక్కరికి మరొక్కసారి పేరు పేరు హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా..


 
Back to Top