బాబూ..మిమ్మల్ని రమ్మని ఎవరంటున్నారు?

 

– సీఎం బాబే దళారీగా మారితే రైతులను ఆదుకునేది ఎవరు?
– రాష్ట్రంలో చెరకు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది
– సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీలను బాబు మూసేయిస్తారు
– ఎంవీవీఎస్‌ మూర్తికి చక్కెర ఫ్యాక్టరీ కట్టబెట్టాలని బాబు చూశారు
– ఏటికొప్పాక ఫ్యాక్టరీ మళ్లీ నష్టాల్లోకి నెట్టే యత్నం చేస్తున్నారు
– అనకాపల్లిలో వైయస్‌ఆర్‌ 11 వేల ఇళ్లు కట్టించారు
– వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక పేదలు కట్టాల్సిన రూ.3 లక్షలు మాఫీ చేస్తాం
– రాష్ట్రంలో ఇంటి పన్ను, కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు
– అనకాపల్లిని ప్రత్యేక జిల్లాగా మార్చుతాం
– రైతు రుణాల్లో వడ్డీల్లో నాలుగో వంతు కూడా బాబు మాఫీ చేయలేదు
–  అక్కాచెల్లెమ్మలకు ద్రోహం చేసినందుకు బాబూ నువ్వే రావాలా?
– నిరుద్యోగ భృతి ఎగ్గొట్టినందుకు బాబూ నువ్వు రావాలా?
– మళ్లీ నువ్వే రావాలని బాబు గురించి ప్రచారం చేయాలట

విశాఖ: రైతులకు రుణాలు మాఫీ చేయకుండా మోసం చేసిన చంద్రబాబును, అక్కచెల్లెమ్మలకు ద్రోహం చేసిన వ్యక్తిని మళ్లీ నువ్వే రావాలని ఎవరు కోరుకుంటున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఎగ్గొట్టినందుకు బాబూ నువ్వు రావాలా అని నిలదీశారు. చంద్రబాబును పొరపాటున కూడా ఎవరు నమ్మొద్దని ఆయన సూచించారు.  చంద్రబాబును పొరపాటున కూడా క్షమించొద్దు అని సూచించారు.  
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా అనకాపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.  ముందుకు నందమూరి హరికృష్ణ మృతికి సంతాపం తెలిపారు.  

చెరకు రైతులకు చేదు అనుభవం
అనకాపల్లి అంటేనే మనకు తియ్యటి బెల్లం గుర్తుకు వస్తుంది. మునగపాక బెల్లమైతే ప్రసిద్ధి గాంచిన బెల్లం. ఇవాళ బెల్లం, చెరకు పండిస్తున్న రైతుల పరిస్థితి చేదుగా ఉంది. ఒకవైపు పెట్టుబడులు పెరిగాయి, రైతులు నష్టాల్లో కొ ట్టు మిట్టాడుతున్నారు. అప్పులు తీర్చలేక రైతులు భూములు అమ్ముకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పదేళ్ల క్రితం అక్షరాల ఐదు లక్షల టన్నుల బెల్లం వస్తే ఇవాళ కేవలం 3.50 లక్షల క్వింటాళ్లకు పడిపోయింది. రైతులు నావద్దకు వచ్చి బెల్లం చూపించి అన్నా..రేటు లేదన్నా అని వాపోయారు. సీజన్‌ వచ్చేసరికి ఇంకా రేటు పడిపోతుందని చెప్పారు. క్వింటాల్‌కు రూ.3 వేలు కూడా రావడం లేదన్నారు.హెరిటేజ్‌లో బెల్లం కేజీ రూ.84 అమ్ముతున్నారని చెప్పారు.చంద్రబాబు క్వింటాల్‌ రూ.8 వేలకు  అమ్ముతున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి దళారులను కట్టడి చేయాల్సి ఉండగా  తానే దళారులకు నాయకుడై రైతులకు గిట్టుబాటు ధర రాకుండా చేస్తున్నారు.

బాబు దగ్గరుండి నష్టాల్లోకి నెట్టేశారు
చెరకు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీలను చంద్రబాబు దగ్గరుండి నష్టాల్లోకి నెట్టేస్తారు. ఆ తరువాత మూత వేయించి, తన బినామీలకు పప్పులు, బెల్లానికి కట్టబెడతారు. చంద్రబాబు తన బంధువు ఎంవీఎస్‌ మూర్తికి కట్టబెట్టారు. ఏటి కొప్పాక ఫ్యాక్టరీ గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నష్టాల బాటలో ఉంటే నాన్న ముఖ్యమంత్రి అయిన తరువాత కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చి నిలబెట్టారు. మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యాక ఇవాళ ఆ ఫ్యాక్టరీ కథ మొదటికి వచ్చింది. రూ.22 కోట్ల నష్టాలతో నడుస్తోంది. దగ్గరుండి చంద్రబాబు ఏరకంగా నాశనం చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం లేదు.
– పక్కనే తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీ కనిపిస్తోంది. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇదే పరిస్థితి. అప్పట్లో రూ.20 వేల కోట్ల నష్టాల్లోకి వెళ్తే నాన్నగారు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ ఫ్యాక్టరీని ఆదుకున్నారు. సహాయం చేసి బకాయిలు తీర్చారు. క్రషింగ్‌ మొదలు పెట్టించారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఈ ఫ్యాక్టరీలో ఉద్యోగులకు రూ.15.7 కోట్లు బకాయిలు ఉన్నాయి. రూ.29 కోట్లు నష్టాల్లో ఈ ఫ్యాక్టరీ ఉంది. 

మహానేత వైయస్‌ఆర్‌ బోనస్‌ ఇచ్చి ఆదుకున్నారు
చోడవరం షుగర్‌ ఫ్యాక్టరీ కూడా చంద్రబాబు హయాంలో రూ.45 వేల కోట్ల నష్టాల్లో ఉండేది. నాన్నగారు సీఎం అయ్యాక రూ.45 కోట్ల నష్టాన్ని భర్తీ చేసి రూ.45 కోట్లు లాభాలు తెచ్చి పెట్టారు. రాయితీలు ఇచ్చి ఆదుకున్నారు. కార్మికులకు బోనస్‌ ఇచ్చి ఆదుకున్నారు. మళ్లీ ఇవాళ బాబు వచ్చిన తరువాత ఈ ఫ్యాక్టరీ రూ.100 కోట్ల నష్టాల్లో ఉంది. ఎంత దారుణంగా పరిపాలన ఉందో ఇదే నిదర్శనం.
– తాండవ షుగర్‌ ఫ్యాక్టరీ కూడా రూ.28 కోట్ల నష్టాల్లో ఉండేది. వైయస్‌ఆర్‌ సీఎం అయ్యాక ఆదుకోని ఆ ఫ్యాక్టరీకి తోడుగా నిలబడ్డారు. క్రషింగ్‌ 2 వేల టన్నులకు పెంచారు. రైతుకు రూ.3 వేల బోనస్‌ కూడా ఇచ్చారు. అప్పట్లో లాభాలతో పనిచేసిన ఫ్యాక్టరీ చంద్రబాబు పాలనలో తాండవ షుగర్‌ ఫ్యాక్టరీ రూ.45 వేల కోట్ల నష్టాల్లోకి వెళ్లింది.

బాబు తాగే లీటర్‌ నీళ్లు రూ.80..
చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఏది బతకదు. సహకార రంగంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలు మూత పడుతున్నాయి. ఉద్యోగాలు లేక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. డయిరీలు కూడా మూత పడుతున్నాయి. డయిరీలందరూ కూడా కుమ్మక్కై హెరిటేజ్‌ డయిరీ లాభాల కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. లీటర్‌ నీళ్లు రూ.20 అమ్ముతున్నారు. అదే చంద్రబాబు తాగే నీళ్లు హిమాలయ నీళ్లు అక్షరాల రూ.80 లీటర్‌ ధర ఉంది. రైతులకు ఒక లీటర్‌ పాలకు రూ.26 ముష్టి వేసినట్లు ఇస్తున్నారు. రైతుల వద్ద నుంచి లీటర్‌ రూ.26 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. వెన్నను తీసి హెరిటేజ్‌ షాపుల్లో అర లీటర్‌ ప్యాకెట్‌ రూ. 26 చొప్పున అమ్ముతున్నారు. ఇది చంద్రబాబు చేస్తున్న మాయజాలం. రైతులకు లాభాలు ఉండవు. ప్రైవేట్‌ రంగంలోని సంస్థలు అన్నీ ఒక్కటై దోచుకుంటున్నారు. సహకార రంగంలోని ఫ్యాక్టరీలను చంద్రబాబు మూత వేయిస్తున్నారు. 
– విశాఖ డయిరీ ఇవాళ సహకార రంగం నుంచి ఒక కుటుంబం నడుపుతున్న సంస్థగా మారింది. మరొకరు సంఘం డయిరీ తీసుకున్నారు.

కేజీహెచ్‌కు వెళ్లాలా?
ఇదే నియోజకవర్గంలో ప్రజలు నా వద్దకు వచ్చి అన్నా..అనకాపల్లి 250 పడకలు అని చెబుతున్నారు. కానీ పరిస్థితి ఏంటో తెలుసా..46 మంది డాక్టర్లు ఉండాల్సి ఉండగా కేవలం 15 మంది మాత్రమే పని చేస్తున్నారని చెబుతున్నారు. ఇక్కడ ఎవరికైనా బాగోలేకపోతే నేరుగా కేజీహెచ్‌కు వెళ్లమని పంపిస్తున్నారు. అలాంటప్పుడు  ఇక్కడ ఆసుపత్రి ఎందుకు? కేవలం 28 మంది నర్సులతో పని జరుపుతున్నారు. అంబులెన్స్‌లు మూడు ఉంటే డ్రైవర్‌ ఒక్కడే ఉన్నారట.

పేదల ఇళ్లలో కూడా లంచాలే
 అనకాపల్లి ప్రజలు నా వద్దకు వచ్చి చెబుతున్నారు. నాన్నగారి హయాంలో ఈ ఒక్క నియోజకవర్గంలోనే అక్షరాల 11 వేల ఇళ్లు కట్టించారని చెబుతున్నారు. నాన్నగారి హయాంలో సత్యనారాయణపురంలో 3 వేల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించారని, నాన్నగారు చనిపోయిన తరువాత చంద్రబాబు హయాంలో పరిస్థితి ఏంటంటే..ఆ స్థలాలను లాక్కుంటున్నారని, అక్కడ ఫ్లాట్లు కడుతామని మోసం చేస్తున్నారు. 300 అడుగుల ఫ్లాట్లు కడుతారట. వాటిని పేదలకు అమ్ముతారట. అడుగుకు రూ.2 వేల చొప్పున అమ్ముతారట. వీరు కట్టే ప్లాట్లు కట్టడానికి అడుగుకు వేయ్యి కూడా ఎక్కువే అని ఏ బిల్డర్‌ అయినా చెబుతున్నారు. చంద్రబాబు పేదవారికి అడుగుకు రూ.2 వేల చొప్పున రూ.6 లక్షలకు అమ్ముతారట. అందులో రూ.3 లక్షలు పేదవాడి మీద అప్పుగా రాసుకుంటారట. నెల నెల రూ.3 వేల చొప్పున 25 ఏళ్ల పాటు కడుతూ పోవాలట. చంద్రబాబు తీసుకునే లంచాల సొమ్ము పేదవాడు కడుతూ పోవాలట. ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా? ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆ ప్లాట్లు  ఇచ్చే కార్యక్రమం చేస్తారని, ఎవరూ కూడా వద్దు అనకండి. ఆ తరువాత మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జగన్‌ అనే నేను చెబుతున్నాను..మనం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పేదవాడు చెల్లించే రూ.3 లక్షలు మాఫీ చేస్తానని మాట ఇస్తున్నాను.

బాదుడే బాదుడు..
 ఇక్కడి ప్రజలకు చెబుతున్నాను..పేరుకేమో గ్రేటర్‌ విశాఖలో కలిసింది. ఏమైనా మేలు జరిగిందా? ఇంటి పన్నులు బాదుడే బాదుడు. కరెంటు చార్జీలు బాదుడే బాదుడు. రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అనకాపల్లిని ప్రత్యేక జిల్లాగా మార్చుతానని, ఆ జిల్లాకు అనకాపల్లి హెడ్‌ క్వార్టర్‌గా మార్చుతానని చెబుతున్నాను. ఇక్కడి వారు కేజీహెచ్‌కు వెళ్లకుండా ఇక్కడే వైద్యం చేయిస్తానని చెబుతున్నాను.

 మళ్లీ నువ్వే రావాలని ప్రచారం చేయాలట
రాష్ట్రంలో ఎంత అధ్వాన్నమైన పాలన జరుగుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఉద్యోగులు సీపీఎస్‌ రద్దు చేయాలని పోరాటం చేస్తున్నా పట్టించుకోవడం లేదు. చంద్రబాబు తన గురించి ప్రచారం చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. మళ్లీ నువ్వే రావాలని ప్రచారం చేయాలట. ఈ మాట బాబు పదే పదే చెబుతున్నారు. మళ్లీ నిన్ను ఎవరు రమ్మంటున్నారు బాబుగారూ..జనాభాలో 62 శాతం ఉన్న రైతులకు బేషరత్తుగా వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని చెప్పిమోసం చేశావు. కనీసం వడ్డీలో నాలుగో వంతు మాఫీ చేయనందుకు, వారి బంగారం వేలం వేయించినందుకు కృతజ్ఞతగా మళ్లి నువ్వే రావాలని అడుగుతున్నారా ? అక్కా చెల్లెమ్మలకు ద్రోహం చేసినందుకు, పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఒక్క రూపాయి కూడా మాఫీ చేయనందుకు, ఎంత గొప్పగా ఎగ్గొట్టవని, మళ్లీ నువ్వే రావాలని అడుగుతున్నారా?
– ఎన్నికల్లో నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఎగ్గోట్టినందుకు మళ్లీ మోసగాడే మళ్లీ రావాలని అడుగుతున్నారా? . ప్రత్యేక ప్యాకేజీకి ఆశపడి, లేని ప్యాకేజీ ఉన్నట్లు మోసం చేసి, ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టినందుకు మోసగాడా మళ్లీ నువ్వే రావాలి అని అడుగుతున్నారా? 
– మేనిఫెస్టోలో ప్రతి కులానికి ఒక పేజీ పెట్టి మోసం చేసినందుకు అహా నయవంచకా కలకాలం నువ్వే మోసం చేయాలని నిన్ను రమ్మంటున్నారా? మీ లంచాల విశ్వరూపానికి పారిశ్రామిక వేత్తలు విస్తుపోయి మళ్లీ నువ్వే రావాలని కోరుతున్నారా?
– అడ్డు అదుపు లేకుండా స్కూల్‌ , కాలేజీ ఫీజులు పెరుగుతున్నాయి, అన్ని వర్గాలు ఫీజులు కట్టలేక అవస్థలు పడుతున్నారు. కాలేజీలకు పంపించాలంటే లక్షల్లో ఫీజులు గుంజుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులు ఫీజులు కట్టుకోలేక అవస్థలు పడుతున్నా..నీ బినామీలైన నారాయణ, చైతన్య కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని నిర్వీర్యం చేసినందుకు మళ్లీ నువ్వే రావాలని అడుగుతున్నారా? ఎలా అడుగుతారు బాబూ? 
– మీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడికి పంటి నొప్పి వస్తే ఆయనకు వైద్యం చేయించేందుకు సింగపూర్‌కు పంపించారు.  ఇక్కడ రూట్‌ కెనాల్‌ చేస్తే రూ.15 వేలతో పూర్తి అవుతుంది, అదే సింగపూర్‌లో రూ.2.88 లక్షలు చెల్లించారు. పేదవాడు హైదరాబాద్‌లో ఆపరేషన్‌ చేయించుకోవాలంటే ఆరోగ్యశ్రీ కట్‌ అట. అలాంటి నిన్ను ఎవరైనా మళ్లీ రావాలని కోరుకుంటారా?
– అధికారంలోకి రాకముందు బెల్టు షాపులు రద్దు అన్నారు. సీఎం అయ్యాక తొలి సంతకం అన్నారు. ఇవాళ గ్రామ గ్రామాన బడి, గుడి పక్కన బెల్టు షాపులు పెడుతున్నారు. ఇవాళ లక్షల కుటుంబాల్లో ఆత్మీయ, అనురాగాలు లేకుండా చేశారు. అక్కచెల్లెమ్మలతో కన్నీరు పెట్టించినందుకు మళ్లీ నువ్వు రావాలని అడుగుతున్నారా?
– దేశంలో ఎక్కడ లేనంతగా పెట్రోలు, డీజిల్‌పై అధికంగా ట్యాక్సీలు వేయడమే కాకుండా లీటర్‌పై రూ.6 అదనంగా వేస్తున్నారు. కరెంటు చార్జీలు, ఇంటి పన్నులు ఏదో చూసినా బాదుడే బాదుడు. మళ్లీ నువ్వే రావాలని ఎవరైనా అడుగుతారా బాబూ? 
– ఇసుక, మట్టి, కరెంటు కొనుగోలు, కాంట్రాక్టర్లను వదిలిపెట్టడం లేదు. రాజధాని, విశాఖపట్నం భూములు ఏది వదిలిపెట్టకుండా దోచుకుంటుంటే ఎవరండి మళ్లీ నువ్వే రావాలని అని అడుగుతున్నాను.
– గజానికి ఒక గంధారి పుత్రుడు అన్నట్లుగా జన్మభూమి మాఫీయాను తయారు చేశారు. పింఛన్, రేషన్‌ కార్డు కావాలన్నా లంచాలే. ఏపీకి అవినీతి ఆంధ్రగా, అరాచక ఆంధ్రగా మార్చిన ందుకు మళ్లీ నువ్వే రావాలని అడిగేదెవరని అడుగుతున్నాను. ప్రజలు అలా కోరుకుంటారని అనుకోవడం నీ అహంకారానికి నిదర్శనం.
 –చంద్రబాబుకు ఏమనుకుంటారో తెలుసా? జనానికి ఏం చేశామని అనుకోడు. మనం ఏమి చెప్పిన నమ్ముతారని అనుకుంటారు. ఆయన బీజేపీతో ఉంటే బీజేపీ గొప్పదని పొగుడుతారు. ఆయన కాంగ్రెస్‌తో ఉంటే కాంగ్రెస్‌  ఇంకా గొప్పదని పొగుడుతారు. అందుకే ఆయన అడ్డగోలుగా ఓటుకు కోట్లు కేసులో దొరికినా తప్పించుకుంటున్నారు. కళ్లు ఆర్పకుండా అబద్ధాలు చెప్పినా హరిచంద్రుడే అని నమ్మించే ప్రయత్నం చేస్తారు.
– టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌టీ రామారావును వెన్నుపోటు పొడిచి లాక్కున్నా కూడా అది ఒక చారిత్రాత్మకం అని చెప్పగలడు. తన పత్రికల్లో రాయించగలరు. ఎల్లకాలం మోసం చేయలేరు. మళ్లీ మళ్లీ మోసం చేయడం చంద్రబాబు తరం కాదు. పైన దేవుడు ఉన్నాడు..కింద ప్రజలు ఉన్నారు.
– ఇటువంటి అన్యాయమైన, అబద్ధాలు చెప్పే పరిపాలన, మోసాలు చేసే పాలన చూస్తున్నారు. ఈ వ్యవస్థ బాగుపడాలంటే, ఈ వ్యవస్థలో విశ్వసనీయత రావాలంటే పొరపాటున కూడా చంద్రబాబును నమ్మవద్దు. ఒక్కసారి ఆలోచించండి. మీ అందరికి ఎలాంటి పాలన కావాలో ఆలోచించండి. అబద్ధాలు చెప్పేవారు, మోసాలు చేసేవారు మీకు నాయకుడు కావాలా అని అడుగుతున్నాను. ఈ వ్యవస్థలో నిజాయితీ, విశ్వసనీయత రావాలి. ఏదైనా రాజకీయ నాయకుడు ఎన్నికల్లో వెళ్లే ముందు ఫలానిది చేస్తానని మేనిఫెస్టోలో చెప్పి చేయకపోతే తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలి. అప్పుడే ఈ వ్యవస్థలో విశ్వసనీయత, నిజాయితీ వస్తుంది.
–  పొరపాటున కూడా చంద్రబాబును క్షమిస్తే..రేపు పొద్దున మీ వద్దకు వచ్చి చిన్న చిన్న అబద్ధాలు, మోసాలు నమ్మరని బాగా తెలుసు. కాబట్టి ఏం చేస్తారో తెలుసా..మొట్ట మొదట మీ చెవులు ఖాళీగా ఉన్నాయో లేదో చూస్తారు. ఆ తరువాత ఎన్నికల ప్రణాళికలోని 98 శాతం పూర్తి చేశానని క్వాలీఫ్లవర్‌ పెడతారు. ఆ తరువాత మైక్‌ తీసుకొని ఏమంటారో తెలుసా? ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటారు. నమ్మరని చంద్రబాబుకు తెలుసు కాబట్టి ఏం చేస్తారో తెలుసా? కేజీ బంగారానికి బోనస్‌ అంటారు. ప్రతి ఇంటికి బెంజి కారు కొనస్తా అంటాడు. నమ్ముతారా? నమ్మరని ఆయనకు తెలుసు. ప్రతి ఇంటికి ఒక మనిషిని పంపిస్తాడు. ఆ మనిషి మీ వద్దకు వచ్చి ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు డబ్బు పెడతాడు. డబ్బు ఇస్తే మాత్రం వద్దు అనకండి. రూ.5 వేలు కావాలని గుంజండి. అదంతా మన డబ్బే..మన జేబుల్లో నుంచి దోచేసిన సొమ్మే. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనసాక్షి ప్రకారం ఓటు వేయమని కోరుతున్నాను. అప్పుడే ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలకు అర్థం వస్తుంది.
– రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మనం ఏం చేస్తామన్నది చెప్పేందుకు నవరత్నాలు ప్రకటించాం. ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వులు చూడాలన్నదే నవరత్నాలను ప్రకటించాం. ఈ మీటింగ్‌లో నవరత్నాల్లో నుంచి చదువుకుంటున్న పిల్లల కోసం, వారి చదువుల కోసం ఆరాటపడుతున్న తల్లులకు మనం ఏం చేస్తామన్నది చెబుతాను. 
– మీ పిల్లలను ఏం చదివిస్తారో చదివించండి. ఎన్ని లక్షలు ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుంది. అంతేకాదు హాస్టల్‌ ఖర్చుల కోసం ఏడాదికి రూ.20 వేలు చెల్లిస్తాం. అలాగే మీ పిల్లలను ఏ స్కూల్‌కు పంపించినా తల్లి ఖాతలో రూ.15 వేల చొప్పున ప్రతి ఏటా జమా చేసి తోడుగా ఉంటాం. ఈ చెడిపోయిన వ్యవస్థను మార్చేందుకు పాదయాత్రగా బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.

 
Back to Top