దోపిడీదారులకు బాబు మాస్టర్‌ ట్రైనర్‌



– పశ్చిమ గోదావరి జిల్లాకు చంద్రబాబు చేసింది ఏంటి?
– కమీషన్ల కోసమే చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం వెళ్తారు
– ఈ నాలుగేళ్లలో పోలవరం కట్టారా?
– నీట్‌ కాలేజీ కాంపౌండ్‌ వాల్‌ కూడా బాబు కట్టలేకపోయారు
– తాడేపూడిలో పిల్లకాల్వలైనా బాబు తవ్వించారా?
– ఎమ్మెల్యేలకు రౌడీయిజంలో బాబు శిక్షణ ఇచ్చారు
– ప్లాట్‌ల పేరుతో బాబు పేదల జేబులకు చిల్లు పెడుతున్నారు
– దళారులపై ఉక్కుపాదం మోపాల్సిన సీఎం వారికి నాయకత్వం వహిస్తున్నారు
– కాపులకు బాబు కంటే రెట్టింపు సాయం చేస్తా
– ఆరోగ్యశ్రీని పూర్తిగా మార్చేస్తాం
– ఆసుపత్రిలో వెయ్యి బిల్లు దాటితే ఆరోగ్య శ్రీ కింద పరిగణిస్తాం
– దీర్ఘకాలిక రోగులకు ప్రతి నెల రూ.10 వేల పింఛన్‌
పశ్చిమ గోదావరి: దోపిడీ..లంచాలు, దౌర్జన్యం ఎలా చేయాలో టీడీపీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులకు చంద్రబాబు ట్రైనింగ్‌ ఇచ్చారని, ఆయనే వారందరికీ మాస్టర్‌ ట్రైనర్‌ అని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శించారు. 2014 ఎన్నికల్లో 15కు 15 స్థానాల్లో టీడీపీ గెలిస్తే..ఈ జిల్లాకు చేసింది ఏంటని ఆయన ప్రశ్నించారు. కమీషన్ల కోసమే చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం వద్దకు వెళ్తున్నారని మండిపడ్డారు. ఆయన అవినీతి కారణం పొలవరం పనులు మందకోడిగా సాగుతున్నాయని ధ్వజమెత్తారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 167వ రోజు తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో పోలవరం కట్టలేదు. కనీసం మిగిలిపోయిన పిల్ల కాల్వలైనా కట్టారా? ఈ ఊర్లో నాన్నగారి హయాంలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ కోసం శంకుస్థాపన చేస్తే..మిగిలినపోయిన పనులు పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది. ఈ జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు చక్కని ట్రైనింగ్‌ ఇచ్చారు. రౌడీయిజం చేయడంలో ట్రైనింగ్‌ ఇచ్చారు.. అధికారులపై దౌర్జన్యం చేయడంలో ట్రైనింగ్‌  ఇచ్చారు. ఆడవాళ్లను జుట్టుపట్టుకొని ఈడ్చుకెళ్లే విషయంలో..ఇసుకను ఎలా దోచుకోవాలో ట్రైనింగ్‌ ఇచ్చారు. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు ఎలా లాక్కోవాలో చంద్రబాబు ట్రైనింగ్‌ ఇచ్చారు. ఇలా ఒక్కటేమిటి అద్భుతంగా ట్రైనింగ్‌ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు ట్రైనింగ్‌ పుణ్యమా అని పైన ఆయన దేన్ని వదిలిపెట్టరు. మట్టి, ఇసుక, మద్యం, బొగ్గు కొనుగోలు, రాజధాని భూములు, చివరకు గుడి భూములు, తిరుపతి ఆలయంలో ఆభరణాలు కూడా వదిలిపెట్టడం లేదు. కింద జన్మభూమి కమిటీలకు వదిలేశారు. రేషన్‌కార్డు కావాలన్నా లంచాలే..చివరకు మరుగు దొడ్డి కావాలన్నా లంచాలు ఇవ్వాల్సిందే. అంత గొప్పగా చంద్రబాబు ట్రైనింగ్‌ ఇచ్చారు. మీ నియోజకవర్గంలోనే ఎమ్మెల్యే ఒకరు, మరోకరు ముళ్లపూడి బాపిరాజు. ఇసుక మట్టి కథ దేవుడేరుగు..పేకాటపై కూడా ట్రైనింగ్‌ ఇచ్చారు. పోలీసులు అడ్డుతగలకుండ ఉండేందుకు వీరికి లంచాలు ఇవ్వాలట. సీఐ పేకాటను అడ్డుకున్నారని ఆయన్ను వీఆర్‌లోకి పంపించారు. వీళ్ల లంచాలు కలెక్టర్ల నుంచి చిన్నబాబు, పెద్ద బాబు వరకు సాగుతున్నాయి. నోటి మీద కట్టడి ఎవరికి ఉండదు. ఇదే జిల్లా కలెక్టర్‌ టీచర్లను ఉద్దేశించి ఏమన్నారంటే..టీచర్లంతా కూడా కదిలే శవాలు అన్నారు. టీచర్లకు మంచి మాటలు చెబితే వారు కూడా పిల్లలకు మంచి మాటలు చెబుతారు. ఈ కలెక్టర్‌ చంద్రబాబుకు క్లోజ్‌గా పనిచేస్తున్నారు. నాలుగేళ్లుగా ఇదే కలెక్టర్‌ కొనసాగుతున్నారు. అంత గొప్పగా కలెక్టర్‌తో చంద్రబాబు ప్రయాణం చేస్తున్నారు. బ్రహ్మండంగా చేస్తున్నారని భుజాన చెయ్యి వేసి మెచ్చుకుంటారు. 
– పోలవరానికి ప్రతి సోమవారం చంద్రబాబు అక్కడికి వెళ్తున్నారు. ఆయన వెళ్లేది పనులు చేయించేందుకు కాదు..కమీషన్ల కోసమే వెళ్తున్నారు. ఆ నాడు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పోలవరాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చారు. ఆయన మరణాంతరం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు కమీషన్ల కోసం కేంద్రం నుంచి తీసుకొని రేట్లను విఫరీతంగా పెంచుకుంటూ పోతున్నారు. చంద్రబాబు వచ్చిన మూడేళ్లలో అల్యూమినియం, సిమెంట్, ఇసుక, ఐరన్‌ రేట్లు తగ్గాయి. నామినేషన్‌ పద్దతిలో చంద్రబాబు తన బినామీలను కాంట్రాక్టర్లుగా తీసుకువచ్చారు. యనమల రామకృష్ణుడు బంధువు పోలవరంలో కాంట్రాక్టర్‌గా ఉన్నారు. చంద్రబాబు అవినీతి కారణంగా పోలవరం పనులు నత్తనడకన సాగుతున్నాయి. నాలుగేళ్లలో కేవలం 6 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులు కూడా జరగలేదు. పక్కన కాలేశ్వరం ప్రాజెక్టులో రోజుకు 6 వేల క్యూబిక్‌మీటర్ల పనులు జరుగుతుంటే పోలవరంలో కేవలం 3 వేల క్యూబిక్‌మీటర్లు కూడా జరగడం లేదు. చంద్రబాబు ఈ జిల్లాకు వచ్చిన ప్రతిసారి పనులు వేగంగా సాగుతున్నాయని చెబుతున్నారు. మొన్న 53 శాతం పనులు పూర్తి చేశామని చెబుతున్నారు. అందులో 70 శాతం పనులు వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పూరై్తనవి కావా చంద్రబాబూ? అయినా చంద్రబాబు అబద్ధాలు..మోసాలు చెప్పుకుంటూ పోతున్నారు. 
– ఈ నియోజకవర్గంలో 30 వేల ఎకరాలకు నీరందించే తాడిపూడి ప్రాజెక్టును చంద్రబాబు మరచిపోయారు. ఈ ప్రాజెక్టును వైయస్‌ఆర్‌ పూర్తి చేశారు. ఆ ప్రాజెక్టు పరిధిలో కేవలం పిల్ల కాల్వ పనులు పూర్తి అయితే 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. దీంతో కేవలం 60 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. అంటే చంద్రబాబు తిని పడుకుంటున్నారా? పక్కనే తెలంగాణ బార్డర్‌లో అయిల్‌ ఫామ్‌ రైతులకు టన్నుకు రూ.10 వేలు ఇస్తున్నారు. ఇక్కడేమో వెయ్యి తక్కువ ఇస్తున్నారు. రేట్లలలో అవకతవకలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. వరి పంటను అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నారు. మొక్కజొన్న రైతులు పంటను అమ్ముకోలేకపోతున్నారు. కనీసం రూ.1100 కూడా రావడం లేదు. 
– నాలుగేళ్లుగా చంద్రబాబు పాలనను మీరంతా చూశారు. కనీసం ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా? చంద్రబాబే దళారిగా ఉంటూ హెరిటేజ్‌ సంస్థ లాభాల కోసం దగ్గరుండి దళారీలకు తానే నాయకుడిగా ఉంటున్నారు. రైతులన్న వద్ద నుంచి చంద్రబాబు తక్కువ ధరకు కొనుగోలు చేసి నీట్‌గా ప్యాక్‌ చేసి తన హెరిటేజ్‌లో మూడు రేట్లకు ఎక్కువగా అమ్ముకుంటున్నారు. ముఖ్యమంత్రి అన్న వ్యక్తి దళారీలపై ఉక్కుపాదం మోపాలని కానీ, ఈయనే దళారీగా మారితే రైతులకు గిట్టుబాటు ధర ఎలా వస్తుంది?
– చంద్రబాబు హయాంలో జరుగుతున్న అవినీతిని ఒక్కసారి గమనించండి. ఇదే నియోజకవర్గంలో 57 ఎకరాల్లో ఇల్లు కట్టాలని రాజీవ్‌ గృహ కల్ప కింద కేటాయించారు. ఆ ఇళ్లను లాక్కొని..అక్కడ పేదలకు ప్లాట్లు కడుతారట. పేదలకు ఎవరైనా స్థలం ఇవ్వాలని ఆలోచన చేస్తారు. చంద్రబాబు మాత్రం పేదలకు ప్లాట్లు అమ్ముకోవాలని ఆరాట పడుతున్నారు. చంద్రబాబు కట్టే ప్లాట్లలో లిప్ట్‌ ఉండదు. గ్రానైట్‌ పరుపులు ఉండవు. చంద్రబాబు 300 అడుగుల ప్లాన్‌ను రూ.6 లక్షలకు అమ్ముతున్నారు. ఇందులో రూ.1.50 లక్షలు కేంద్రం, మరో రూ.1.50 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందట. మిగిలిన రూ. 3 లక్షలు అప్పుగా ఇస్తారట. ఆ పేదవాళ్లు 25 సంవత్సరాలు చెల్లించాలట. చంద్రబాబు ప్లాట్లు ఇస్తే తీసుకోండి. మనందరి ప్రభుత్వం వచ్చాక మేమే డబ్బులు కడుతాం.
– ఇదే నియోజకవర్గంలో ఉద్యనవన యూనివర్సిటీని వైయస్‌ రాజశేఖరరెడ్డి స్థాపించారు. ఈ యూనివర్సిటీకి ఇంతవరకు వైస్‌ చాన్స్‌లర్‌ను నియమించలేదు. ఇంత దారుణం ఎక్కడైనా ఉందా?
– నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూశారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయి. మీ అందరికి ఎలాంటి నాయకుడు కావాలో గుండెలపై చేతులు వేసుకొని ఆలోచన చేయండి. మోసాలు చేసేవాడు మీకు నాయకుడు కావాలా? అబద్ధాలు చెప్పేవారు మీకు నాయకుడు కావాలా? ఆలోచన చేయండి.
– నాలుగేళ్ల క్రితం చంద్రబాబు  ఇదే జిల్లాలో ఏమన్నారు. రైతుల రుణాలు రూ.87 వేల కోట్లు మాఫీ కావాలంటే బాబు సీఎం కావాలన్నారు. అంతటితో ఆగిపోలేదు. ఒక్క అక్కను చూపించి..ఆమె మెడలో తాళి బొట్టు ఒక చెయ్యి వచ్చి లాక్కెళ్తుంది. వెంటనే మరొక చెయ్యి వచ్చి పట్టుకుంది. వెంటనే ఆయన వస్తున్నాడు అన్నారు. ఆయన వచ్చాడు..బంగారం ఇంటికి రాలేదు. ఆయనొచ్చాడు..హైదరాబాద్‌లో బంగ్లా వంటి ఇల్లు కట్టించుకున్నారు. 
– అక్క చెల్లెమ్మలు కనిపిస్తే చాలు..నేనే డ్వాక్రా సంఘాలను కనిపెట్టానని అన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఒక్క రూపాయి అయినా మాఫీ అయ్యిందా? 
– చిన్నపిల్లలను మోసం చేయాలంటే నాలుగు సార్లు ఆలోచన చేస్తారు. వారిని మోసం చేయడం ధర్మం కాదనుకుంటారు. కానీ చంద్రబాబు జాబు రావాలంటే బాబు రావాలన్నారు. జాబు ఇవ్వకపోతే ప్రతి ఇంటికి రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ప్రతి ఇంటికి చంద్రబాబు రూ.96 వేలు బాకీ పడ్డారని నిలదీయండి.
– ప్రతి కులానికి టీడీపీ ఎన్నికల ప్రణాళికలో ఒక పేజీ కేటాయించారు. ప్రతి కులాన్ని మోసం చేశారు. రజకులు, బోయలు, కాపులు ఇలా అందరిని మోసం చేశారు. ప్రజలందరూ టీడీపీ మ్యానిఫెస్టో చూసి ఓట్లు వేశారు. ఆ తరువాత మత్స్యకారులు వెళ్లి చంద్రబాబును అడిగితే ..‘‘తాట తీస్తా’’ అని బెదిరించారు. కాపులు వెళ్లి మాకు రిజర్వేషన్లు చేస్తామన్నావ్‌ కదా అని ప్రశ్నిస్తే..లాఠీలతో కొట్టించారు. దొంగ కేసులు పెట్టించారు. ఆడవాళ్లను చూడకుండా బూతులు తిట్టడం. నాలుగేళ్లుగా జరుగుతున్న పని ఇది. కొన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయి. మరికొన్ని రాష్ట్రం పరిధిలో ఉండవు. ఇలాంటి వాటిని కూడా చేస్తామని మోసం చేయడం భావ్యమేనా? ఇలాంటి వ్యక్తిని జైల్లో పెట్టాలి.
– టీడీపీ ఎన్నికల ప్రణాళిక ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. ఎందుకో తెలుసా? చంద్రబాబు చేసిన మోసాలకు ఎక్కడ ప్రజలు కొడతారో అని మేనిఫెస్టోను మాయం చేశారు. ఇటువంటి వ్యక్తిని పొరపాటున కూడా క్షమిస్తారా? 
– ఇవాళ నావద్దకు కాపులు వచ్చి అర్జీలు ఇచ్చారు. ఎలా మోసపోయారో వివరించారు. చేయగలిగినవే నేను చెబుతాను. చంద్రబాబులాగా అబద్ధాలు చెప్పడం నా చేత కాదు. పేదల గుండెల్లో వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎలా గుడి కట్టుకున్నారో అంతకన్న గొప్పగా చేస్తానని మాట ఇస్తున్నాను. ప్రతి కాపు సోదరుడికి చెబుతున్నాను. చంద్రబాబు కంటే రెట్టింపుగా చేస్తానని హమీ ఇస్తున్నాను. చంద్రబాబును మీరు క్షమిస్తే రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత ఉండదు. నిజాయితీ ఉండదు. రాజకీయ వ్యవస్థలోకి విలువలు, విశ్వసనీయత రావాలి. ఎవరైనా అబద్ధాలు చెప్పాలన్నా..మోసం చేయాలన్నా ఆలోచన చేసే విధంగా ఉండాలి. 
– చంద్రబాబును పొరపాటున క్షమిస్తే రేపుపొద్దున చిన్న చిన్న అబద్ధాలు, మోసాలు నమ్మరని ఆయనకు తెలుసు కాబట్టి..ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారు. నమ్ముతారా?నమ్మరు కాబట్టి ..కేజీ బంగారానికి బోనస్‌ అంటారు. ప్రతి ఇంటికి కేజీ బంగారంతో పాటు బెంజికారు ఇస్తానంటారు. నమ్ముతారా? నమ్మరు కాబట్టి ప్రతి ఇంటికి తన మనిషిని పంపించి ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు పెడతారు. డబ్బులు ఇస్తే వద్దనకండి. రూ.5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మనదే. మన జేబుల్లో నుంచి దోచిన సొమ్మే. కానీ ఓటు వేసే సమయంలో మాత్రం మీ మనసాక్షి ప్రకారం ఓటు వేయండి. అప్పుడే ఈ చెడిపోయిన వ్యవస్థలోకి విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలకు అర్థం వస్తుంది. 
– రేపు పొద్దున ఇటువంటి అన్యాయమైన పాలన పోయి..మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం ఏం చేస్తామన్నది చెప్పేందుకు నవరత్నాలు ప్రకటించాం. మనందరి ప్రభుత్వం వచ్చాక ప్రతి పేదవాడి ఆరోగ్యం కోసం మనం ఏం చేస్తామన్నది ఈ సభలో చెబుతాను.
– ఇవాళ మీ వద్దకు వచ్చే సమయానికి నా వద్దకు కనీసం ఇద్దరో, ముగ్గురో ఆపరేషన్‌ చేయించే స్థోమత  లేదని చెబుతున్నారు. నా సొంత ఖర్చులతో చేయాల్సిన సాయం చేస్తున్నాను. ఇవాళ ఆ రోజుల్లో నాన్నగారి పాలనను గుర్తుకు తెచ్చుకోండి. పేదవాడు అప్పులపాలు అయ్యేది ఎప్పుడంటే వైద్యం, విద్య కోసమే. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌రాజశేఖరరెడ్డి దేశంలోనే ఎవరు చేయని విధంగా పేదవాడికి తోడుగా నిలబడ్డారు. నాడు 108 ఫోన్‌చేస్తే చాలు 20 నిమిషాల్లో ఆ పేదవాడి ఇంటికి అంబులెన్స్‌వచ్చేది. ఉచితంగా ఆపరేషన్లు చేయించి చిరునవ్వుతో ఇంటికి చేర్చేవారు. ఇవాళ ఆరోగ్య శ్రీ పరిస్థితి ఎలా ఉందో ఆలోచన చేయండి. ఇవాళ 20 నిమిషాల్లో అంబులెన్స్‌ వస్తుందా? 108 ఉద్యోగులకు జీతాలు అందడం లేదు. అంబులెన్స్‌కు డీజిల్‌ లేదని, టైర్లు లేవన్న సమాధానం వినిపిస్తోంది. మండలానికి ఒక అంబులెన్స్‌ కథ దేవుడెరుగు..నియోజకవర్గానికి కూడా ఒక్క అంబులెన్స్‌ లేదు. ఇవాళ కూడా ఓ తల్లి నా బిడ్డకు మూగచెవుడు ఉంది. ఆపరేషన్‌ చేయించాలని వచ్చారు. నాన్నగారి పాలనలో ఆ చిన్న పిల్లలకు కాక్లియర్‌ ఇన్‌ప్లాంట్‌ ఆపరేషన్‌ ఉచితంగా చేయించేవారు. ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా ఉందో ఆలోచన చేయండి. నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు 8 నెలలుగా బకాయిలు ఉన్నాయి. అలాంటి ఆసుపత్రికి వెళ్తే పేషేంట్లను పట్టించుకోవడం లేదు. ఏదైనా పెద్ద రోగం వస్తే మంచి ఆసుపత్రికి వెళ్లాలని ఆరాటపడుతారు. మంచి ఆసుపత్రులు అన్నీ కూడా హైదరాబాద్‌లోనే ఉన్నాయి. కానీ ఇవాళ చంద్రబాబు పాలనలో వైద్యం కోసం హైదరాబాద్‌లో వైద్యం చేయించుకుంటే ఆరోగ్యశ్రీ కట్‌ అంటున్నారు. కిడ్నీ పేషేంట్లకు డయాలసిస్‌ చేయించడం లేదు. ఏడాదికి రూ.2 లక్షలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్‌ చేయడం లేదు. క్యానర్‌ను నయం చేయాలంటే కీమో థెరఫీ చేయాలి. కనీసం ఏడు, ఎనిమిది సార్లు కీమో థెరఫీ చేయాలి. ఈ ప్రభుత్వం రెండు సార్లు మాత్రమే చేయిస్తారట. ఇలాంటి పరిస్థితుల్లో పేషేంట్లు అటు నుంచి అటే వెళ్లిపోతున్నారు.
– రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని పూర్తి మార్పు చేస్తాం. నాన్నగారు పేదవారి కోసం ఒక అడుగు ముందుకు వేశారు. నాన్నగారి కొడుకుగా రెండు అడుగులు ముందుకు వేస్తాను. ఆరోగ్యశ్రీని మెరుగుపరుస్తాం. ఎంతపెద్ద ఆపరేషన్‌ అయినా కూడా ఉచితంగా చేయిస్తాను. రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ కింద వర్తింపజేస్తాం. ఆపరేషన్‌ చేయించుకున్న తరువాత పేదవాడు విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా డబ్బులు ఇస్తాను. ఏ పేదవాడు కూడా పస్తు పండుకునే పరిస్థితి రానివ్వను. ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాను. తలసీమియా, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి ప్రతి నెల రూ.10 వేల పింఛన్‌ ఇస్తాను. పేదవాడికి ఆరోగ్యం బాగోలేకపోతే మంచి ఆసుపత్రిలో వైద్యం అందించాలి. అది హైదరాబాద్, బెంగుళూరు, ఎక్కడైనా సరే ఆరోగ్యశ్రీ కింద చేయిస్తాం. నవరత్నాలలో ఇంకా ఏదైనా మార్పులు, చేర్పులు ఉంటే సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే నేను ఎక్కడ పడుకుంటానో? ఎక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నానో మీ అందరికి తెలుసు. అర్జీలు తీసుకుని ఎవరైనా నా వద్దకు రావచ్చు. ఈ చెడిపోయిన వ్యవస్థను మార్చేందుకు బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
 
Back to Top