ఇది ఒక ఉద్వేగభరితమైన నిర్ణయమే45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలలందరికీ నెలకు రూ.2,000

-  60 ఏళ్లకే వృద్ధాప్య  పింఛన్‌

 అనంత‌పురం:  చేనేత కార్మికుల ఆత్మహత్యలకు పేద‌రిక‌మే కారణమ‌ని తెలిసి తాను ఒక ఉద్వేగ‌భ‌రిత‌మైన నిర్ణ‌యం తీసుకున్నాన‌ని, పేదింటి మ‌హిళ‌ల‌కు వైయ‌స్ఆర్ చేయూత పెన్ష‌న్ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించిన‌ట్లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన పేద మహిళలకు ‘వైయ‌స్ఆర్ చేయూత పెన్షన్‌’ కింద నెలకు రూ.2,000 అందిస్తామని  వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. క్రిస్మస్‌ పర్వదినం రోజు ‘జగన్‌ స్పీక్స్‌’ పేరుతో విడుదల చేసిన ఓ వీడియోలో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తన అభిప్రాయాలను వెల్లడించారు.

పేరేదైనా గానీ..
ధర్మవరంలో చేనేత కార్మికుల ఆత్మహత్యల నేపథ్యంలో 35 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న మహిళలతో మాట్లాడిన సందర్భంగా ఆ కుటుంబాలు పడుతున్న కష్టాలు చూసి 45 ఏళ్లకే పెన్షన్‌ అనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు వైయ‌స్ జ‌గ‌న్ వివరించారు. పేరేదైనా గానీ పేదింటి మహిళలకు నెలనెలా రూ.2వేలు ఇచ్చి ఆదుకోవడమే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. అంతేకాక అందరికీ వృద్ధాప్య పెన్షన్‌ను 60 ఏళ్లకే ఇస్తామని, వారికి కూడా రూ.2వేలు అందించి ఆసరాగా నిలుస్తామని ఆయన పేర్కొన్నారు.   

ఎవరూ ప‌ట్టించుకోలేదు..
‘‘45 ఏళ్లకే పెన్షన్‌ అనే భావన ఏ నేపథ్యంలో వచ్చిందనేది చాలా ముఖ్యమైన అంశం. పాద యాత్ర ప్రారంభం కావడానికి ఒక వారం రోజుల ముందు.. 37 రోజులుగా ధర్మవరంలో చేనేత కార్మికులు నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఎవరూ వాళ్ల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. అప్పటికే ధర్మవరంలో 35 మంది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. అక్కడ నిరాహారదీక్షలో పాల్గొంటు న్నవారంతా మహిళలు. చాలా బాధ అనిపిం చింది. అక్కడికి వెళ్లినపుడు ఈ ఆత్మహత్యలకు కారణమేమిటమ్మా అని వాళ్లను అడిగాను. బతకడానికి ఇబ్బందికర పరిస్థితులున్నాయన్నా.. పనులకు పోతేగానీ కడుపు నిండని పరిస్థితి అని చెప్పారు. చేనేత కార్మికులే కాదు ఎవరిని తీసుకున్నా కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఎంత అట్టడుగు స్థాయిలో ఉన్నారంటే పనులకు పోతేగానీ కడుపు నిండని పరిస్థితి. పొరపాటున వీళ్లకు ఒక వారంరోజుల పాటు జ్వరం వచ్చినా, ఆరోగ్యం సహకరించకపోయినా పనులకు పోకపోతే వీళ్ల పరిస్థితి ఎంత దారుణమంటే పస్తు పడుకోవలసిన పరిస్థితి. అంతటి దుర్భరమైన పరిస్థితుల్లో ఈ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అది చూసిన నాకు చాలా బాధనిపించింది. నిజానికి ఇది ఒక ఉద్వేగభరితమైన నిర్ణయమే. ఒక నిర్ణయం తీసుకుని ఆరోజు ప్రకటించాను.

పలకరించిన పాపాన పోలేదు..
45 ఏళ్లకే పెన్షనా అని విమర్శించేవాళ్లు విమర్శిస్తారు. చాలామంది వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేస్తారు. కానీ వాస్తవమేమి టంటే.. వీళ్లకెవరికీ కూడా ఆ కుటుంబాలు ఎలా బతుకుతున్నాయి అన్న స్పృహ లేదు. ఆ కుటుంబాలను వీళ్లెవరూ ఓదార్చలేదు. ఎలా బతుకుతున్నారని పలకరించిన పాపాన పోలేదు. వీళ్లకు తెలుసుకోవాలన్న తాప త్రయం అంతకన్నా లేదు. అవసరమైతే పేరు మారుద్దాం.. ‘వైయ‌స్ఆర్  చేయూత పెన్షన్‌’ అని పెడదాం. కచ్చితంగా 45 ఏళ్లు నిండిన ప్రతి అక్కకు నెలకు రూ.2,000 ఇచ్చి ఆ కుటుంబానికి తోడుగా ఉంటాం. కనీసం రూ.2వేలన్నా ఆ అక్కకు చేరితే ఆ కుటుంబం బతకడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. పేదరికంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కలకు తోడుగా ఉంటాం.

 అందరికీ 60 ఏళ్లకే పెన్షన్‌ 
అంతేకాదు పెన్షన్ల వయసు కూడా ఇవాళ 65 ఏళ్ల వయసు నిండితే తప్ప పెన్షన్‌ ఉండటం లేదు. దీన్ని 60 ఏళ్లకు తగ్గిస్తాం. అందరికీ వర్తించేలా చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు మొన్నటివరకు 58 ఏళ్లకే రిటైర్మెంట్‌. అలాంటిది ప్రభుత్వం 60 ఏళ్లకు పెంచింది. అంటే 60 ఏళ్లకు వృద్ధులు అన్న భావన కల్పించింది. పెన్షన్ల దగ్గరకు వచ్చేసరికి సర్కార్‌ అవ్వాతాతల పట్ల వివక్ష చూపిస్తోం ది. అందుకే 65 ఏళ్లకు రాష్ట్రప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ల వయోపరిమితిని తగ్గించి అందరికీ 60 ఏళ్లకే పెన్షన్‌ ఇస్తాం. ప్రతి ఒక్కరికీ రూ.2,000 ఇస్తాం. వారితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద మహిళలకు 45 ఏళ్లకే రూ.2,000 వైయ‌స్ఆర్‌ చేయూత కింద అందించి  తోడుగా ఉంటాం.  అవ్వాతాతలకు వయసు మీరే కొద్దీ ఒక్క ఆహారానికే కాదు మందులకు, ఆసుపత్రికీ ఖర్చవుతుంది. చిన్నచిన్న వ్యాధులకు కూడా వీరు ఎక్కడికీ పోలేని పరిస్థితి. ఎవరిపైనా ఆధారపడలేని స్థితి. అలాంటి అవ్వాతాతలకు ఎంత చేసినా తక్కువే. కాబట్టి వాళ్లందరికీ తోడుగా ఉండే కార్యక్రమం కచ్చితంగా చేసి తీరతాం. పెన్షన్‌ కచ్చితంగా రూ.2,000 చేయాల్సిన అవసరం ఉంది.’’ అని వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

Back to Top