కచ్చితంగా మీ రుణం తీర్చుకుంటా





- మీరిచ్చిన స్ఫూర్తి, ఆదరాభిమానాలే నన్ను నడిపించాయి
- మీరు చూపిన ఆదరాభిమానాలు మరువలేనివి
-  నాన్నగారి పాలనకంటే గొప్ప పాలన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా

దేవుడు ఆశీర్వదిస్తే.. ఇన్ని కోట్ల మంది దీవిస్తే ఒక్కరికి అవకాశం వస్తుంది ఆ సీట్లో కూర్చోవడానికి. ఆ సీట్లో కూర్చున్నపుడు మనమేం చేయాలి? అన్న ఆలోచనలే ఇవాళ ముఖ్యమంత్రులకు కరవయ్యాయి. ఆ దేవుడు ఆ అవకాశం ఇచ్చినప్పుడు, ఆ ప్రజలు దీవించినపుడు ప్రతి రోజూ.. ఇక రేపు లేదన్నట్లుగా ప్రజల కోసం తపించాలి. మనం చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లోనూ, వారి ఇళ్లల్లోనూ మన ఫొటో ఉండాలని ఆరాటపడాలి. కానీ అలాంటి పాలన కరవైన పరిస్థితులు నేడున్నాయి.  
 
మీరు (ప్రజలు) నడిపిస్తూ.. నాపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న తీరును ఎప్పటికీ నేను మరచిపోలేను. దేవుడు నన్ను ఆశీర్వదించి మంచి చేసే పరిస్థితి, అవకాశం ఇచ్చినప్పుడు కచ్చితంగా ఈ రుణం తీర్చుకుంటాను. నాన్నగారి పాలనకన్నా కూడా ఇంకా గొప్ప పాలన ఇచ్చే దానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తాను.  

ప్రజలు తనకు ఇచ్చిన స్ఫూర్తి, వారు చూపిన ప్రేమానురాగాలే ఈ 200 రోజులు తనను వారి మధ్య నడిపించాయని.. అందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ అన్నారు. దేవుడు ఆశీర్వదించి ప్రజలకు మంచి చేసే అవకాశం ఇచ్చినప్పుడు కచ్చితంగా వారి రుణం తీర్చుకుంటానని చెప్పారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర సాగిస్తున్న జగన్‌ బుధవారం తన 200 రోజుల పాదయాత్రను పూర్తి చేసిన అనంతరం ‘జగన్‌ స్పీక్స్‌’ పేరుతో ఒక వీడియోను విడుదల చేశారు. అందులో జగన్‌ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఇలా ఉంది..  

‘ఇడుపులపాయలో మొదలుపెట్టి నా పాదయాత్ర ఇవాల్టికి 200 రోజులైంది. దాదాపుగా 2,450 కిలోమీటర్ల యాత్రను పూర్తి చేశాను. వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు ఇది చేయగలుగుతామా? అని అనిపించే పరిస్థితుల నుంచి సునాయాసంగా ఇవాళ ముందుకు సాగ గలుగుతున్నాను. ఇలా నేను ముందుకు సాగడానికి కారణం కేవలం దేవుడి దయ, మీ (ప్రజల) దీవెనలేనని నేను చెప్పగలను. ప్రతి అడుగులోనూ నాన్న తోడుగా ఉండి నడిపిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉన్నా..  మేమంతా నీకు తోడుగా ఉన్నామన్నా.. అంటూ దారి పొడవునా అక్క చెల్లెమ్మలు దీవించడం, అవ్వాతాతలు ఆశీర్వదించడం, చిన్న పిల్లలు సైతం అదే పనిగా బయటకు వచ్చి అన్నా మేం కూడా తోడుగా ఉన్నామన్నా.. అనడం వల్లనే ఈ 200 రోజులు నడవగలిగాను. వారి ఆప్యాయతలు, ప్రేమానురాగాలే నన్ను నడిపించగలిగాయని కచ్చితంగా చెబుతున్నా.


ఇక దారిపొడవునా నేను చూసిన సమస్యలు నిజంగా మనసుకు చాలా బాధ కలిగించాయి. రైతుల దగ్గరి నుంచి చూస్తే అన్నీ సమస్యలే. గిట్టుబాటు ధరలు రాక వారు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం దగ్గరుండి రుణాలు మాఫీ కాకుండా చేసిన తీరు వారిని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. రైతన్నల సమస్యలు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల సమస్యలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాక చదువుకుంటున్న పిల్లలు పడుతున్న ఇబ్బందులు దారుణంగా ఉన్నాయి. వారంతా ప్రస్తుతం నాన్నగారి రోజులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఆరోగ్యశ్రీని చూస్తే అసలు ఆరోగ్యశ్రీ ఉందా లేదా అనిపించే పరిస్థితుల్లో ఉంది. ఇళ్లు లేని నిరుపేదలు పూరి గుడిసెల్లో బతుకుతున్న తీరు బాధాకరమే.   
 
ఏది తీసుకున్నా మనసును కలచి వేసే సన్నివేశమే.. 
ఇవన్నీ కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో చేయగలిగి ఉండి కూడా.. చేయని కారణంగా ఉత్పన్నమైన సమస్యలే. ప్రభుత్వం మోసం చేసిన తీరు, ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేకపోవడం వల్లే ఈ పరిస్థితి. నిజంగా నాకొకసారి అనిపిస్తుంది.. ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడం అంటే ఎందుకు అని? దేవుడు ఆశీర్వదిస్తే.. ఇన్ని కోట్ల మంది దీవిస్తే ఒక్కరికి అవకాశం వస్తుంది ఆ సీట్లో కూర్చోవడానికి. ఆ సీట్లో కూర్చున్నపుడు మనమేం చేయాలి? అన్న ఆలోచనలే ఇవాళ ముఖ్యమంత్రులకు కరవయ్యాయి. ఆ దేవుడు ఆ అవకాశం ఇచ్చినప్పుడు, ఆ ప్రజలు దీవించినపుడు ప్రతి రోజూ ఇక రేపు లేదన్నట్లుగా ప్రజల కోసం తపించాలి. మనం చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లోనూ, వారి ఇళ్లల్లోనూ మన ఫొటో ఉండాలని ఆరాటపడాలి.

కానీ అలాంటి పాలన కరవైన పరిస్థితులు నేడున్నాయి. ప్రజలు పడుతున్న బాధలు చూసినప్పుడు నిజంగా మనసు చలించి పోయింది. నేను వేసే ప్రతి అడుగులోనూ.. ప్రజల బాధలు వింటూ.. వారికి భరోసా ఇస్తూ.. తోడుగా ఉంటూ మరో వైపు రేపు పొద్దున వచ్చే మంచి రోజుల గురించి ఒక ఆశను సృష్టించగలిగాం. నవరత్నాలు వస్తాయి.. మళ్లీ రాజన్న రాజ్యం తీసుకొస్తాము.. అన్న నమ్మకం, ఆశ ప్రజల్లో రేకెత్తించగలిగాం. ప్రజలు నిజంగా ఆ రోజు కోసం చూస్తున్నారు కాబట్టే ఇంతగా తోడుగా ఉండి ఆశీర్వదిస్తూ నడిపిస్తున్నారు. ఈ దీవెనలు నేను మరచిపోలేనివి. మీరు (ప్రజలు) నడిపిస్తూ.. నాపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న తీరును ఎప్పటికీ నేను మరచిపోలేను. దేవుడు నన్ను అశీర్వదించి మంచి చేసే పరిస్థితి, అవకాశం ఇచ్చినప్పుడు కచ్చితంగా ఈ రుణం తీర్చుకుంటాను. నాన్నగారి పాలనకన్నా కూడా ఇంకా గొప్ప పాలన ఇచ్చే దానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తాను. 

200 రోజులు నాకు స్ఫూర్తిని ఇచ్చి నడిపించినందుకు పేరు పేరునా ప్రతి అక్కా చెల్లెమ్మ, ప్రతి అవ్వాతాత, ప్రతి సోదరునికి, ప్రతి స్నేహితుడికి పేరు పేరునా హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ స్ఫూర్తి, మీ ప్రేమ, మీ ఆప్యాయతలే నన్ను ఈ 200 రోజులు నడిపించాయి. ఇంకా ఇచ్ఛాపురం వరకూ సాగాల్సిన ఈ ప్రజా సంకల్ప యాత్ర ముందడుగు కూడా మీ దీవెనలు, ఆశీస్సులతోనే నడుస్తుందని చెబుతూ.. పేరుపేరునా మరొక్కసారి హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.’  


తాజా వీడియోలు

Back to Top