హైదరాబాద్) అసెంబ్లీ లో స్పీకర్ వ్యవహరించిన తీరుని వైఎస్ జగన్ తప్పు పట్టారు. హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన స్పీకర్ కోడెల శివప్రసాద్ వైఖరిని సునిశితంగా విశ్లేషించారు. అసెంబ్లీ లో రూల్ పొజిషన్ చెబితే సస్పెండ్ చేసిన పరిస్థితిని మనం చూశామని వైఎస్ జగన్ చెప్పారు. రాజ్యాంగ ప్రకారం విప్ జారీ చేయటం, ఓటింగ్ అడగటం అన్నది పార్టీల హక్కు అని, అయినప్పటికీ స్పీకర్ కోడెల శివప్రసాద్ వీటిని కాలరాశారని పేర్కొన్నారు. వేరే పార్టీ ల తరపున గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారితే అనర్హుల్ని చేయకుండా ప్రజలు ఇచ్చిన తీర్పుని అవహేళన చేస్తున్నారని అభిప్రాయ పడ్డారు. స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెడితే 15 రోజుల తర్వాత మాత్రమే చర్చ చేపట్టాల్సి ఉండగా రూల్ ను సస్పెండ్ చేసి సభ నడపటం చూశామని పేర్కొన్నారు. చంద్రబాబు మీద అవిశ్వాసం పెడితే డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలను కాపాడేందుకు ఓటింగ్ లేకుండా స్పీకర్ వ్యవహరించిన తీరుని అంతా చూశామని చెప్పారు. ద్రవ్య వినిమయ బిల్లు లో డివిజన్ ఓటింగ్ అడిగితే ఇవ్వాలి. కానీ అలా చేయలేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రోజాను సస్పెండ్ చేశారు. పది మంది దాకా వైఎస్సార్సీపీ నుంచి వెళ్లిపోయి టీడీపీలో కూర్చొన్నారు. అయినా స్పీకర్ మాత్రం 67 మంది వైఎస్సార్సీపీ సభ్యులు అని చదువుతున్నారు. ఇంత కన్నా దారుణం ఏమైనా ఉంటుందా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. టీడీపీ సీట్లలో కూర్చొని భూమా నాగిరెడ్డి పీఏసీ నివేదిక సమర్పించటం, కలమట వెంకటరమణ ప్రసంగించటం చూవారని అయినా సరే స్పీకర్ మాత్రం ఇవే లెక్కలు వినిపిస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలను కాపాడటం కోసం చట్ట సభ స్పీకర్ కాస్తా టీడీపీ ఎమ్మెల్యేగా మారి ప్రవర్తిస్తున్నారని వైఎస్ జగన్ వివరించారు. వేరే పార్టీ బీ ఫామ్ ల మీద నెగ్గిన వారిని రాజీనామా చేయించే ధైర్యం కానీ, అనర్హూల్ని చేసే ధైర్యం కానీ లేదని, వాళ్లతో ఎన్నికలకు వెళ్లే నమ్మకం కానీ చంద్రబాబుకి లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు అన్యాయాలు, స్పీకర్ ను అడ్డు పెట్టుకొని చంద్రబాబు చేస్తున్న అన్యాయాల్ని గమనించి ప్రజలు గట్టిగా బుద్ది చెప్పాలని కోరుతున్నట్లు వైఎస్ జగన్ చెప్పారు. ఈ సందర్భంగా గతంలో తమ పార్టీలోకి ఎమ్మెల్యేలు వస్తామన్నప్పుడు అనర్హూలుగా చేయించి ఎన్నికలకు వెళ్లామని ఉదహరించారు. ఇటువంటి వాస్తవాల్ని ప్రజలకు తెలియచేయాలని మీడియా ప్రతినిధులకు వైఎస్ జగన్ సూచించారు.