అసైన్డ్ భూములంటే అత్తగారి భూములనుకుంటున్నారా..!

పరిశ్రమల పేరుతో దోపిడీ ఆపండి..!
భూములు లాక్కునే అధికారం ఎవరిచ్చారు చంద్రబాబు..!

మచిలీపట్నం: పరిశ్రమల పేరుతో చేస్తున్న దోపిడీని ఆపాలని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములు లాక్కునే అధికారం మీకు ఎవరిచ్చారని చంద్రబాబును ప్రశ్నించారు. అసైన్డ్ భూములంటే అత్తగారి భూములనుకుంటున్నారా  అని ప్రభుత్వాన్ని నిలదీశారు. భూములిచ్చేస్తే ప్రజలు ఎలా బతుకుతారని జననేత ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక చట్టాలను మార్చుతామని జగన్ స్పష్టం చేశారు. 

బలవంతపు భూసేకరణకు మేం వ్యతిరేకం..!
కృష్ణా జిల్లా మచిలీపట్నం పర్యటనలో భాగంగా తుమ్మలపాలెం రైతులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. అనుబంధ పరిశ్రమల పేరుతో భూములు గుంజుకుంటున్నారని...పారిశ్రామికవేత్తల కోసం రెండు పంటలు పండే భూములు లాక్కుంటున్నారని రైతులు వైఎస్ జగన్ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. బలవంతపు భూసేకరణను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని జగన్ చెప్పారు. భూములు ఇచ్చేందుకు ప్రజలకు ఇష్టం లేకున్నాఎందుకు బలవంతం చేస్తున్నారని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పేదల భూములు లాక్కొని ప్రైవేటు వాళ్లకు ఇచ్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. 

రైతులకు అండగా ఉంటా..!
ఏ ప్రభుత్వమైనా బలవంతంగా భూములు లాక్కోవడం దారుణం, అన్యాయమని జగన్ కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వం ప్రజలకు ఎప్పుడూ శ్రీరామరక్షగా ఉండాలి...ముఖ్యమంత్రి అంటే మా ముఖ్యమంత్రి అని చెప్పుకునేలా ఉండాలి కానీ, ఇక్కడ అందుకు విరుద్ధంగా జరుగుతుందని జగన్ అన్నారు. రైతులను ఇబ్బందులు పెడితే చూస్తూ ఊరుకునేది లేదని మరోసారి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అవసరమైతే బంద్ లు ,ధర్నాలు చేపట్టైనా చంద్రబాబు సర్కార్ పై ఒత్తిడి తెచ్చి భూములు కోల్పోకుండా రైతులకు అండగా ఉంటామని ప్రతిపక్ష నేత తేల్చిచెప్పారు. కర్మకాలి చంద్రబాబు సీఎం అయిన తర్వాత కృష్ణా డెల్టాకు కూడా కరవు వచ్చిందని జగన్ ఎద్దేవా చేశారు. 

Back to Top