డ్వాక్రా మహిళలను మోసం చేసిన బాబు: వైఎస్ జగన్‌


అనంతపురం: ‘‘మోసం చేసే వ్యక్తులను చాలామందిని చూశాం. కానీ మోసం చేసిన ముఖ్యమంత్రి మాత్రం చంద్రబాబే. డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలన్నీ  మాఫీ చేస్తానన్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి ఇదే చెప్పారు. చంద్రబాబు సంతకంతో ఉన్న కరపత్రాలను పంపిణీ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా చంద్రబాబు మహిళలను పూర్తిగా మోసం చేశారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. అనంతపురం జిల్లాలో ఆయన చేపట్టిన ‘రైతు భరోసా యాత్ర’ రెండోరోజు సోమవారం కొనసాగింది. ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు రైతుల కుటుంబాలను పరామర్శించారు. కొత్త చెరువు మండలం మరుకుంటపల్లిలో కె. కేశప్ప(50), బుక్కపట్నం మండలం కొత్తకోటలో బోయ సురేంద్ర(24) కుటుంబ సభ్యులను పరామర్శించి, రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం చేశారు. అంతకుముందు ఉదయం ఆయన కొత్తచెరువు మండలం చెన్నకేశవపురంలో లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి మరుకుంటపల్లికి చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కేశాని కేశప్ప కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి బాగోగులు తెలుసుకున్నారు. అక్కడి నుంచి కొత్తచెరువుకు వచ్చారు. డ్వాక్రా మహిళలతో మాట్లాడారు. కొందరు మహిళలు జగన్‌కు చూసి తమ గోడు వెళ్లబోసుకుని కంటతడి పెట్టారు. మహిళలందరికీ ఆయన ఆప్యాయంగా అభివాదం చేశారు. మీ తరఫున పోరాడేందుకు నేనున్నానంటూ అభయమిచ్చారు.

దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు
అక్క చెల్లెళ్లందరికీ ఓ విన్నపం. ప్రస్తుతం ప్రభుత్వ వైఖరితో మీరు కష్టాల్లో ఉన్నారు. కష్టాలు అందరికీ వస్తాయి. దయ చేసి ఎవ్వరూ ప్రాణాలు తీసుకోవద్దు. ధైర్యంగా ఉండండి. కలసి కట్టుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దాం. మీ తరఫున నేను పోరాడతా. త్వరలోనే మంచి రోజులు వస్తాయి అని మహిళలకు జగన్ ధైర్యం చెప్పారు. ప్రభుత్వ వైఖరితో ఎలా నష్టపోయారో చెప్పాలని సూచించారు. దీంతో పలువురు మహిళలు ఎన్నికలకు ముందు తాము ఎలా ఆశపడ్డామో, ఇప్పుడు ఎలా మోసపోయామో వివరించారు. రెండోరోజు యాత్రలో జగన్ వెంట రాజంపేట ఎంపీ పెద్ది రెడ్డి మిథున్‌రెడ్డి, పార్టీ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త సోమశేఖరరెడ్డి, హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త శ్రీధర్‌రెడ్డి, కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతవెంకట్రామిరెడ్డి, ప్రోగ్రాం కో -ఆర్డినేటర్ తలశిల రఘురాం, క్రమశిక్షణ కమిటీ సంఘం సభ్యుడు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, జిల్లా నేత చవ్వా రాజశేఖరరెడ్డి తదితరులున్నారు. అంతకుముందు జగన్‌ను వైఎస్సార్ జిల్లా రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబులు కలసి మాట్లాడారు.
Back to Top