రైతుల కోసమే వైయస్‌ జగన్‌ దీక్ష

  • రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం
  • మద్దతు ధర విషయంలో నిద్రపోతున్నట్టు నటిస్తున్న బాబు
  • రైతులరా ప్రతిపక్ష నేత రైతు దీక్షకు తరలిరండి
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి
ఒంగోలు: రాజకీయాలతో సంబంధం లేకుండా రైతుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు దీక్ష చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి స్పష్టం చేశారు. దీక్షకు అన్ని రైతు సంఘాలను ఆహ్వానిస్తున్నామని, రైతాంగం అంతా కలిసివచ్చి తమ మద్దతును ప్రకటించాలని కోరారు.  రైతుల మద్దతు ధర విషయంలో నిద్రపోతున్నట్లుగా నటించొద్దని నాగిరెడ్డి చంద్రబాబుకు హితవు పలికారు.  అధికారంలోకి వస్తే ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. స్వామినాధన్‌ కమిటీ నివేదికలను అమలు చేస్తామన్నారు కానీ ప్రభుత్వానికి దేనిపై చిత్తశుద్ధి లేదన్నారు. చంద్రబాబు పరిపాలనలో వ్యవసాయ కార్మికులు రూ. 4 వేల కోట్లకు పైగా నష్టపోయారని, పంట దిగుబడి పడిపోయి రూ. 8 వేల కోట్లకు పైగా నష్టపోయారని నాగిరెడ్డి వివరించారు. తమిళనాడులో కరువు పరిస్థితిపై ఢిల్లీకి వెళ్లి అక్కడి రైతులు 40 రోజుల పాటు దీక్ష చేశారన్నారు. మనం కూడా మన సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలన్నారు. మే 1, 2 తేదీల్లో గుంటూరు వేదికగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు సమస్యలపై దీక్ష చేస్తున్నారని చెప్పారు. 

లక్షలాది మంది రైతులు కూలీలవుతున్నారు
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైందని నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం ఏపీలో ఖరీఫ్, రబీలో 10 లక్షల హెక్టార్‌ల భూమి బీడు భూమిగా తయారైందన్నారు. సాగు చేసిన 10 హెక్టార్‌ల భూమిలో పంటలు మొత్తం దెబ్బతిన్నాయన్నారు. ఆగస్టు సంక్షోభానికి రాయలసీమలో 80 శాతానికిపైగా పంటలు నష్టపోయాయని చెప్పారు. అదే విధంగా కృష్ణాడెల్టాలో లక్ష ఎకరాలకు పైగా దెబ్బతిన్నాయన్నారు. అనేక పంటలు దిగుబడితో పాటు ధరలు కూడా పడిపోయాయన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వరిగడ్డి కూడా దొరకడం లేదన్నారు. పశువులను కబేళాలకు పంపే దుస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాల నుంచి లక్షలాది మంది కుటుంబాలు పొట్టచేత పట్టుకొని ఇతర రాష్ట్రాలకు దినసరి కూలీలకు వెళ్తున్నారన్నారు. ప్రభుత్వం కనీసం రైతులకు ఇన్‌పుట్‌ సబ్సీడీ కూడా చెల్లించడం లేదని దుయ్యబట్టారు. రాజకీయాలకు అతీతంగా రైతుల కోసం పోరాటం చేస్తున్న వైయస్‌ జగన్‌ దీక్షకు రైతులంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. 
Back to Top