హైదరాబాద్) శాసనసభ లో ప్రజాస్వామ్యానికి మరోసారి పాతర వేశారు. స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నిబంధనల్ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించి అప్పటికప్పుడు నోటీసును టేకప్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి నిరసన తెలుపుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాట్లాడుతూ సూటిగా ప్రశ్నలు గుప్పించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రక్షించేందుకే ఈ చర్య తీసుకొంటున్నట్లు అర్థం అవుతోందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇతర పార్టీ బీ ఫామ్ ల మీద, ఇతర పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలను లాక్కొంటున్నందుకు సిగ్గు ఉండాలి. మా పార్టీ బీ ఫామ్ మీద గెలిచిన నాయకుల్ని ప్రలోభాలు పెట్టి, మీరు మీ అవినీతి సొమ్ముతో కొనుగోలు చేశారు. అటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యేలను కాపాడేందుకు ప్రభుత్వం నానా తంటాలు పడుతోందని వైఎస్ జగన్ మండిపడ్డారు. నిబంధనల ప్రకారం చూస్తే అవిశ్వాస తీర్మానం మీద నోటీసు ఇస్తే 14 రోజులు తర్వాత తేదీ నిర్ణయించాలని ఉంది. అప్పుడు ఒక తేదీ నిర్ణయించి, అది కూడా నాలుగు రోజుల ముందు తెలియచేసి, విప్ జారీ చేసే అవకాశం ఇచ్చి వ్యవహరించాలని వైఎస్ జగన్ అన్నారు. అంతే కానీ పార్టీ ఫిరాయించిన 8 మంది ఎమ్మెల్యేలను కాపాడేందుకు తంటాలు పడుతున్నారు. విప్ జారీ చేసేందుకు టైమ్ ఇవ్వకుండా, వాళ్లు అందలేదు, చేరలేదు అని సాకులు చెప్పుకొనేందుకు వీలుగా నిర్ణయం తీసుకొన్నారు. ఇటువంటి చర్యలతో ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా చేస్తున్నారు అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఈ విధంగా రూల్స్ ను సస్పెండ్ చేసుకొంటూ పోతే ఏ రూలూ ఉండదని వైఎస్ జగన్ అభిప్రాయ పడ్డారు. సంఖ్యాబలం ఉంది కదా అని నిబంధనల్ని సస్పెండ్ చేసుకొంటూ పోతే అర్థం ఏమిటి అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా నాయకులకు ఉండే రెండు లక్షణాల్ని వైఎస్ జగన్ ఉదహరించారు. క్యారక్టర్ మరియు క్రెడిబిలిటీ అనేవి ఉండాలని, అంటే వ్యక్తిత్వం మరియు విశ్వసనీయత అనేవి నాయకులకు ఉండాలని వివరించారు. కానీ, చంద్రబాబు నాయుడుకి ఇవి రెండూ లేవని చెప్పారు. అధికారం కోసం సొంత మామ ను వెన్నుపోటు పొడిచిన క్యారెక్టర్ చంద్రబాబుది అని చెబుతుండగానే స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మైక్ ను కట్ చేశారు.