అందరు ధైర్యంగా ఉండండి

– ముస్లిం యువకులకు వైయస్‌ జగన్‌ భరోసా
– జననేతను కలిసిన గుంటూరు ఘటన బాధిత ముస్లిం యువకులు
– ముస్లింలపై నమోదైన కేసులు ఎత్తేస్తామని వైయస్‌ జగన్‌ హామీ
విశాఖ‌:  ముస్లిం యువ‌కులు ధైర్యంగా ఉండాల‌ని, చంద్ర‌బాబు బ‌నాయించిన త‌ప్పుడు కేసుల‌న్నీ వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే ఎత్తేస్తామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు.  ఈ నెల 28న గుంటూరులో ‘నారా హమారా.. టీడీపీ హమారా’ సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాంతి యుతంగా నిరసన తెలిపిన ముస్లిం యువకులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని, దాదాపు 30 గంటలపాటు నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేసిన విషయం తెలిసిందే. బెయిల్‌పై విడుదలైన కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఈ 8మంది ముస్లిం యువకులు బుధవారం వైయ‌స్‌ జగన్‌ను కలిశారు. ముస్లిం యువకులను అడిగి సంఘటన వివరాలు తెలుసున్న జననేత ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక అధికారి ఒక విధంగా, మరో అధికారి మరో విధంగా మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. ముస్లిం యువకులను కొట్టి, వారిపై దొంగ కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో ముస్లిం నాయకత్వానికి గుర్తింపు లేదని, 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు చెప్పినవి అమలు కాలేదని ప్రశ్నించిన నేరానికి, వీరేదో దేశాన్ని విభజించాలని కోరినట్లు చిత్రీకరించడం దుర్మార్గమన్నారు. ముస్లిం యువలకుపై దేశ ద్రోహం కేసు నమోదు చేయడం బాధాకరమన్నారు. అందరూ ధైర్యంగా ఉండాలని వైయస్‌ జగన్‌ భరోసా కల్పించారు. చంద్రబాబు అరాచకాలన్నీ పైనున్న దేవుడు చూస్తున్నారని, సమయం వచ్చినప్పుడు ఆయనకు గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. 
Back to Top