బాబూ..నీకు బుద్దుందా?

 


– బాబు లాంటి దారుణమైన సీఎం ఎక్కడా ఉండడు
–వైయస్‌ఆర్‌ హయాంలో మూతపడిన చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించారు.
 – బాబు వచ్చారు మళ్లీ ఆ రెండు చక్కెర ఫ్యాక్టరీలు మూతపడ్డాయి
 –గ్రానైట్‌ ఫ్యాక్టరీల్లో విఫరీతంగా విద్యుత్‌ చార్జీలు పెంచారు
– నియోజకవర్గంలోని 36 చెరువులకు నీరు నింపలేకపోయారు
– నల్లధనాన్ని దాచుకునేందుకు బాబు విదేశీ పర్యటనలు
–నాలుగేళ్లలో మూడుసార్లు కరెంటు బిల్లులు, ఆర్టీసీ చార్జీలు పెంచారు.
– నాన్నగారితోనే ఆరోగ్యశ్రీ పోయింది.
– జనం అప్పులపాలయ్యేది పిల్లలను చదివించుకునేందుకు, వైద్యం కోసమే
– చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకురావాలి.
 
చిత్తూరు: చంద్రబాబు పాలనలో ఎటు చూసినా మోసం, అబద్ధాలు కనిపిస్తున్నాయి. భూమి స్వభావాన్ని బట్టి నల్లబెల్లం, తెల్లబెల్లం తయారు అవుతుందని, ఆ విషయం తెలియకుండా నల్లబెల్లంపై ఆంక్షలు విధించడం దుర్మార్గమని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. అసలు చంద్రబాబుకు బుద్ది ఉందా అని ఆయన ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా  గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పెనుమూరు గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించారు.

బాబు లాంటి దారుణమైన సీఎం ఎక్కడా ఉండడు
గంగాధర్‌ నెల్లూరు నియోజకవర్గంలో అడుగుపెట్టిన నాటి నుంచి అన్నా..నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అవస్థలు పడుతున్నారని రైతన్నలు నా వద్దకు వచ్చారు. చెరుకు రైతులు నల్లబెల్లాన్ని పట్టుకొని నా వద్దకు వచ్చారు. అన్నా..మా ఖర్మ చూడండన్నా..సహకార రంగంలోని చిత్తూరు, రేనుగుంట చక్కెర ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీల వల్ల రైతులకు గిట్టుబాటు ధర వస్తుందని చెప్పారు. మా ఖర్మ ఏంటంటే చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఈ ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయని చెప్పారు. గతంలో 9 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రెండు ఫ్యాక్టరీలు మూత వేశారు. మహానుబావుడు వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆ రెండు ఫ్యాక్టరీలను తెరిపించారని రైతులు చెప్పారు. నాడు బ్రహ్మండంగా నడిచాయని, రైతులకు గిట్టుబాటు ధర వచ్చిందని చెప్పారు. మళ్లీ చంద్రబాబు సీఎం కాగానే చిత్తూరు, రేనుగుంట షుగర్‌ ఫ్యాక్టరీలు మూతపడ్డాయని చెబుతుంటే బాధనిపిస్తుంది. ఇంతకన్న దుర్మార్గమైన ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా ఉండడేమో?. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నాలుగు ప్రైవేట్‌ ఫ్యాక్టరీలు లాభాల్లో నడుస్తున్నాయని రైతులు చెబుతున్నారు. ప్రైవేట్‌ ఫ్యాక్టరీలు వారు కోరుకున్న రేట్లకు చెరకు కొనుగోలు చేస్తున్నారు. చెరకు రైతులు లాభాలు రావాలంటే బెల్లం తయారు చేయాలి. చంద్రబాబు సీఎం కాగానే నల్లబెల్లం తయారు చేయకూడదని జీవోలు ఇచ్చారు. నల్లబెల్లం తయారి చేస్తే పోలీసులు వచ్చి పట్టుకుంటారట. అయ్యా..ఈ జిల్లాలో అత్యధిక శాతం భూమి నల్లబెల్లమే పండుతుంది. అసలు నీకు బుద్ధి ఉందా? నల్లబెల్లం పండించేది రైతులకు లేదని, అది భూమి స్వభావాన్ని బట్టి పండుతుందని చెప్పారు. నల్లబెల్లంపై ఆంక్షలు విధించి జీవోలు ఇవ్వడం దుర్మార్గం. జిల్లా పొడువునా ఇక్కడికి వచ్చే వరకు చంద్రబాబు చేసిన మోసాలను చెబుతున్నారు. ఆయన హెరిటేజ్‌ పాల డైరీ కోసం విజయ డైరీని మూత వేయించారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహకార రంగంలో విజయ డైయిరీ ఉండబట్టి రైతులకు మంచి గిట్టుబాటు రేటు వచ్చేది. చిత్తూరు, విజయడైయిరీల పాలక మండలిల్లో చంద్రబాబు తనకు అనుకూలమైన వారిని నియమించి పద్ధతి ప్రకారం ఆ డైయిరీలను మూత వేయించారు. రైతులకు మూడు, నాలుగు నెలలు డబ్బులు ఇవ్వకపోయే సరికి వారంతా కూడా హెరిటేజ్‌ డైయిరీకి పాలు పోయాల్సి వచ్చింది. సీఎం అనే వ్యక్తి సహకార రంగానికి తోడుగా ఉండి రైతులను ఆదుకోవాలి.  అప్పుడు రైతుల ముఖాల్లో చిరునవ్వులు పూస్తాయి. చంద్రబాబు దగ్గరుండి పాల డైయిరీలను మూత వేయించాడంటే ఈయన నిజంగా మనిషేనా?

ఇంతవరకు టెండర్లు పిలువలేదు..
 ఇదే నియోజకవర్గంలో సాగునీరు, తాగునీరు లేదు. ఎన్‌టీఆర్‌ జలాశయం నుంచి 36 చెరువులు నింపేందుకు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో భూములు కొనుగోలు చేసి అన్ని సిద్ధం చేశారు. మహానేత అకాల మరణంతో ఆ చెరువులకు ఇంతవరకు టెండర్లు పిలువడం లేదు.

నల్లధనం దాచుకునేందుకే..
ఇదే చంద్రబాబు నెలకోసారి విదేశాలకు వెళ్తారు. ప్రతిసారి ప్రైవేట్‌ విమానాల్లో విదేశాలకు వెళ్లి సేద దీరుతున్నారు. ఆయన వెళ్లిన ప్రతి సారి పరిశ్రమలు తీసుకురావడానికి వెళ్తున్నానని ఊదరగొడుతున్నారు. వాస్తవానికి ఆయన ఇక్కడ దోచుకున్న నల్లదనాన్ని దాచుకోవడానికి విదేశాలకు వెళ్తున్నారు. ఇదే జిల్లాలో 400పైగా గ్రానైట్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇందులో ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. చంద్రబాబు సీఎం కాగానే కరెంటు చార్జీలు యూనిట్‌కు రూ.8.75 పైసలకు పెంచారు. రాయల్టీ చార్జీలు రూ.2400 పెంచారు. ఈ చార్జీలు కట్టలేక గ్రానైట్‌ ఫ్యాక్టరీల యజమానులు మూత వేసుకుంటున్నారు. చంద్రబాబు ఇక్కడున్న ఫ్యాక్టరీలను ఎలా నడిపించాలో ఆలోచించకుండా సోది చెబుతున్నారు. ఇదే జిల్లాలో రెండు చక్కెర ఫ్యాక్టరీలు మూత వేయించింది వాస్తవం కాదా?

– చంద్రబాబు హయాంలో పరిపాలన ఎంత దారుణంగా జరుగుతుందో చెప్పడానికి ఇదే జిల్లాలోని సీనరేజ్‌ చార్జీలు రూ.2400 వరకు పెంచారు. అదే కుప్పం నియోజకవర్గంలో మాత్రం రూ.1200 తగ్గించారు. చంద్రబాబు పాలన మొదలై నాలుగేళ్లు అవుతుంది. మీ అందరికి అడుగుతున్నాను. కనీసం ఒక్క ఎకరా అయినా పేదవారికి భూమి పంపిణీ చేశారా?. అసైన్డ్‌ భూములను తన అత్తగారి సొత్తు అన్నట్లుగా లాక్కుంటున్నారు. 

ఎడా పెడా చార్జీల బాదుడు
– కరెంటు బిల్లులు షాక్‌ కొడుతున్నాయన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు బిల్లులు తగ్గిస్తానన్నారు. ఇప్పటికీ మూడు సార్లు కరెంటు బిల్లులు పెంచారు. ఆర్టీసీ చార్జీలు మూడు సార్లు పెంచారు. పెట్రోలు చార్జీలు విఫరీతంగా పెంచారు. తమిళనాడులో రూ.7 లీటరుకు తక్కువగా వ స్తున్నాయి. కర్నాటకలో రూ.5 తక్కువకు పెట్రోలు లభిస్తోంది. 
 
ఒక్క వాగ్ధానం కూడా నెరవేర్చలేదు
ఇదే పెద్ద మనిషి ఎన్నికలప్పుడు ఏమన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన మీ బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎ కావాలన్నారు. రూ. 87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రాలేదు..కానీ నోటీసులు మాత్రం ఇంటికి వస్తున్నాయి. ఆయన చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. టీడీపీ పాలనలో రేషన్‌ షాపుల్లో బియ్యం తప్ప మరేది దొరకడం లేదు. నాడు జాబు కావాలంటే బాబు రావాలన్నారు. జాబు ఇవ్వకపోతే ప్రతి ఇంటికి రూ.2 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్నారు. 45 నెలలుగా చంద్రబాబు నిరుద్యోగ భృతి ఇవ్వలేదంటే ప్రతి ఇంటికి రూ.90 వేలు బాకీ పడ్డారు. ఆడవాళ్లను మోసం చేయాలంటే వాళ్ల ఉసురు తగులుతుందంటారు. ఆడవాళ్లు కన్నీరు పెట్టడం రాష్ట్రానికి అరిష్టం అంటారు. బాబు ఆ నాడు పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తామన్నారు.  ఒక్క రూపాయి అయినా మాఫీ అయ్యిందా? ఇంత దారుణంగా పరిపాలన చేసే వ్యక్తి చంద్రబాబు. 

టీడీపీ పాలనలో విచ్చలవిడిగా అవినీతి
ఇవాళ మట్టి, ఇసుక, మద్యం, బొగ్గు, కాంట్రాక్టులు, రాజధాని భూములు, చివరకు గుడి భూముల వరకు అవినీతే కనిపిస్తోంది. గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియాను తయారు చేశారు. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. ఈ వ్యవస్థలో నిజాయితీ, విశ్వసనీయత అన్న పదాలు రాకపోతే ఇదే చంద్రబాబు రేపొద్దున పెద్ద పెద్ద మోసం చేస్తారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం అంటారు. ఇంతటితో నమ్మరని ప్రతి ఇంటికి బెంజి కారు కొనిస్తా అంటారు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ, విశ్వసనీయత రావాలంటే వైయస్‌ జగన్‌కు మీ అందరి దీవెనలు, ఆశీస్సులు కావాలి. అప్పుడే ఈ వ్యవస్థలో మార్పు వస్తుంది.
– రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నవరత్నాలను మనం ప్రకటించాం. ఈ పథకాల ద్వారా ప్రతి ఒక్కరిలో చిరునవ్వులు చూడాలన్నదే నా థ్యేయం. ఇందులో ఏదైనా మార్పులు, చేర్పులు చే యాలంటే సలహాలు, సూచనలు ఇవ్వమని కోరుతున్నాను. 

నాన్నగారు అనేవారు..
దారి పొడువునా 57 రోజులుగా పాదయాత్ర చేస్తూ వచ్చాను. ఎక్కడికి వెళ్లినా పేదలు అన్నా..వైద్యం చేయించుకోలేక అప్పులపాలు అవుతున్నామని  వాపోతున్నారు. ఆరోగ్యశ్రీ వర్తించడం లేదని ఆందోళన చెందుతున్నారు. నాన్నగారు ఎప్పుడు అంటుండే వారు. పేదవారు తమ పిల్లలను గొప్ప చదువులు చదివించేందుకు, కుటుంబ పెద్ద వైద్యం కోసం అప్పుల పాలు అయ్యేవారని మహానేత చెప్పేవారు. ఏ పేదవాడు కూడా అప్పులపాలు కాకుండదన్న ఉద్దేశంతో నాడు 108 అంబులెన్స్, ఆరోగ్యశ్రీ, 104 వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు.  ఇవాళ 108 నంబర్‌కు విశ్వసనీయత పోయింది. ఇవాళ గుండే, కిడ్నీ సంబంధిత ఆపరేషన్లు చేయించాలంటే చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్‌కు వెళ్తాం. కానీ ఇవాళ ఈ ప్రాంతాల్లో ఆపరేషన్‌ చేయించుకుంటే ఆరోగ్యశ్రీ వర్తించదట. పోనీ ఇక్కడైనా మంచి ఆసుపత్రులు ఉన్నాయా అంటే అది లేదు. చిన్న పిల్లలకు ఎవరికైనా మూగ, చెవుడు వస్తే వారికి కాంక్లీయర్‌ ఇన్‌ ప్లాంట్‌ ఆపరేషన్‌ చేయించాలంటే రూ.6 లక్షలు ఖర్చు అవుతుంది. అలాంటి ఆపరేషన్లు నాన్నగారు ఉచితంగా చేయించేవారు. ఇవాళ ఇలాంటి ఆపరేషన్లు ఈ ప్రభుత్వం చేయించడం లేదు. కిడ్నీలు బాగలేకపోతే డయాలసిస్‌ చేయించాలి. నెలకు రూ.20 వేలు ఖర్చు అవుతుంది. ఇవాళ డయాలసిస్‌ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయడం లేదు. క్యాన్సర్‌ పేషేంట్ల పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. 7, 8 సార్లు కీమో థెరపీ చేయించాల్సి ఉంది. కానీ ఈ ప్రభుత్వం కేవలం ఒకటి, రెండు సార్లు మాత్రమే కీమో థెరపీ చేయిస్తున్నారు. ఆరోగ్యశ్రీలోని నెట్‌వర్క్స్‌ ఆసుపత్రులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు.

ఆయన కొడుకుగా నేను రెండు అడుగులు వేస్తున్నాను..
దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పేదవాడి కోసం ఒక్క అడుగు ముందుకు వేస్తే ఆయన కొడుక్కుగా నేను రెండు అడుగులు ముందుకు వేస్తున్నాను. ఆరోగ్యశ్రీ ద్వారా ఎక్కడ ఆపరేషన్‌ చేయించుకున్నా ఉచితంగా చేయిస్తానని మాట ఇస్తున్నాను. రేపు మనందరి ప్రభుత్వం వచ్చాక ప్రతి పేదవాడికి వైద్యం రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొని వస్తాం. పేదవాడికి తోడుగా ఉండి రూపాయి కూడా ఖర్చు కాకుండా చిరునవ్వుతో వైద్యం చేయించి ఇంటికి పంపిస్తాను. ఆపరేషన్‌ చేయించిన తరువాత విశ్రాంతి తీసుకునే సమయంలో డబ్బులు ఇస్తాం. అంతేకాదు.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారందరికీ చెబుతున్నాను. మీ పింఛన్‌ రూ.10 వేలకు పెంచుతాను. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి, మీ అందరి దీవెనలతో మనందరి ప్రభుత్వం వచ్చిన తరువాత మనం అమలు చేసే నవరత్నాల్లో మార్పులు, చేర్పుల కోసం మీ అందరి సలహాలు, సూచనలు కోరుతున్నాను. మీ అందరి చల్లని దీవెలనలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను.




 
Back to Top