23నుంచి నెల్లూరు జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర

నెల్లూరు :   వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఈ నెల 23 నుంచి నెల్లూరు జిల్లాలో ప్రారంభ‌మ‌వుతుంద‌ని వైయ‌స్‌ జగన్‌ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో ప్రజాసంకల్పయాత్రపై చర్చించేందుకు పార్టీ నేతలు బుధవారం నెల్లూరులోని పార్టీ కార్యాల‌యంలో నేత‌లు భేటీ అయ్యారు. నెల్లూరు పార్లమెంటరీ జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లాలో వైయ‌స్ జగన్‌ పాదయాత్ర మార్గాన్ని ఖరారు చేశారు.  పాదయాత్ర సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, నెల్లూరు రూరల్‌, ఆత్మకూరు, కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో కొనసాగనుంది. ఈ సందర్భంగా  సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. గ‌తేడాది న‌వంబ‌ర్ 6వ తేదీన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైయ‌స్‌ఆర్ జిల్లా ఇడుపుల‌పాయ నుంచి ప్ర‌జాసంక‌ల్పయాత్ర‌ను ప్రారంభించార‌న్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాలను దాటుకుంటూ ఆయన ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న‌ట్లు చెప్పారు. వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తోందని తెలిపారు. వైయ‌స్‌ఆర్‌ సీపీకి కంచుకోట లాంటి నెల్లూరు జిల్లాలో వైయ‌స్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర కోసం ప్రజలు వేచి చూస్తున్నారని పేర్కొన్నారు.  మొత్తం పది నియోజకవర్గాలకు గాను 8 నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగనుంది.   
 
Back to Top