వైయస్ జగన్ ప్రజల మనిషి

  • టీడీపీని నదుల్లో ముంచేందుకు ప్రజలు సిద్ధం
  • ఇరిగేషన్‌ మంత్రి దేవినేని చవట, దద్దమ్మ
  • ద్వారకా తిరుమల సభకు వచ్చిన జనాన్ని చూసి టీడీపీకి చెమటలు
  • తప్పులను ఎత్తి చూపే హక్కు ప్రతిపక్షానికి లేదా..?
  • వైయస్ జగన్ సోనియాను ఎదిరించి ప్రతిపక్ష నేత అయ్యారు
  • బాబు అక్రమాలు, అవినీతిని ఎదిరించి ఇప్పుడు సీఎం అవుతారు
  • వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ 
విజయవాడ: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా చంద్రబాబు పార్టీని నదుల్లో అనుసంధానం చేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ అన్నారు. ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి పనికిరాని ప్యాకేజీని పట్టుకొని టీడీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. విజయవాడలో వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో జోగి రమేష్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణలు చేసిన మంత్రి దేవినేని ఉమాపై విరుచుకుపడ్డారు. దేవినేని ఉమా చవట, దద్దమ్మ అని విమర్శించారు. ఇరిగేషన్‌ మంత్రి దేవినేని కృష్ణా జిల్లాకు చెందిన వాడు కావడం రైతులు చేసుకున్న కర్మ అని వ్యాఖ్యానించారు. కృష్ణా డెల్టా సస్యశ్యామలం అయిపోయిందన్న దేవినేనికి జోగి రమేష్‌ సవాలు విసిరారు.  దమ్ముంటే మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, కైకలూరు నియోజకవర్గాలకు తనతో పాటు రావాలని సూచించారు. డెల్టా ప్రాంతమంతా నీరు లేక పంటలు అల్లాడుతుంటే దద్దమ్మ దేవినేని పట్టిసీమ అని జపిస్తున్నాడని మండిపడ్డారు. పట్టిసీమ పేరు చెప్పి చంద్రబాబు, దేవినేని ఉమా కోట్ల కొద్ది డబ్బులు దండుకున్నారని దుయ్యబట్టారు. 

ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై పిచ్చి కుక్కలా మొరుగుతున్నావు,  చంద్రబాబును రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షనేత ప్రశ్నించకూడదా అని దేవినేనిని జోగి రమేష్‌ ప్రశ్నించారు.అధికార పార్టీ చేసిన తప్పులను ఎత్తిచూపే హక్కు ప్రతిపక్షానికి లేదా అని నిలదీశారు. మ్యానిఫెస్టోలో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, పక్కా గృహాలు అన్నిఅమలు చేస్తామన్నారు. మీరిచ్చిన హామీలనే కదా ప్రతిపక్షనేత అడుగుతుందని చురకంటించారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డికి ఎక్కడ మంచిపేరు వస్తుందోనని 45 టీఎంసీల సామర్థ్యం ఉన్న పులిచింతల ప్రాజెక్టును చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. మంత్రి దేవినేని చేసిన వ్యాఖ్యలపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. దేవినేనితో చర్చకు ఎక్కడికైనా వస్తామన్నారు. అవసరమైతే వైయస్‌ఆర్‌ సీపీ కృష్ణా జిల్లా నేతలంతా కలిసి చర్చలో పాల్గొంటాం దమ్ముంటే రావాలని చాలెంజ్‌ చేశారు. 

ద్వారకా తిరుమలలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సభకు వచ్చిన లక్ష మంది ప్రజానీకాన్ని చూసి చంద్రబాబు ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయన్నారు. చంద్రబాబు ఆయన సభకు వెయ్యి మందిని పోగుచేసుకోవాలన్నా అధికార యంత్రాంగాన్ని మొత్తం ఉపయోగించుకోవాలన్నారు. కానీ వైయస్‌ జగన్‌ పేరు చెబితే ప్రజలంతా నిజమైన నాయకుడు, మాట తప్పని నాయకుడని ప్రజలు సభకు రావడానికి ఆరాటపడుతున్నారన్నారు. విశాఖ ఎయిర్‌ పోర్టులో జరిగిన ఘటనను జాతీయ మీడియా కూడా చూపించిందన్నారు. ఒక ప్రతిపక్షనేతను రన్‌వేపై ఎలా కూర్చోబెడతారని ప్రశ్నించిందన్నారు. వీరుడిలా ప్రత్యేక హోదా సాధించే దిశగా విశాఖకు వెళితే వెన్నుపోటు, గుంటనక్క ముఖ్యమంత్రి పోలీసులతో అణచివేయాలని చూశారని బాబుపై ధ్వజమెత్తారు. సోనియాగాంధీ ఓదార్పు యాత్రకు అడ్డు చెబితే వైయస్‌ జగన్‌ జనంలోకి వచ్చి ప్రతిపక్షనేత అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు అవినీతిని, అక్రమాలను ఎదిరించి ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ ప్రజల మనిషి .కోట్లాది మంది ప్రజల మనస్సులో ఆయనను ముఖ్యమంత్రిని చేయాలని ఉందన్నారు. 
 
Back to Top