బీసీ న్యాయవాదులకు సమర్థత లేదని లేఖ రాయడం నిజం కాదా బాబూ?




28–04–2018, శనివారం
మంటాడ, కృష్ణా జిల్లా

పెనమలూరు నియోజకవర్గంలోకి ప్రవేశించగానే.. పేదరికంలో మగ్గుతున్న మహిళల నిస్సహాయతను సొమ్ముచేసుకున్న కాల్‌మనీ కాలనాగులు గుర్తొచ్చాయి. ఆ విషనాగుల్ని వెనకేసుకుని, ఆ కేసుల్ని భూస్థాపితం చేస్తున్న ప్రభుత్వ పెద్దల కుటిల పన్నాగాలూ గుర్తొచ్చాయి. కాసేపు గుండె బరువెక్కి.. అడుగులుకాస్తా భారంగా పడ్డాయి.  

కాటూరులో జన్మతః అంధుడైన కుండేటి వెంకటేశ్వరరావు అనే అన్న నాపై ఎనలేని సోదర వాత్సల్యాన్ని చూపాడు. నాన్నగారి పాలనను నేటి పాలనతో బేరీజు వేసుకుంటూ.. ఈ రాష్ట్రానికి పట్టిన చీకట్లను పారదోలాలయ్యా.. అంటూ కంటతడిపెట్టాడు. ‘నాన్నగారి పుణ్యాన నా కు పింఛన్‌ వస్తోంది.. నాలాంటి వారెందరో పింఛన్లు రాక తల్లడిల్లిపోతున్నారని తెలిసి బాధేస్తోంది. నువ్వొచ్చాక అందరికీ న్యాయం చేయాలయ్యా.. ఆ నమ్మకం నాకుంది’అంటూ ఆ అన్న చెబుతుంటే.. ఇతరుల కోసం తాపత్రయపడుతున్న ఆ పెద్ద మనసుని చూసి.. వైకల్యం కళ్లకేగానీ మనసుకు లేదనిపించింది. కళ్లుండీ ప్రజల కష్టాలు చూడలేని కఠినాత్ములైన పాలకులకన్నా.. అంధుడైన ఆ అన్న ఎంతో ఉన్నతుడు కదా అనిపించింది. ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని భుజం తట్టి ఓదార్చాను.   


బోళ్లపాడు గ్రామానికి చెందిన వంగా సత్యనారాయణ అనే తాత నన్ను కలవగానే తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ‘అయ్యా.. మీ నాన్నగారు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం వల్లే నా ఇద్దరు మనవరాళ్లు నేను కలలో కూడా ఊహించని విధంగా ఉన్నత చదువులు చదివి.. మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కటిక పేదరికంలో ఉన్న మమ్మల్ని ఆ పథకమే ఆదుకుంది’అని ఆ తాతయ్య చెబుతుంటే.. గర్వంగా అనిపించింది. పెద్ద చదువులకు పేదరికం అడ్డుకాకూడదన్న నాన్నగారి ఆశయం.. సాధించిన ఫలితాలు.. అసామాన్యమైనవి. పేద ప్రజల జీవితాల్లో నింపిన చదువుల వెలుగులు.. లక్షల కుటుంబాల తలరాతలు మార్చడం ఎంతో ఆనందాన్నిచ్చింది.  

ఈ మధ్యాహ్నం బీసీ సంక్షేమ సంఘం నాయకులు కలిశారు. మేకవన్నె పులిలాంటి చంద్రబాబు నైజాన్ని ఎండగట్టారు. నమ్మితే మోసపోవడమేగానీ.. బాగుపడటం ఉండదన్నారు. బీసీ న్యాయవాదులు హైకోర్టు న్యాయమూర్తులుగా పనికిరారంటూ.. వారిని అసమర్థులుగా చిత్రీకరిస్తూ.. వారి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ.. తప్పుడు నివేదికలు తయారుచేసి రాతపూర్వకంగా కేంద్రానికి ఫిర్యాదుచేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, బడ్జెట్‌ కేటాయింపులు మొదలుకుని.. జడ్జీల నియామకం వరకూ అన్ని విషయాల్లో బలహీన వర్గాల వారిని దగా చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల కోసం బీసీలను వాడుకుని కరివేపాకులా తీసేసే చంద్రబాబు కపటత్వాన్ని గ్రహించామని.. ఆయనకు తప్పక బుద్ధిచెబుతామన్నారు.

న్యాయవ్యవస్థలో బీసీలను అణగదొక్కేందుకు చంద్రబాబు చేసిన మోసపూరిత కుట్రను హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, జాతీయ బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్యగారు ఆధారాలతో సహా బయటపెట్టి ఆవేదన వ్యక్తంచేస్తే.. మరోవైపు బాబుగారి బీసీ వ్యతిరేక వైఖరిపై పలు ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. ఆ విషయాన్ని మీడియాలో సైతం రానీయకుండా మేనేజ్‌ చేయడం బాబుగారికే చెల్లు. బీసీలపై కపట ప్రేమ ను చూపిస్తూ.. ఆ వర్గాలకు కత్తెర్లు, ఇస్త్రీపెట్టల్లాంటి నామమాత్రపు తాయిలాలిచ్చి, మభ్యపెట్టి.. వారిని ఎప్పటికీ అణగారిన వర్గాలుగా ఉంచడమే ఆయన లక్ష్యం. ‘బలహీన వర్గాలు అంటే.. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డవారే తప్ప.. మేథస్సులో ఎవరికీ తీసిపోరు’అన్న నాన్నగారి స్ఫూర్తిదాయకమైన మాటలెక్కడ.. వెనుకబడిన వర్గాలు అభివృద్ధి చెంది, చైతన్యం పొందితే.. ఎక్కడ తన గుప్పెట్లోంచి జారిపోతారో.. తన ఓట్ల కోటలకు ఎక్కడ బీటలు వారతాయోనని కుటిల రాజకీయాలు చేసే నిరంతర దురాలోచనల చింతనాపరుడు చంద్రబాబు ఎక్కడ!? 

ముఖ్యమంత్రిగారికి నాదో సూటి ప్రశ్న.. కొలీజియం ప్రతిపాదించిన లిస్టులోని బలహీన వర్గాలకు చెందిన న్యాయవాదులకు న్యాయమూర్తులుగా నియమితులయ్యే అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ.. వారికి సమర్థత, సచ్చీలత లేవంటూ మీరు కేంద్రానికి లేఖ రాయడం వాస్తవమా.. కాదా? దీనికి సమాధానం చెప్పే ధైర్యం మీకుందా? 
- వైయ‌స్‌ జగన్‌




తాజా వీడియోలు

Back to Top