చంద్రబాబుకు వైయస్‌ జగన్‌ బహిరంగ సవాల్‌

  • విదేశాల్లో రూపాయి ఉందని నిరూపిస్తే రాజకీయాల్లోంచి తప్పుకుంటా
  • నిరూపించకపోతే సీఎం పదవికి బాబు రాజీనామా చేయాలి
  • ప్రూ చేయడానికి 15 రోజులు టైం ఇస్తున్నా.. తీసుకో..
  • నంద్యాలలో పంచిన నల్లధనం నీకు ఎక్కడ నుంచి వచ్చింది
  • తెలంగాణలో ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికింది నువ్వా.. నేనా
  • నీతి నిజాయితీతో రాజకీయాలు చేస్తున్నా..
  • రాజన్న కొడుకు తప్పు చేశాడని ఎప్పుడూ అనిపించుకోలేదు..
  • చేసేదే చెబుతా.. చెప్పిందే చేస్తా..
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
వీఎన్‌పల్లి: విదేశాల్లో తనకు ఒక్క రూపాయి ఉందని చంద్రబాబు నిరూపించినా రాజకీయాల్లోంచి తప్పుకుంటానని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాబుకు బహిరంగ సవాల్‌ విసిరారు. ప్యారడైజ్‌ పేపర్‌లో తనను పేరును ప్రస్తావిస్తూ చంద్రబాబు తప్పుడు లీక్‌లు ఇస్తూ తన తోక పత్రికల ద్వారా తప్పుడు కథనాలు రాయిస్తున్నారని వైయస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. చాలా తెలివిగా తాను ఏదైనా గొప్ప కార్యక్రమం మొదలు పెట్టగానే అప్పుడే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తుంటారన్నారు. పాదయాత్ర మొదలు పెట్టగానే తనకున్న తోకపత్రికలతో లీకులు ఇప్పిస్తారు.. టీవీ ఛానళ్లు వారివే కాబట్టి వారు ఏది చెబితే అదే డోలు కొడుతారన్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడుకు 15 రోజుల సమయం ఇస్తున్నా.. తనకు విదేశాల్లో ఒక్క రూపాయి ఉందని నిరూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని, నిరూపించలేకపోతే చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని సవాలు విసిరారు. 

చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధం.. మోసం అని వైయస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా విదేశాల్లో డబ్బులు ఉంటే నంద్యాలలో ఎందుకు ఓడిపోతాం చంద్రబాబూ అని ప్రశ్నించారు. ఓటుకు రూ. 6 నుంచి 10 వేలు ఇచ్చింది నువ్వా.. నేనా అని నిలదీశారు. ముఖ్యమంత్రిగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన చంద్రబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో గొర్రెలను కొన్నట్లుగా రూ. 20 నుంచి 40 కోట్లు ఇస్తూ కొనుగోలు చేస్తున్నారన్నారు. ఎక్కడ నుంచి వచ్చింది నీకింత నల్లడబ్బు అని ప్రశ్నించారు. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయింది నువ్వు కాదా చంద్రబాబూ అని విరుచుకుపడ్డారు.

నంద్యాలలో ముస్లిం ఓట్లు అధికంగా ఉన్నాయని... వైయస్‌ జగన్‌ బీజేపీతో కలిసి నడుస్తున్నారంటూ బాబు దుర్మార్గపు ప్రచారాన్ని తీసుకొచ్చారని వైయస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. రిపబ్లిక్‌ ఛానల్‌లో వచ్చిన దాన్ని ఆంధ్రజ్యోతిలో ప్రతాక శీర్షికలో పెట్టి రాశారన్నారు. అసలు బీజేపీతో కలిసి ప్రయాణం చేసింది ఎవరూ.. ఎవరి మంత్రివర్గంలో ఎవరు ఉన్నారు.  ముస్లిం ఓట్లను దోచుకోవడానికి చంద్రబాబు కుళ్లు, కుతంత్రాలతో రాజకీయాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎదిరించా.. ఎవరికీ భయపడలేదు.. నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేస్తానని వైయస్‌ జగన్‌ అన్నారు. వైయస్‌ఆర్‌ కుమారుడు తప్పు చేశాడని ఎప్పుడూ అనిపించుకోలేదన్నారు. చేసేది నిజాయితీగా చేస్తా.. చెప్పేది.. నిజాలే చెబుతానన్నారు. 

Back to Top