నిండా మునిగిన రైతన్నపై ఎందుకంత వివక్ష

కాకినాడ : భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతుల వద్దకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాకపోవడం దారుణమని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం చినగొళ్లపాలెంలో వైఎస్ జగన్ పర్యటించారు.  వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి బాధిత రైతులను పరామర్శించారు.  జిల్లాలో లక్షన్నర ఎకరాలకుపైగా పంట నష్టపోతే... కేవలం 18 ఎకరాలే పంట నష్టం జరిగినట్లు అధికారులు చూపుతున్నారని విమర్శించారు. 

అధికారుల తప్పుడు లెక్కలు..
చాలా చోట్ల నష్టపోయిన రైతుల వద్దకు అధికారులు వెల్లడంలేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. గతంలో వచ్చిన లైలా, నీలం, జల్ తుఫాన్ లకు సంబంధించి ఇప్పటివరకు  రైతులకు నష్టపరిహారం అందలేదని, ఇప్పుడొచ్చిన తుఫాన్ కు పరిహారం వస్తుందో రాదోనన్న ఆందోళనతో రైతులు ఉన్నారని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో ఎంత పంట నష్టం జరిగిందో తెలిసినప్పుడు... రైతులకు ఒకే రకమైన పరిహారం ఇవ్వకుండా ఎందుకు వివక్ష చూపుతున్నారని వైఎస్ జగన్ ఉన్నతాధికారులను ప్రశ్నించారు. తప్పుడు లెక్కలు రాస్తూ ఒకరిద్దరికే ఎందుకు పరిహారం ఇస్తున్నారని ఈసందర్భంగా నిలదీశారు.  

ఉలుకు పలుకులేని ముఖ్యమంత్రి
జిల్లా అంతటా వర్షాలు కురిసినప్పుడు ఎన్యూమరేషన్ చేయడం దేనికని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భారీ వర్షాలకు గోదావరి జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో పంటంతా తడిసి కుళ్లిపోయింది. అధికారులు వచ్చి రాసుకుంటారని రైతులు పంటను అలాగే ఉంచితే ఏ ఒక్కరూ అక్కడకు రాని దుస్థితి. మరో వైపు కుళ్లిపోయిన ధాన్యం కోసి అమ్మితే రూ. 500 కూడా రాని దారుణ పరిస్థితుల్లో రైతులు ఉన్నారని వైఎస్ జగన్ అన్నారు. ముఖ్యమంత్రిగానీ, అధికారులు గానీ పంటల వద్దకు రావడం లేదు. మొలకెత్తిన ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పడం లేదు. కనీసం రైతులకు  భరోసా కల్పించే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఇంతకన్నా దుర్మార్గమైన  ముఖ్యమంత్రి మరొకరు ఉండరని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రైతన్నకు అండగా జననేత
ఎకరాకు 25 నుంచి 30 వేల వరకు అప్పులు చేసి మరీ పంటలు వేశామని రైతులు వైఎస్ జగన్ వద్ద కన్నీరుమున్నీరయ్యారు. చంద్రబాబు ఇక్కడకు వచ్చి దెబ్బతిన్న పంటలను చూస్తేనైనా జ్ఞానోదయం అవుతుందని ఆశిస్తున్నామని వైఎస్ జగన్ పేర్కొన్నారు.  అధైర్య పడొద్దని అండగా ఉంటామని వైఎస్ జగన్ రైతులకు భరోసా ఇచ్చారు.  భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది.  దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఇప్పటికే వైఎస్ఆర్, నెల్లూరు, చిత్తూరు జల్లాల్లో పర్యటించి... వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. 



తాజా వీడియోలు

Back to Top