వైయ‌స్ జగన్‌పై బురదజల్లే ప్రయత్నాన్ని మానుకోవాలి

 
ప్రకాశం:  వైయ‌స్ జ‌గ‌న్‌పై బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నాన్ని మానుకోవాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి,  సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ హిత‌వు ప‌లికారు. జగ్గంపేట సభలో కాపుల రిజర్వేషన్లకు సంబంధించి  వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి మాట్లాడిన మాటలను ఒక వర్గం మీడియా, టీడీపీ, కొందరు నాయకులు రాజకీయ స్వార్థం కోసం వక్రీకరించి  ఆ వ్యాఖ్యల స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని ఖండించారు.  రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కాపులతో సహా ఆయా రాష్ట్రాల్లో రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న వారి డిమాండ్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇవన్నీ తెలిసి తనకు ఓట్లు వేస్తే ఆరు నెలల్లో రిజర్వేషన్‌ కల్పిస్తామని కాపులకు చంద్రబాబు హామీ ఇచ్చి నిలువునా మోసం చేశారన్నారు. 

మంజునాథ కమిషన్‌ను ఏర్పాటు చేసిన చంద్రబాబు ఆ కమిషన్‌ చైర్మన్‌ సంతకం లేకుండా నివేదిక స్వీకరించి బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే న్యాయపరమైన అడ్డంకులు లేకుండా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో పొందుపరచుకునేలా చంద్రబాబు ఎందుకు ప్రయత్నం చేయలేకపోయారని వారు ప్రశ్నించారు. నాలుగేళ్లపాటు కేంద్రంలో అధికారంలో ఉండి, చంద్రబాబు 9వ షెడ్యూల్‌లో రిజర్వేషన్లు పెట్టించి ఉంటే ఈ పరిస్థితి రాదన్నారు. 

తమిళనాడు, కర్నాటక తరహాలో బీసీల ప్రయోజనాలు, హక్కులకు భంగం కలగకుండా, ఏ మాత్రం నష్టం జరగకుండా 50 శాతానికి మించి కాపులకు రిజర్వేషన్లు వచ్చి ఉండేవి కాదా అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబులా తాను గాలి మాటలు చెప్పలేనని, బూటకపు హామీలు ఇవ్వలేనని జగ్గంపేట సభలో వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారన్నారు. ముద్రగడ పద్మనాభం ఒక అజెండా పెట్టుకుని వేరొకరితో రాజకీయంగా ముందుకు వెళ్లాలన్న ఆలోచనతో వైయ‌స్ఆర్‌సీపీ పై, వైయ‌స్ జగన్‌పై అభాండాలు వేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.


Back to Top